ఉపాధి పనులలో భారీ అక్రమాలు
ABN , Publish Date - Jan 06 , 2026 | 12:01 AM
అద్దంకి నియోజకవర్గంలోని పలుగ్రామాల్లో 2024-25 సంవత్సరంలో చేపట్టిన ఉపాధి హామీ పనులలో అక్రమాలు కోకొల్లలుగా జరిగాయి. పనులు చేసిన కూలీల నోట మట్టికొట్టి అయినవారికి మస్టర్లు వేసుకోవటం, అధికారులకు ముడుపులు ముట్టచెప్పటంతో ఉపాధి నిధులు పక్కదారిపట్టాయి.
జిల్లా మార్పుతో మాఫీ చేయించుకునేందుకు క్షేత్రస్థాయి సిబ్బంది ప్రయత్నాలు
చర్యలు తీసుకోవటంలోనూ అధికారుల మీనమేషాలు
ఇదీ అద్దంకి నియోజకవర్గంలో పరిస్థితి
అద్దంకి, జనవరి 5(ఆంధ్రజ్యోతి) : నియోజకవర్గంలోని పలుగ్రామాల్లో 2024-25 సంవత్సరంలో చేపట్టిన ఉపాధి హామీ పనులలో అక్రమాలు కోకొల్లలుగా జరిగాయి. పనులు చేసిన కూలీల నోట మట్టికొట్టి అయినవారికి మస్టర్లు వేసుకోవటం, అధికారులకు ముడుపులు ముట్టచెప్పటంతో ఉపాధి నిధులు పక్కదారిపట్టాయి. అంతేగాక పనులు కూడా అంతంతమాత్రంగానే జరిగాయి. అక్రమార్కులు ఏడాదికొకసారి నిర్వహించే సామాజిక తనిఖీ బృందం సభ్యులను కూడా మభ్యపెట్టి గప్‌చు్‌పగా ఉంటున్నారు. ఈక్రమంలో పనులలో చేసిన అవినీతిలో పదోవంతు కూడా బయటపడటం లేదు. సామాజిక తనిఖీలో వెలుగుచూసిన అక్రమాలపై కూడా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవటం విమర్శలకు తావిస్తోంది. సామాజిక తనిఖీ ఓపెన్ ఫోరంలో కూడా ఉన్నతాధికారులు తనిఖీ బృందాన్ని తప్పుబట్టేవిధంగా వ్యవహరించటం కూడా అనుమానాలకు మరింత అవకాశం ఏర్పడుతుంది.
బల్లికురవ మండలంలో లైవ్ ఆడిట్ నిర్వహించి సుమారు 2 కోట్ల రూపాయలకు పైగా అక్రమాలు జరిగినట్టు తేల్చారు. అనంతరం జరిగిన సంతమాగులూరు మండలం సామాజిక తనిఖీలో అంతకంటే ఎక్కువ మొత్తంలో అవినీతి బయటపడుతుందని భయపడ్డ సిబ్బంది, అధికారులు కొంతకాలం పాటు వాయిదా వేయించి చివరకు బల్లికురవలో సామాజిక తనిఖీ చేసిన బృందాన్ని మార్పు చేయించి ఊపిరిపీల్చుకున్నారు. సామాజిక తనిఖీ ఆడిట్ జరిగి సుమారు మూడు నెలలు గడిచినా ఇంతవరకు ఎలాంటి చర్యలకు ఉపక్రమించకపోవటం మరింత అనుమానాలకు తావిస్తోంది.
ఒక్క బల్లికురవ మండలంలో మాత్రమే ఇద్దరు ఫీల్డ్‌అసిస్టెంట్‌లు, ముగ్గురు టెక్నికల్ అసిస్టెంట్‌లు, ఒక కంప్యూటర్ ఆపరేటర్, ఒక ఈసీపై చర్యలు తీసుకున్నారు. ఇక అద్దంకి, కొరిశపాడు, పంగులూరు మండలాల్లో జరిగిన ఉపాధి అక్రమాలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
ఇప్పటివరకు బాపట్ల జిల్లా పరిధిలో ఉన్న అద్దంకి నియోజకవర్గం జిల్లాల పునర్విభజనలో ప్రకాశం జిల్లా పరిధిలోకి చేరింది. దీంతో నాటి అక్రమాలపై ఎలాంటి చర్యలు లేకుండా చేయించుకునేందుకు బాపట్ల జిల్లా అధికారులతో సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం. అప్పట్లోనే జిల్లా అధికారులు సైతం చర్యలు ఉపక్రమించేందుకు మీనమేషాలు లెక్కించటం, ప్రస్తుతం జిల్లా మార్పుతో అక్రమార్కులపై చర్యలు ఉండవనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. జిల్లా ఉన్నతాధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.