Share News

శరవేగంగా అద్దంకి మినీబైపా్‌స

ABN , Publish Date - Jan 20 , 2026 | 11:48 PM

అద్దంకి పట్టణంలో మినీ బైపాస్‌ రోడ్డులో తాత్కాలికంగా రాకపోకలకు వీలుగా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పట్టణం మధ్య నుంచి వెళుతున్న నామ్‌ రోడ్డులో ట్రాఫిక్‌ రద్దీ విపరీతంగా పెరిగి తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో మినీ బైపాస్‌ ప్రతిపాదనలు వచ్చాయి.

శరవేగంగా అద్దంకి మినీబైపా్‌స
మినీ బైపాస్‌ రోడ్డుపై తిప్పుతున్న రోలర్‌

పదిహేను రోజుల్లో తాత్కాలికంగా కొంతభాగంలో రాకపోకలు సాగించేలా ఏర్పాట్లు

అందుకనుగుణంగా వేగంగా పనులు

హద్దు రాళ్లు ఏర్పాటు

అద్దంకి, జనవరి 20(ఆంధ్రజ్యోతి) : అద్దంకి పట్టణంలో మినీ బైపాస్‌ రోడ్డులో తాత్కాలికంగా రాకపోకలకు వీలుగా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పట్టణం మధ్య నుంచి వెళుతున్న నామ్‌ రోడ్డులో ట్రాఫిక్‌ రద్దీ విపరీతంగా పెరిగి తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో మినీ బైపాస్‌ ప్రతిపాదనలు వచ్చాయి. దీంతో మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ దాని నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించారు. మొదటి ఫేజ్‌లో భాగంగా రేణింగవరం రోడ్డులో కాకానిపాలెం నుంచి సూర్య రెస్టారెంట్‌ వద్ద నామ్‌ రోడ్డులో కలిసేవిధంగా సుమారు 1.5 కి.మీ దూరం అద్దంకి మేజర్‌ కాలువను సీసీరోడ్డుగా నిర్మించనున్నారు. సుమారు రూ.15 కోట్ల అంచనా వ్యయంతో మధ్యలో ఎన్‌ఎ్‌సపీ కాలువ, రెండు వైపులా సీసీ రోడ్లు, విద్యుత్‌ లైన్‌లు, సైడ్‌ డ్రైయిన్లు ఏర్పాటు చేయనున్నారు.

ఆక్రమణలు తొలగించి నిర్మాణాలు

నెల రోజుల క్రితం కాలువ కట్టను ఆక్రమించుకొని తాత్కాలిక నివాసాలను ఏర్పరుచుకున్న కుటుంబాలను ఖాళీ చేయించారు. ఆయా కుటుంబాలకు అద్దంకి కొండ వద్ద ఇళ్ల స్థలాలు కేటాయించి మౌలిక వసతుల కల్పనచేశారు. దీంతో ఆయా కుటుంబాలు ఇప్పటికే నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. ఆక్రమణల తొలగింపు పూర్తికావటంతో తొలుత గ్రావెల్‌ రోడ్డు నిర్మిస్తున్నారు. ఇప్పటికే గ్రావెల్‌ తోలి చదును చేయగా ప్రస్తుతం రోలర్‌ తిప్పుతున్నారు. అదేసమయంలో మేజర్‌ కాలువకు రెండువైపులా సరిహద్దు రాళ్లు వేస్తున్నారు. పూర్తిస్థాయిలో పనులు చేసి మరోపక్షం రోజులలో గ్రావెల్‌ రోడ్డును అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా పనులు జరుగుతున్నాయి. సుమారు 70 అడుగుల వెడల్పుతో కొలతలు తీసి సీసీరోడ్లు నిర్మాణంచేసి, అదనంగా ఉన్న ప్రాంతాలను మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్వాధీనం చేసుకొని ప్రజా ప్రయోజనాలకు వినియోగించుకునే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రస్తుతం గ్రావెల్‌ రోడ్డుపై రాకపోకలు కొనసాగించి కొద్దినెలల తరువాత సీసీ రోడ్లు నిర్మాణం చేసే ఆలోచనతో అధికారులు ఉన్నారు. రెండవ ఫేజ్‌లో కాకానిపాలెం నుంచి టిడ్కో ఇళ్ల మీదుగా శింగరకొండ వద్ద నామ్‌ రోడ్డులో కలిసే విధంగా తారు రోడ్డు నిర్మాణం చేయనున్నారు. రెండు ఫేజ్‌లలో రోడ్డు నిర్మాణం పూర్తయితే మినీ బైపాస్‌ రోడ్డు పూర్తిస్థాయిలో వినియోగంలోకి వచ్చే అవకాశం ఉంది.

Updated Date - Jan 20 , 2026 | 11:48 PM