Share News

లోకేష్‌ పర్యటనకు భారీ ఏర్పాట్లు

ABN , Publish Date - Aug 26 , 2026 | 03:03 AM

తెలుగుదేశం పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ జిల్లా పర్యటనపై ఆ పార్టీ నేతలు ప్రత్యేక దృష్టి సారించారు. ఒంగోలు, ఎస్‌ఎన్‌పాడు నియోజకవర్గాల్లో ఈనెల 28న లోకేష్‌ పర్యటించనుండగా శాసనసభ్యులు దామచర్ల జనార్దన్‌, బీఎన్‌.విజయకుమా ర్‌లు ఇప్పటికే ఏర్పాట్లలో నిమగ్నమ య్యారు.

లోకేష్‌ పర్యటనకు భారీ ఏర్పాట్లు
లోకేష్‌ పర్యటన ఏర్పాట్లపై ఒంగోలులోని టీడీపీ కార్యాలయంలో సమావేశమైన పార్లమెంట్‌ పరిశీలకుడు వెంకటరాజు, ఎమ్మెల్యేలు జనార్దన్‌, ఉగ్రనరసింహారెడ్డి, బీఎన్‌

కీలక నేతలతో పార్లమెంట్‌ పరిశీలకుడు మద్దిపాటి భేటీ

పాల్గొన్న దామచర్ల, ఉగ్ర, బీఎన్‌, నూకసాని

ఘన స్వాగతంతోపాటు భారీగా కార్యకర్తల సమీకరణపై దృష్టి

నగర నాయకులు, కార్పొరేషన్‌ అధికారులతో జనార్దన్‌ సమీక్ష

ఒంగోలు, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి) : తెలుగుదేశం పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ జిల్లా పర్యటనపై ఆ పార్టీ నేతలు ప్రత్యేక దృష్టి సారించారు. ఒంగోలు, ఎస్‌ఎన్‌పాడు నియోజకవర్గాల్లో ఈనెల 28న లోకేష్‌ పర్యటించనుండగా శాసనసభ్యులు దామచర్ల జనార్దన్‌, బీఎన్‌.విజయకుమా ర్‌లు ఇప్పటికే ఏర్పాట్లలో నిమగ్నమ య్యారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా లోకేష్‌ ఎంపిక అనంతరం ఈ ప్రాంతానికి తొలిసారి పర్యటనకు ఆయన వస్తున్నారు. దీంతో లోకేష్‌కు ఘనస్వాగతం పలకడంతో పాటు కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహంగా సాగేలా చేయాల్సిన ఏర్పాట్లపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఒంగోలు పార్లమెంట్‌ పరిశీలకుడు, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మంగళవారం ఒంగోలు వచ్చి కీలక నేతలతో భేటీ అయ్యారు. ఒంగోలు, సంతనూతలపాడు ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్‌, బీఎన్‌.విజయకుమార్‌, టీడీపీ పార్లమెంట్‌ అధ్యక్షుడు, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు, టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌ నూకసాని బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

పర్యటన రూట్‌మ్యాప్‌ సిద్ధం

ఒంగోలులోని గుంటూరు రోడ్డులో ఉన్న దామచర్ల కార్యాలయంలో జరిగిన భేటీలో లోకేష్‌ పర్యటన కార్యక్రమాల ఖరారు, ఉత్సాహంగా పర్యటన సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. వారు చర్చించి రూపొం దించిన షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 28వ తేదీ ఉదయం 9గంటలకు ఎస్‌ఎన్‌పాడు నియోజకవర్గ సరిహద్దు అయిన గుండ్లాపల్లి గ్రోత్‌ సెంటర్‌కు లోకేష్‌ చేరుకుంటారు. అనంతరం మద్దిపాడు, ఏడుగుండ్లపాడు మీదుగా చదలవాడ సమీపంలోని రవిప్రియ చతుర్వాటిక వద్దకు వస్తారు. అక్కడ రవిప్రియ రాడిసన్‌ హోటల్‌ నిర్మాణానికి భూమిపూజ చేస్తారు. అక్కడి నుంచి త్రోవగుంట మీదుగా ఒంగోలు నగరం లోకి ప్రవేశిస్తారు. ఉత్తర బైపాస్‌ రోడ్డు బ్రిడ్జి వద్ద విగ్రహాల ఆవిష్కరణ, రంగా రాయుడు చెరువు వద్ద తాగునీటి పథ కం పనుల పైలాన్‌ ఆవిష్కరణ, డీసీసీబీ నూతన భవన ప్రారంభోత్సవం, రిమ్స్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, మినీస్టేడియంలో సైకిళ్ల పంపిణీ వంటి వాటికి హాజరవుతారు. అనంతరం ఒంగోలు నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. ఆ మేరకు రూట్‌ మ్యాప్‌ను కూడా ఈ సమావేశంలో సిద్ధం చేశారు.

భారీ ఏర్పాట్లలో నేతలు

గ్రోత్‌ సెంటర్‌ వద్ద ఎమ్మెల్యే బీఎన్‌ విజయకుమార్‌ ఆధ్వర్యంలో ఘనస్వాగతంతోపాటు చదలవాడ వద్దకు వేలాది మంది ఎస్‌ఎన్‌పాడు నియోజకవర్గ టీడీపీ శ్రేణులు, కూటమి కార్యకర్తలు హాజరయ్యేలా చూడాలని నిర్ణయించారు. ఆతర్వాత ఒంగోలు వచ్చే లోకేష్‌కు త్రోవగుంట వద్ద ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ ఘనస్వాగతం పలకడంతోపాటు అక్కడి నుంచి నగరంలో జరిగే అన్ని కార్యక్రమాలకు భారీ బైక్‌ ర్యాలీతో లోకేష్‌ను తీసుకెళ్లేలా కార్యక్రమం రూపొందిస్తున్నారు. లోకేష్‌ ప్రయాణించే మార్గం అంతా ఫ్లెక్సీలతో నింపే యోచన చేస్తున్నారు. లోకేష్‌ పర్యటనకు సంబంధించి రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన ప్రతినిధులు కూడా ఆ భేటీలో పాల్గొన్నారు. అనంతరం నగరంలోని క్లస్టర్‌ ఇన్‌చార్జిలు, ఇతర ముఖ్యనాయకులతో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ సమావేశం నిర్వహించి కార్యకర్తల సమీకరణ, ఆయాప్రాంతాల్లో ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. అలాగే మునిసిపల్‌ అధికారులతో సమావేశమై నగరంలో కార్యక్రమాల ఏర్పాట్ల పురోగతిపై సమీక్ష చేశారు. నియోజకవర్గ పార్టీ ముఖ్యనాయకులతో బుధవారం ఉదయం మరోసారి సమావేశాన్ని నిర్వహించనున్నారు.

Updated Date - Aug 26 , 2026 | 03:03 AM