Share News

భారీ కోత

ABN , Publish Date - Jun 30 , 2026 | 02:59 AM

వచ్చే సీజన్‌ పొగాకు పంట ఉత్పత్తి పరిమాణంలో భారీగా కోతపడనుంది. రాష్ట్రంలో కేవలం 81 మిలియన్‌ కిలో లకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. ఆమేరకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల నుంచి పొగాకు బోర్డుకు స్పష్టమైన సమాచారం అందింది.

భారీ కోత
ఏరువాక సందర్భంగా ఒంగోలు-2 వేలం కేంద్రం సమీపంలో అరక దున్నుతున్న పొగాకు బోర్డు ఈడీ విశ్వశ్రీ

పొగాకు ఉత్పత్తి పరిమాణం తగ్గింపు

రానున్న సీజన్‌కు రాష్ట్రంలో 81 మిలియన్‌ కిలోలకే అనుమతి

ప్రభుత్వాల నుంచి సంకేతాలు

గతంతో పోల్చితే 43శాతం తగ్గుదల

అనధికార సాగు కట్టడికి చర్యలు

ప్రస్తుత కొనుగోళ్లపైనా అధికార యంత్రాంగం పర్యవేక్షణ

వేలం కేంద్రాల వద్ద వ్యవసాయ, రెవెన్యూ అధికారులతో నిఘా

వెల్లంపల్లిలో వేలంను పరిశీలించిన మంత్రి గొట్టిపాటి

ఒంగోలు-2 వద్ద ఏరువాకలో పాల్గొన్న బోర్డు చైర్మన్‌, ఈడీ

ఒంగోలు, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి) : వచ్చే సీజన్‌ పొగాకు పంట ఉత్పత్తి పరిమాణంలో భారీగా కోతపడనుంది. రాష్ట్రంలో కేవలం 81 మిలియన్‌ కిలో లకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. ఆమేరకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల నుంచి పొగాకు బోర్డుకు స్పష్టమైన సమాచారం అందింది. అదేసమయంలో పంట ఉత్పత్తి ఎక్కువకాకుండా, అనధికారిక సాగు జరగకుండా పర్యవేక్షించేందుకు కలెక్టర్ల నేతృత్వంలో అధికార యంత్రాంగాన్ని కూడా రంగంలోకి దించుతున్నారు. ఇప్పటివరకు బోర్డు పర్యవేక్షణ మాత్రమే ఉండటంతో అదనపు సాగు పెద్దఎత్తున ఉంటోంది. దీంతో ఉత్పత్తి భారీగా పెరిగి మార్కెట్లో సంక్షోభం తలెత్తుతుండటంతో ప్రభుత్వాలు దీనిపై దృష్టి సారించాయి. వచ్చే సీజన్‌ (2026-27)కు పొగాకు పంట ఉత్పత్తి పరిమాణంలో భారీగా కోతపెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఆ మేరకు ప్రభుత్వాలు బోర్డుకు దిశానిర్దేశం చేశాయి. ప్రస్తుత సీజన్‌ పొగాకు మార్కెట్‌ తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటూ చివరికి రోజువారీ సగం బేళ్లు తిరస్కరణకు గురవడంతోపాటు భారీగా ధరలు తగ్గి రైతులు పెద్దఎత్తున నష్టపోతున్నారు. ఈనేపథ్యంలో రైతు సంఘాలు ఆందోళనలను ఉధృతం చేశాయి. అదేసమయంలో బోర్డు అధికారులు, అధికార పార్టీ నేతలపై రైతుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. పదిరోజుల క్రితం స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు స్పందించి కీలక సమీక్ష చేశారు. సగటు ధర కిలో రూ.200కు తగ్గరాదని, నోబిడ్‌లు ఉండకూడదని ఆదేశించారు. అయినా మార్కెట్లో ఆశించిన మార్పు కనిపించలేదు. ప్రస్తుత పరిస్థితికి మూడు ప్రధాన కారణాలను బోర్డు, ప్రభుత్వాల దృష్టికి వ్యాపారులు తీసుకెళ్లారు. అందులో సిగరెట్‌ ఉత్పత్తులపై జీఎస్టీ పెంపు, పశ్చిమాసియాలో యుద్ధవాతావరణం, అంతకు మించి స్థానికంగా భారీగా పంట ఉత్పత్తి కావడమని చెప్పారు. పలు ఇతర దేశాల్లో పంట భారీగా ఉత్పత్తి కావడంతో విదేశీ వ్యాపారులు ఇక్కడి పంటకు ధరలు కాదు కదా ఆర్డర్లు ఇవ్వడానికి కూడా సకాలంలో ముందుకు రావడం లేదని వివరించారు.

అధిక ఉత్పత్తే ప్రధాన కారణం

వ్యాపారులు చెప్పిన మూడు ప్రధాన కారణాల్లో ఒకటైన జీఎస్టీ తగ్గింపునకు కేంద్రం సముఖంగా లేదు. రెండో కారణమైన పశ్చిమాసియా పరిస్థితులు ఇంకా కుదటపడలేదు. ఆ రెండు అంశాలు వెనక్కు వెళ్లినా మార్కెట్‌ సంక్షోభంలోనే కొట్టుమిట్టాడటానికి పెరిగిన పంట ఉత్పత్తే ప్రధాన కారణంగా, ప్రతిబంధకంగా నిలిచింది. దీంతో ఈ అంశంపై కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు దృష్టి సారించాయి. ప్రస్తుత సీజన్‌(2025-26)లో రాష్ట్రంలో 142 మిలియన్‌ కిలోలకు అనుమతి ఇస్తే 230 మిలియన్‌ కిలోల ఉత్పత్తి వచ్చినట్లు అంచనా వేశారు. అంటే దాదాపు 88 మిలియన్‌ కిలోలు అధికంగా పండింది. దీంతో వచ్చే సీజన్‌ (2026-27)లో పంట ఉత్పత్తిని ఆమేర తగ్గించడం ద్వారా ప్రస్తుత సీజన్‌లో పండిన పంట కొనుగోళ్లకు మార్గం సుగమం చేయాలని ప్రభుత్వాలు భావించాయి. ఈక్రమంలో రానున్న సీజన్‌కు గతంలో వలే 142 మిలియన్‌ కిలోలు ఉత్పత్తి ఖరారు లక్ష్యంతో ఈనెల 25న పొగాకు బోర్డు పాలక మండలి సమావేశమైంది. ఆఖరు నిమిషంలో ప్రభుత్వం నుంచి వచ్చిన సంకేతాలతో ఉత్పత్తి పరిమాణం ఖరారు చేయకుండా సమావేశం ముగించారు.

యంత్రాంగానికి నియంత్రణ బాధ్యతలు

రానున్న సీజన్‌కు 81 మిలియన్‌ కిలోల పంట ఉత్పత్తికి మాత్రమే అనుతించాలని ప్రభుత్వాలు పొగాకు బోర్డుకు సంకేతాలు ఇచ్చిననట్లు తెలిసింది. అనధికార పంట సాగు, ఉత్పత్తి నియంత్రణ పొగాకు బోర్డుకే పరిమితం కాకుండా కలెక్టర్ల నేతృత్వంలో వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు కూడా రంగంలోకి దించనున్నాయి. ఆమేరకు ప్రభుత్వం నుంచి సమాచారం అందినట్లు కలెక్టర్‌ రాజాబాబు ఆంధ్రజ్యోతికి తెలిపారు. ఈక్రమంలోనే ప్రస్తుత కొనుగోళ్లపై కూడా పర్యవేక్షణ పెడుతున్నామని చెప్పారు. డివిజన్‌ స్థాయి రెవెన్యూ అధికారులు తరచూ వేలం కేంద్రాలను సందర్శించి మార్కెట్‌ తీరు పరిశీలిస్తారని, అలాగే వ్యవసాయశాఖ ఏడీలు కేంద్రాల్లో రోజువారీ వేలం పర్యవేక్షించి సీఎం ఆదేశాలకు అనుగుణంగా ధరలు వచ్చేలా, నోబిడ్‌లు తగ్గేలా చర్యలు తీసుకుంటారన్నారు. మరోవైపు జిల్లాకు చెందిన విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ సోమవారం వెల్లంపల్లిలో పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించి కొనుగోళ్లను పరిశీలించారు. ప్రభుత్వం రైతుల తరపున ఉందన్న సంకేతాలను ఇచ్చారు. అక్కడికి వచ్చిన బోర్డు చైర్మన్‌, ఈడీలకు రైతుల సమక్షంలోనే పలు సూచనలు చేశారు.

ఘనంగా ఏరువాక.. ఉత్పత్తిపై స్పష్టత

ఏటా ఒంగోలు-2 వేలం కేంద్రం వద్ద రైతు కమిటీలు నిర్వహించే ఏరువాక సోమవారం జరిగింది. రైతు కమిటీ అధ్యక్షుడు వడ్డెళ్ల ప్రసాద్‌ ఇతర నాయకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సాగగా అరకలు కట్టి పొలం దున్నారు. బోర్డు చైర్మన్‌ యశ్వంత్‌కుమార్‌, ఈడీ విశ్వశ్రీ, ఇతర అఽధికారులు, పలు ప్రాంతాల నుంచి వచ్చిన రైతు ప్రతినిధులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం వేలం కేంద్రం ఆవరణలో సూపరింటెండెంట్‌ జె.తులసి అధ్యక్షతన సభ నిర్వహించారు. రానున్న సీజన్‌కు కేవలం 81 మిలియన్‌ కిలోల పొగాకు ఉత్పత్తికి మాత్రమే అనుమతివ్వనున్నట్లు ఈ సందర్భంగా చైర్మన్‌ యశ్వంత్‌కుమార్‌, ఈడీ విశ్వశ్రీ స్పష్టం చేశారు. ఆ ప్రకారమే పంట సాగు, ఉత్పత్తి చేయాలని సూచించారు. ప్రస్తుత ఏడాది పండిన పంట మొత్తాన్ని కొనుగోలు చేసేందుకు బోర్డు ద్వారా అన్ని చర్యలు తీసుకుంటున్నామని నిరంతరం వ్యాపారులతో చర్చలు సాగిస్తున్నామన్నారు. రైతులు అధైర్యపడి అక్రమంగా బయట అమ్మకాలు చేయవద్దని సూచించారు. బోర్డు సెక్రటరీ దివి వేణుగోపాల్‌, ఒంగోలు ప్రాంతీయ మేనేజర్‌ జీఎల్‌కే.ప్రసాద్‌, బోర్డు విస్తరణ మేనేజర్‌ జె.సురేఖ, రైతుప్రతినిధులు యర్రమనేని శేషయ్య, పెనుబోతు సునీల్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 30 , 2026 | 02:59 AM