Share News

అద్దంకికి మినీ బైపాస్‌లు

ABN , Publish Date - Sep 19 , 2026 | 03:14 AM

అద్దంకి పట్టణానికి రెండు వైపులా మినీ బైపాస్‌ల నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే నామ్‌ రోడ్డులో రామ్‌నగర్‌ సమీపంలో సూర్య రెస్టారెంట్‌ వద్ద నుంచి శింగరకొండ సమీపంలో, మరలా నామ్‌ రోడ్డులో కలిసేలా మినీ బైపాస్‌ నిర్మాణానికి రంగం సిద్ధమైంది.

అద్దంకికి మినీ బైపాస్‌లు
మినీ బైపాస్‌గా అభివృద్ధి చేయనున్న భవనాసి లోలెవల్‌ కాలువ కట్ట

రెండు వైపులా నిర్మాణానికి కసరత్తు

ప్రతిపాదనలు తయారుచేయాలని మంత్రి రవికుమార్‌ ఆదేశం

అద్దంకి, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): అద్దంకి పట్టణానికి రెండు వైపులా మినీ బైపాస్‌ల నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే నామ్‌ రోడ్డులో రామ్‌నగర్‌ సమీపంలో సూర్య రెస్టారెంట్‌ వద్ద నుంచి శింగరకొండ సమీపంలో, మరలా నామ్‌ రోడ్డులో కలిసేలా మినీ బైపాస్‌ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. మరోవైపు అద్దంకి మేజర్‌ కాలువను మినీ బైపాస్‌ రోడ్డుగా మార్చే పనులు కొలిక్కివచ్చాయి. రెండోవైపు భవనాసి కాలువ కట్టను ఇంకో బైపాస్‌ రోడ్డుగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి రవికుమార్‌ ఆదేశించారు. ఈక్రమంలో మొదటి దశలో సూర్య రెస్టారెంట్‌ వద్ద నుంచి కాకానిపాలెం వరకు సుమారు 1.5 కి .మీ దూరం 17 కోట్ల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణం, రెండు వైపులా సైడ్‌ డ్రెయిన్‌లు, లైటింగ్‌, ఎన్‌ఎ్‌సపీ కాలువ అభివృద్ధి చేసేవిధంగా అంచనాలు రూపొందించారు. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైన వెంటనే పనులు ప్రారంభించేందుకు మునిసిపల్‌ అధికారులు సిద్ధంగా ఉన్నారు. అదేసమయంలో రెండో దశలో కాకానిపాలెం నుంచి టిడ్కో ఇళ్ళ వరకు సుమారు 4 కి.మీ దూరం అద్దంకి మేజర్‌ కాలువ కట్టను తారు రోడ్డుగా అభివృద్ధి చేయనున్నారు. అద్దంకి మేజర్‌ కాలువ నుంచి టిడ్కో ఇళ్ళ వరకు మధ్యలో సుమారు 3 ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉన్న నేపథ్యంలో వెంటనే రైతులతో మాట్లాడి ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి రవికుమార్‌ ఆదేశించారు. సెకండ్‌ ఫేజ్‌లో తారురోడ్డు నిర్మాణం చేపట్టేందుకు నిదులు అందుబాటులో ఉన్నందున భూసేకరణపై దృష్టిపెట్టాలన్నారు. అదేసమయంలో మరోవైపు కూడా మినీ బైపాస్‌ రోడ్డు నిర్మాణానికి కసరత్తు ప్రారంభమైంది. నామ్‌ రోడ్డులోని గోపాలపురం వద్ద నుంచి భవనాసి లోలెవల్‌ కాలువ కట్టలను రెండు వైపులా అభివృద్ధి చేయాలని యోచిస్తున్నారు. నర్రావారిపాలెం సమీపంలోని శ్రీరామ్‌నగర్‌కాలనీ, అక్కడి నుంచిడొంక రోడ్డును వేలమూరిపాడు రోడ్డులోని లేఅవుట్‌ సమీపంలో నల్లవాగు బెంగళూరు-విజయవాడ గ్రీన్‌పీల్డ్‌ రోడ్డుకు చెందిన సర్వీస్‌ రోడ్డులో కలిసే విధంగా అభివృద్ధిచేస్తే అద్దంకి పట్టణంలోని అన్నిప్రాంతాల నుంచి నామ్‌ రోడ్డుకు అనుసంధానం జరిగే అవకాశం ఉంది. దీంతో ప్రధానంగా భవానీ సెంటర్‌లో ట్రాఫిక్‌ తగ్గుతుంది. నామ్‌ రోడ్డులో ప్రమాదాలు తగ్గిందుకు కూడా దోహదపడుతుందని పలువురు భావిస్తున్నారు. రెండు వైపులా మినీ బైపాస్‌ రోడ్డు ఏర్పాటుపై మంత్రి రవికుమార్‌ ప్రత్యేక దృష్టి సారించడంతో త్వరలోనే కార్యరూపం దాల్చే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Sep 19 , 2026 | 03:14 AM