Share News

నడిరోడ్డుపైనే మాంసం విక్రయాలు

ABN , Publish Date - Mar 04 , 2026 | 12:17 AM

పట్టణంలో పెద అండరుపాస్‌ ప్రధాన కూడలిగా ఉంది. ఏదో ఒక పని నిమిత్తం నిత్యం ఇక్కడికి వస్తుంటారు.

నడిరోడ్డుపైనే మాంసం విక్రయాలు

మార్టూరు, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో పెద అండరుపాస్‌ ప్రధాన కూడలిగా ఉంది. ఏదో ఒక పని నిమిత్తం నిత్యం ఇక్కడికి వస్తుంటారు. ఇక ఇతర గ్రామాలకు కూడా అండరుపాస్‌ ద్వారానే రాకపోకలు సాగిస్తుంటారు. అంతటి ప్రాముఖ్యత ఉన్న అండర్‌ పాస్‌ వద్ద నడిరోడ్డుపైనే మాంసం విక్రయిస్తున్నారు.

రోడ్డుపై వెళ్లే ప్రజానీకానికి కనబడేవిధంగానే మాంసం ముద్దలు వేలాడగడుతున్నారు. ఇంకా వాటికి తోడు చేపలు, రొయ్యలు కూడా అక్కడే విక్రయిస్తు న్నారు. ఒక వైపు గ్రానైట్‌ లారీలు, మరో వైపు గ్రానైట్‌ డస్ట్‌ను తరలించే ట్రాక్టర్లు, ఇంకోవైపు వాహనాల కాలుష్యం, దుమ్ము ధూళిలతో ప్రజలు అసౌకర్యాలకు గురవుతున్నారు. నడిరోడ్డుపైన జరిగే ఈ మాంసం విక్రయాలతో ప్రజలకు విస్మయం చెందుతున్నారు.

రోడ్డుపైకే వ్యర్థ జలాలు

పెద అండరుపాస్‌ నుంచి నాగరాజుపల్లి కూడలికి వెళ్లే సర్వీసు రోడ్డులో రోడ్డుపక్కన చికెన్‌ దుకాణాలు ఉన్నాయి. వారంతా రోజూ దుకాణాల్లో కోళ్లు కడిగిన నీళ్లను సర్వీసు రోడ్డుపై పారబోస్తున్నారు. రోడ్డు ప్రక్కనే చికెన్‌ అమ్మకాలను చేపడుతున్నారు. దీంతో రోడ్డుపై నడిచి వెళ్లేవారు ద్విచక్రవాహనాలలో వెళ్లేవారు దుర్గంధ పూరితమైన నీటి మడుగులను తొక్కుకుంటూ వెళ్లాల్సి వస్తోంది. విపరీతమైన దుర్వాసనను భరిస్తూ వెళుతున్నారు. దీనిని కట్టడి చేయాలని వారు కోరు తున్నారు.

పట్టించుకోని అధికారులు

ప్రజలకు నాణ్యమైన మాంసం విక్రయాలు, వాటి దుకాణాలు పరిశుభ్రంగా ఉన్నాయా..? లేదా..? అని అధికారులు పట్టించుకోవడ లేదు. కనీసం మాంసం విక్రయాలుగా చేస్తున్న కోళ్లు, మేకలు, పొట్టేళ్లు, బతికినవే అమ్ముతున్నారా..? అని కూడా పట్టించుకోవడం లేదు. కనీసం ఈ దుకాణాలను అడపా దడపా కూడా తనిఖీలు చేయ డం లేదు. అంతేగాకుండా మాంసం అమ్మకాల తూకంలో తేడాలు ఉన్నాయని పలువురు వినియోగదారులు ఆ రోపిస్తున్నారు. మరయితే తూనికల కొలతల అధికా రులు పట్టణంలో ఎప్పుడు వస్తారో.. ఎప్పుడు తనిఖీలు చేస్తారో వారికే తెలియాలని ప్రజలు విమర్శిస్తున్నారు.

మార్కెట్‌ను ఏర్పాటుచేయాలి

దాదాపుగా పాతికవేలు జనాభా ఉన్న పట్టణంలో నడిరోడ్డుపై మాంసం విక్రయాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తద్వారా ప్రజానీకం ఇబ్బందులు పడుతున్నారు. అందువలన కూరగాయల కోసం మార్కెట్‌ ఉన్నట్లే, మాంసం విక్రయాలు, చేపలు తదితర వాటి కోసం ఒక మార్కెట్‌ను ఏర్పాటుచేయాలని, లేదా ప్రత్యేకమైన స్థలం కేటాయించాల్సిన అవసరం ఉంది. బాధ్యత గ్రామ పంచాయతీ అధికారులపై ఉందని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. తద్వారా గ్రామ పంచాయతీకి శిస్తు రూపేణా ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంది.

Updated Date - Mar 04 , 2026 | 12:17 AM