Share News

మిషన్‌ మార్చ్‌ ఎస్‌ఎస్‌సీ ప్రారంభం

ABN , Publish Date - Jul 14 , 2026 | 03:12 AM

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపర్చడంతోపాటు 2027 మార్చిలో జరగనున్న పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో నూరుశాతం ఉత్తీర్ణత లక్ష్యంగా పాఠశాల విద్యాశాఖ మిషన్‌ మార్చ్‌ ఎస్‌ఎస్‌సీ-27 కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

మిషన్‌ మార్చ్‌ ఎస్‌ఎస్‌సీ ప్రారంభం

పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా అమలు

ఒంగోలు విద్య, జూలై 13 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపర్చడంతోపాటు 2027 మార్చిలో జరగనున్న పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో నూరుశాతం ఉత్తీర్ణత లక్ష్యంగా పాఠశాల విద్యాశాఖ మిషన్‌ మార్చ్‌ ఎస్‌ఎస్‌సీ-27 కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈనెల 13 నుంచి నవంబరు 30 వరకు ఈ కార్యక్ర మాన్ని అమలు చేస్తోంది. ఈ మేరకు మిషన్‌ మార్చ్‌ కార్యాచరణ ప్రణాళికను నిర్దేశిస్తూ పాఠశాల విద్య డైరెక్టర్‌ తమీమ్‌ అన్సారియా ఉత్తర్వులు జారీచేశారు. ఎన్‌సీఈఆర్టీ ఆధారిత విశ్లేషణ విధానానికి అనుగుణంగా ప్రణాళికను రూపొందించారు. పాఠశాల పనిదినాల్లో ప్రతిరోజూ సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ప్రత్యేక విద్యా మద్దతు సెషన్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సబ్జెక్టుల పునరుచ్ఛరణ, సామర్థ్యం ఆధారిత స్లిప్‌ టెస్టులు, ప్రతి సోమవారం తెలుగు, మంగళవారం హిందీ, బుధవారం గణితం, గురువారం ఫిజికల్‌ / బయోలాజికల్‌ సైన్స్‌, శుక్రవారం సోషల్‌, శనివారం హిందీ సబ్జెక్టులు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం అమలుకు సంబంధించి రోజువారీ షెడ్యూల్‌, క్వశ్చన్‌ బ్యాంకులు, స్టడీ మెటీరియల్‌, స్లిప్‌ టెస్టులకు సంబంధించిన ప్రశ్నపత్నాలను లీప్‌ యాప్‌ ద్వారా అందించనున్నారు. ఈ ప్రత్యేక సెషన్‌లో విద్యార్థులకు వైవిద్యభరిత బోధనా పద్ధతిని అమలు చేయనున్నారు. విద్యార్థుల స్థాయిని బట్టి రెండు విభాగాలుగా బోధన సాగుతుంది. వచ్చే ఏడాదిలో జరిగే పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో ప్రతివిద్యార్థి అత్యుత్తమ విజయం సాధించేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యారంగానికి చెందిన భాగస్వామ్యులందరూ సమన్వయంతో మిషన్‌ మార్చ్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డైరెక్టర్‌ ఆ ఉత్తర్వుల్లో కోరారు.

Updated Date - Jul 14 , 2026 | 03:12 AM