Share News

నోబిడ్‌లు తగ్గేలా చర్యలు

ABN , Publish Date - Jul 02 , 2026 | 11:01 PM

పొగాకు రైతుకు గిట్టుబాటు ధరలు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ డీఎ్‌సబీవీ స్వామి చెప్పారు.

నోబిడ్‌లు తగ్గేలా చర్యలు
అధికారులు, బయ్యర్లతో మాట్లాడుతున్న మంత్రి స్వామి

పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయం

ఒంగోలు పొగాకు వేలం కేంద్రం 1ను సందర్శించిన మంత్రి డాక్టర్‌ స్వామి

ఒంగోలు కలెక్టరేట్‌, జూలై 1 (ఆంధ్రజ్యోతి) : పొగాకు రైతుకు గిట్టుబాటు ధరలు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ డీఎ్‌సబీవీ స్వామి చెప్పారు. గురువారం ఒంగోలులోని పొగాకు వేలం కేంద్రం-1ను మంత్రి పరిశీలించారు. వేలం తీరును పరిశీలించడంతోపాటు రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి స్వామి మాట్లాడుతూ వేలంలో నో బిడ్‌ సమస్య లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వ్యాపారులందరూ వేలంలో పాల్గొని రైతులకు మేలుచేసే విధంగా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని, పొగాకు పండించే రైతులకు కచ్చితంగా గిట్టుబాటు ధరలు కల్పించాలనే అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వేలంలో వ్యాపారులందరూ పాల్గొనడం లేదని గుర్తించామని, వారందరూ పాల్గొనే విదంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వ్యాపారులతో సమన్వయం చేసుకొని రైతుల పొగాకు మొత్తాన్ని కొనేలా చూస్తామన్నారు. రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాప్రతినిధులను క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లనే నిరుడు బర్లీ పొగాకు అమ్ముడుపోక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. ఆ సమయంలో ప్రభుత్వం స్పందించి రూ.300 కోట్లు కేటాయించి ఆ పొగాకును కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు, వ్యవసాయశాఖ అధికారి శ్రీనివాసరావు, పొగాకు బోర్డు అధికారులు తదితరులు ఉన్నారు.

Updated Date - Jul 02 , 2026 | 11:01 PM