Share News

ఆటోమేషన్‌లో అసంబద్ధాలు

ABN , Publish Date - Mar 03 , 2026 | 02:46 AM

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల నిర్వహణకు అధికారుల నియామకాల్లో అవలంబించిన ఆటోమేషన్‌ విధానంలో అసంబద్ధాలు దొర్లాయి. ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారులు ప్రకటించిన దానికి, ఆచరణకు పొంతన లేకుండా పోయింది.

ఆటోమేషన్‌లో అసంబద్ధాలు
ఒంగోలులోని డీఈవో కార్యాలయం

టెన్త్‌ పరీక్షల అధికారుల నియామకాల్లో తప్పులు

ఆందోళనలో ప్రధానోపాధ్యాయులు, టీచర్లు

ఒంగోలు విద్య, మార్చి 2 (ఆంధ్రజ్యోతి) : పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల నిర్వహణకు అధికారుల నియామకాల్లో అవలంబించిన ఆటోమేషన్‌ విధానంలో అసంబద్ధాలు దొర్లాయి. ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారులు ప్రకటించిన దానికి, ఆచరణకు పొంతన లేకుండా పోయింది. ప్రస్తుతం పనిచేస్తున్న మండలం, పక్క మండలాల్లో పనిచేస్తున్న వారినే పరీక్షల విధులకు నియమిస్తామని ప్రకటించిన అధికారులు అందుకు విరుద్ధంగా 100 కిలోమీటర్ల దూరం విసిరేశారు. కొంతమందిని తాము పనిచేస్తున్న పాఠశాల విద్యార్థులు పరీక్ష రాస్తున్న కేంద్రాలకు చీఫ్‌ సూపరింటెండెం ట్లుగా, డిపార్టుమెంట్‌ అధికారులుగా నియమించారు. ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిన కొందరికి డ్యూటీలు రావడంతో వారు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో మార్చి 16 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఉమ్మడి జిల్లా నుంచి మొత్తం 28,632 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. వీరిలో ప్రకాశం జిల్లా నుంచి 14,031 మంది మార్కాపురం జిల్లా నుంచి 14,601 మంది ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 165 పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేశారు. వీటన్నింటికీ ఛీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంట్‌ అధికారులను నియమించి వారి లీప్‌ యాప్‌ మెయిల్‌కు నియామకపు ఉత్తర్వులు పంపారు

నియామకాల్లో అసంబద్ధాలు

పదో తరగతి పరీక్షల నిర్వహణకు అధికారుల నియామకాల్లో పలు అసంబద్ధాలు చోటుచేసుకున్నాయి. పరీక్షలకు గరిష్ఠంగా 20 కిలో మీటర్లలోపు దూరంలోని కేంద్రాల్లో నియమిస్తామన్నారు. కానీ కొందరిని 100 కి.మీ దూరంలోని కేంద్రాల్లో విధులకు కేటాయించారు. కొండపి మండలం కె.ఉప్పలపాడు, వెన్నూరు, టంగుటూరు మండలం ఎం.నిడమాలూరు నుంచి నలుగురు స్కూలు అసిస్టెంట్లను గిద్దలూరులోని సెయింట్‌పాల్స్‌-ఏ,బీ కేంద్రాల్లో చీఫ్‌లు, డీవోలుగా నియమించారు. 10 పాఠశాలల్లోని పరీక్షా కేంద్రాలకు తమ విద్యార్థులు పరీక్షలు రాస్తున్న పాఠశాలల హెచ్‌ఎంలు, స్కూలు అసిస్టెంట్లను చీఫ్‌లు, డీవోలుగా నియమించారు. నాలుగైదు స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లలో 50శాతం మందికిపైగా పరీక్షల విధులకు కేటాయించారు. ఈ నియామకాల్లో కంప్యూటర్లు పొరబడ్డాయా? లేక ఇచ్చిన ప్రోగ్రామ్‌లోనే తప్పులున్నాయా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అనారోగ్య సమస్యలు ఉన్న కొందరిని కూడా పరీక్షల విధులకు నియమించడంతో వారు ఆందోళన చెందుతున్నారు.

తప్పుల సవరణకు అవకాశం

ఆటోమేషన్‌ విధానంలో చీఫ్‌లు, డీవోల నియామకంలో చోటుచేసుకున్న తప్పులను సవరించుకునేందుకు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ శ్రీనివాసులరెడ్డి అవకాశం కల్పించారు. పనిచేస్తున్న పాఠశాల నుంచి దూరంగా నియమితులైన సీఎస్‌లు, డీవోల డ్యూటీలను మారుస్తామని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. జూనియర్లను సీఎస్‌లుగా, సీనియర్లను డీవోలుగా వేసిన డ్యూటీలు కూడా పరిశీలిస్తామన్నారు. టిన్‌ ఆధారంగా దివ్యాంగులను తొలగించామని, ఇంకా ఎవరైనా పీహెచ్‌, ఓహెచ్‌ బ్లైండ్‌ వారు ఉంటే వారినీ మారుస్తామన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి పరీక్షల విధుల నుంచి మినహాయిస్తామన్నారు. ఇప్పటివరకు పరీక్షల డ్యూటీ చేయనివారు ఎవరైనా సీఎస్‌, డీవోలుగా నియమితులైతే వారికి శిక్షణ ఇస్తామని ప్రకటించారు. ఒక పాఠశాలలో సగం కన్నా ఎక్కువమంది సిబ్బందికి 10వతరగతి డ్యూటీలు వేస్తే వారిని 50శాతానికి పరిమితం చేస్తామన్నారు. ఉపాధ్యాయలుల ఇంట్లో వివాహం వంటి ముఖ్య వేడుకలుంటే పెళ్లి కార్డు చూపించి మినహాయింపు పొందవచ్చన్నారు. అసంబద్ధాలను సరిచేసేందుకు అందరు డీఈవోలకు స్ర్కీన్‌ ఇచ్చామన్నారు. ఉపవిద్యాధికారులు తమ పరిధిలోని నియామకాలను పరిశీలించి ఏమైనా అసంబద్ధాలు ఉంటే డీఈవో ద్వారా సరిచేయించుకోవచ్చన్నారు. ఇష్టానుసారంగా మార్పులకు అవకాశం లేదని నిజమైన కేసులను మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు.

Updated Date - Mar 03 , 2026 | 02:46 AM