Share News

శ్రీగంధం పేరుతో భారీ మోసం

ABN , Publish Date - Jul 29 , 2026 | 02:54 AM

‘ప్లాట్లలో శ్రీగంధం చెట్లు పెంచుతాం. తక్కువ కాలంలో ఎక్కువ లాభం పొందవచ్చు’ అంటూ కొనుగోలుదారులకు ఆశపెట్టారు. అక్రమ రిజిస్ర్టేషన్లు చేసి రూ.కోట్లు దండుకొన్నారు. చివరకు కొనుగోలుదారులు తాము మోసపోయామని తెలుసుకుని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో భారీ స్కాం వెలుగుచూసింది.

శ్రీగంధం పేరుతో భారీ మోసం
శ్రీగంధం ప్లాంటేషన్‌లో మొక్కలు ఎండిపోయి కనిపిస్తున్న భూమి

ప్లాట్లలో మొక్కలు పెంచుతాం..

మంచి లాభాలకు అమ్మి పెడతామంటూ ఆశ

అక్రమ రిజిస్ట్రేషన్లు చేసి మాయ

విషయం బయటపడే సరికి ముఖంచాటేసిన వైనం

కురిచేడు పోలీస్‌ స్టేషన్‌లో చీటింగ్‌ కేసు

బాధితుల్లో ఎక్కువమంది విజయవాడ వాసులే

కురిచేడు, జూలై 28 (ఆంధ్రజ్యోతి) : ‘ప్లాట్లలో శ్రీగంధం చెట్లు పెంచుతాం. తక్కువ కాలంలో ఎక్కువ లాభం పొందవచ్చు’ అంటూ కొనుగోలుదారులకు ఆశపెట్టారు. అక్రమ రిజిస్ర్టేషన్లు చేసి రూ.కోట్లు దండుకొన్నారు. చివరకు కొనుగోలుదారులు తాము మోసపోయామని తెలుసుకుని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో భారీ స్కాం వెలుగుచూసింది. ఈ ఘటన కురిచేడు మండలం పడమరగంగవరం పంచాయతీ పరిధిలో చోటుచేసు కుంది. పడమరగంగవరం పరిధిలోని 89వ సర్వే నంబ రులో 6.35 ఎకరాలు, మరో మూడు సర్వే నంబర్లలో 7 ఎకరాలకుపైగా కనిగిరి ప్రాంతంలోని ఓ మాజీ ప్రజా ప్రతినిధి కొనుగోలు చేశారు. ఆ పొలంలో శ్రీగంధం మొక్కలు పెంచుతామంటూ 250 ప్లాట్లను వేశారు. శ్రీరేణుకా శ్రీగంధం ప్లాంటేషన్స్‌ పేరుతో బ్రోచర్లు ముద్రించి కొనుగోలుదారులను ఆకర్షించారు. దీంతో విజయవాడకు చెందిన చాలామంది ప్రముఖులు ఇక్కడి ప్లాంటేషన్‌లో ప్లాట్లు కొనుగోలు చేశారు.

15 ఏళ్లలో చేతికి డబ్బులంటూ ఆశచూపి..

విజయవాడ సమీపంలోని పెనమలూరుకు చెందిన పావులూరి నీలిమ వృత్తిరీత్యా లెక్చరర్‌. ఆమెను రియల్టర్‌ బుల్లా విజయకుమార్‌ కలిశాడు. దొనకొండ సమీపంలో కురిచేడు మండలం పడమర గంగవరం గ్రామ పరిధిలో శ్రీగంధం ప్లాంటేషన్‌ ఉందని చెప్పాడు. తక్కువ రేటుకు వస్తుంది, కొనుగోలు చేసి లాభం పొందవచ్చని నమ్మిం చాడు. ప్లాంటేషన్‌ వద్దకు తీసుకొచ్చి చూపించి కొనుగోలు చేసేలా ఒప్పించాడు. నీలిమ మొదటగా 211.11 గజాల స్థలాన్ని 04.03.2025న రూ.3.25లక్షలకు కొనుగోలు చేసి దర్శిలో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. వాటిలో శ్రీగంధం మొక్కలు పెంచి 15 ఏళ్ల తర్వాత అమ్మి చెరి సగం తీసుకునేలా మరలా లీజు అగ్రిమెంట్‌ కూడా రాయించుకున్నారు. కొద్దిరోజుల తర్వాత నీలిమను విజయకుమార్‌ కలిసి మరికొన్ని ప్లాట్లు ఉన్నాయని, తక్కువ రేటుకే వస్తాయని ఆశచూపాడు. ఆమె స్థలాన్ని చూసి 2వేల గజాలు కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యా. ఈసారి గతంలో ఆమె కొనుగోలు చేసిన స్థలం కాకుండా వేరొక సర్వే నంబరులో రిజిస్ట్రేషన్‌ చేయించాడు. అది కూడా కనిగిరి దగ్గరలోని హెచ్‌ఎంపాడు మండలం నందనవనం గ్రామానికి చెందిన పాశం వెంకటేశ్వర్లు వద్ద పవర్‌ ఆఫ్‌ అటార్నీ తీసుకున్నామంటూ దస్తావేజులు పుట్టించి అక్రమ రిజిస్ట్రేషన్‌ చేయించాడు. సహజంగా దర్శిలో చేయాల్సిన రిజిస్ట్రేషన్‌ను విజయవాడ నుంచి చేయించాడు.

అమ్మేందుకు రావడంతో మోసం బహిర్గతం

రెండు రోజుల క్రితం నీలిమ తన 2వేల గజాల స్థలాన్ని అమ్మడానికి పార్టీని తీసుకుని స్థలం వద్దకు వచ్చారు. అక్కడ తన స్థలాన్ని చూపుతుంటే మరొకరు వచ్చి ఇది నాది, మీది కాదంటూ అడ్డం తిరిగాడు. వెంటనే ఆమె తనకు రిజిస్ట్రేషన్‌ చేసిన బుల్లా విజయకుమార్‌ను నిలదీయగా తప్పు జరిగిందని, వెంటనే అక్కడ నుంచి రావాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను మోసపోయానని గ్రహించిన నీలిమ కురిచేడు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ జి.కోటయ్య చీటింగ్‌ కేసు నమోదు చేశారు. ఇలా అక్రమ రిజిస్ట్రేషన్‌తో మోసపోయిన వారు చాలామంది ఉన్నారని కోట్లల్లో చాలామంది నష్టపోయారని నీలిమ తెలియజేస్తున్నారు. కొంతమంది దగ్గర డబ్బులు తీసుకుని రిజిస్ట్రేషన్‌ చేయకుండా అగ్రిమెంట్‌ మాత్రమే రాసి ఇచ్చారని త్వరలో వారు కూడా బయటకు వస్తారని ఆమె అంటున్నారు. తన బంధువులు, తెలిసిన వారు 70ప్లాట్ల వరకు కొనుగోలు చేశారని వివరించారు.

Updated Date - Jul 29 , 2026 | 02:54 AM