మెప్మా రూటే సప‘రేటు’
ABN , Publish Date - May 21 , 2026 | 03:33 AM
అద్దంకిలో మెప్మా రూటే సపరేటుగా మారింది. స్వయం సహాయక సంఘాల సభ్యులకు రుణం మంజూరుకు రూ.10వేల నుంచి 15 వేల రూపాయల వరకు ముక్కు పిండి వసూలు చేస్తున్నారు.
రుణం కావాలంటే రూ.10వేల నుంచి రూ. 15 వేలు వసూలు
అద్దంకిలో ప్రజాప్రభుత్వంలోనూ మారని అధికారుల తీరు
దళారులుగా ఆర్‌పీలు.. గతంలో అక్రమాలపై చర్యలు నిల్
అద్దంకి, మే 20 (ఆంధ్రజ్యోతి) : అద్దంకిలో మెప్మా రూటే సపరేటుగా మారింది. స్వయం సహాయక సంఘాల సభ్యులకు రుణం మంజూరుకు రూ.10వేల నుంచి 15 వేల రూపాయల వరకు ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. మామూళ్లు ఇవ్వని స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఏదో ఒక కారణం చూపించి చుక్కలు చూపిస్తున్నారు. వసూళ్ల వ్యవహారంలో ఆర్‌పీలు దళారులుగా వ్యవహరిస్తున్నారు. రుణం మంజూరై సరిపడా వసూలు చేయని ఆర్‌పీలను మెప్మా అధికారులు ఏదో ఒక సాకు చూపించి వేధింపులకు గురిచేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అద్దంకి పట్టణంలో సుమారు 1,100 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా 2022 ఫిబ్రవరి 3వ తేదీన మూసివేసిన అన్న క్యాంటీన్‌లో జగనన్న మహిళా మార్ట్ ఏర్పాటు చేశారు. అప్పట్లో మెప్మాలోని సుమారు 7 వేల మంది సభ్యులతో 150 రూపాయల చొప్పున సుమారు రూ.11లక్షలు పెట్టుబడి పెట్టించారు. ఈ మార్టు ద్వారా వ్యాపారం నిర్వహించి ఏటా సభ్యులకు లాభాలు పంచుతామని నమ్మబలికారు. ఆర్‌పీల ద్వారా ఒత్తిడి చేయించి టార్గెట్‌లు పెట్టి మరీ స్వయం సహాయక సంఘాల సభ్యుల ద్వారానే బహిరంగ మార్కెట్ కంటే ఎక్కువ ధరలకు వస్తువులను కొనుగోలు చేయించారు. సుమారు రెండేళ్లపాటు అడ్డూఅదుపు లేకుండా జగనన్న మహిళా మార్ట్‌లో దోపిడీ పర్వం సాగింది. ఆ సమయంలో ఎప్పుడూ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసిన పాపాన పోలేదు. కనీసం పెట్టిన పెట్టుబడికి జమాఖర్చులు కూడా చెప్పలేదు మహిళా మార్ట్‌ను మూసివేసిన తరువాత సభ్యులు పెట్టిన పెట్టుబడి డబ్బులు కూడా వారికి తిరిగి చెల్లించ లేదు.
చర్యలు తీసుకోవడంలో అధికారుల మీనమేషాలు
ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పలువురు స్వయం సహాయక సంఘాల సభ్యులు మహిళామార్ట్‌లో అవకతవకలపై మంత్రి రవికుమార్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టాలని అప్పటి బాపట్ల జిల్లా అధికారులను ఆయన ఆదేశించారు. పలుసార్లు విచారణ చేపట్టిన అధికారులు మిన్నకుండిపోయారు. నిధులు గోల్‌మాల్ జరిగినట్లు నిర్ధారణ అయి ఏడాది గడిచినా బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో ఉదాసీనత కొనసాగుతుండటంపై విమర్శలు వస్తున్నాయి. లాభాల మాట అటుంచి కనీసం పెట్టిన పెట్టుబడి డబ్బులైనా తిరిగి చెల్లించాలి కదా అని పలువురు సభ్యులు ప్రశ్నిస్తున్నారు.
కందుకూరు ప్రాంతానికి చెందిన వారి పేర్లతో అద్దంకిలో రుణాలు
ఇక పలు బ్యాంక్‌లలో అద్దంకి పట్టణానికి సంబంధం లేని మహిళలకు అద్దంకిలోని బ్యాంక్‌లలో రుణాలు ఇప్పించటంలో కూడా మెప్మా అధికారులు కీలక భూమిక పోషించినట్లు విమర్శలు ఉన్నాయి. ప్రకాశం కోఆపరేటివ్ బ్యాంక్‌లో రుణాల విషయం బయటకు పొక్కడం, తీసుకున్న రుణాలకు సంబంధించి నెలవారీ చెల్లింపులు లేకపోవడంతో విచారణ చేపట్టగా అసలు బండారం బయటపడింది. కందుకూరు ప్రాంతానికి చెందిన మహిళల పేర్లతో అద్దంకిలో రుణాలు తీసుకున్నట్లు తేటతెల్లం అయ్యింది. మిగిలిన కొన్ని బ్యాంక్‌లలో కూడా ఇలాంటి రుణాలు ఉన్నప్పటికీ బయటకు పొక్కకుండా మెప్మా అధికారులు వ్యవహారం నడిపి నెలవారీ చెల్లింపులు జరిగే విధంగా ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో సూత్రధారులుగా ఉన్న మెప్మా అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోకపోవడం.. స్వయం సహాయక సంఘాల సభ్యులకు రుణాల మంజూరుకు ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తున్నా పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గతంలో జరిగిన నిధుల గోల్‌మాల్ వ్యవహారంలో బాధ్యులపై చర్యలు తీసుకోవడంతోపాటు తాము పెట్టుబడి నిధి తిరిగి చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని సభ్యులు కోరుతున్నారు.