సీఎం పర్యటనకు భారీ ఏర్పాట్లు
ABN , Publish Date - Oct 06 , 2026 | 01:51 AM
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జిల్లా పర్యటన ఖరారైంది. ఈనెల 9న ఆయన ఇక్కడికి వస్తుండగా కార్యక్రమ స్థలాన్ని ఆ పార్టీ ముఖ్యనేతలు, అధికారులు సోమవారం పరిశీలించి ఖరారు చేశారు. కొండపి నియోజకవర్గానికి సీఎం వస్తుండగా జరుగుమల్లి మండలం నర్సింగోలు గ్రామంలో కార్యక్రమాన్ని నిర్వహించాలని మంత్రి డాక్టర్ డీఎస్‌బీవీ స్వామి, మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య నిర్ణయానికి వచ్చారు.
9న జరుగుమల్లి మండలం నర్సింగోలులో కార్యక్రమం
రైతులకు పాస్ పుస్తకాల పంపిణీ
కొండపి నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ
స్థల పరిశీలన చేసిన మంత్రులు ఆనం, స్వామి,
కలెక్టర్, దామచర్ల సత్య, ఎమ్మెల్యేలు
ఒంగోలు, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి) : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జిల్లా పర్యటన ఖరారైంది. ఈనెల 9న ఆయన ఇక్కడికి వస్తుండగా కార్యక్రమ స్థలాన్ని ఆ పార్టీ ముఖ్యనేతలు, అధికారులు సోమవారం పరిశీలించి ఖరారు చేశారు. కొండపి నియోజకవర్గానికి సీఎం వస్తుండగా జరుగుమల్లి మండలం నర్సింగోలు గ్రామంలో కార్యక్రమాన్ని నిర్వహించాలని మంత్రి డాక్టర్ డీఎస్‌బీవీ స్వామి, మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య నిర్ణయానికి వచ్చారు. తొలుత అదే మండలంలోని కె.బిట్రగుంట లేదా నర్సింగోలులో నిర్వహించాలన్న అభిప్రాయంలో వారు ఉండగా సోమవారం వారితో కలిసి జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, ఒంగోలు, ఎస్‌ఎన్‌పాడు, కందుకూరు ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బీఎన్. విజయ్‌కుమార్, ఇంటూరి నాగేశ్వరరావు, కలెక్టర్ రాజాబాబు, జేసీ కల్పనాకుమారి, ఎస్పీ హర్షవర్ధన్ రాజులు ఆ రెండు గ్రామాలను సందర్శించి పరిశీలన చేశారు. చివరకు నర్సింగోలు వద్దనే నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చారు. ఙ
కార్యకర్తలతో సమావేశంకానున్న సీఎం
రాష్ట్రవ్యాప్తంగా గత వైసీపీ పాలనలో తప్పులతడకగా సాగిన భూముల రీసర్వే ప్రక్రియను తిరిగి చేపట్టి ఆ తప్పులను సవరించి రైతులకు పాస్‌పుస్తకాల అందజేత కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చేపట్టింది. అందులోభాగంగా ప్రతినెలా 9న ఒక జిల్లాలో సీఎం చంద్రబాబునాయుడు స్వయంగా ఈ కార్యక్రమానికి హాజరవుతుండగా ఈసారి జిల్లాలోని కొండపి నియోజకవర్గానికి వస్తున్నారు. అలా పాస్‌పుస్తకాల పంపిణీ సభతోపాటు కొండపి నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమావేశంలోనూ ఆయన పాల్గొననున్నారు. అందుకోసం నర్సింగోలు వద్ద అధికారికంగా ప్రభుత్వ కార్యక్రమానికి, టీడీపీ కార్యకర్తల సమావేశానికి విడివిడిగా ఏర్పాట్లు చేయనున్నారు.
ఏర్పాట్లు ప్రారంభం
రాష్ట్ర విభజన అనంతరం సీఎం హోదాలో చంద్రబాబు కొండపి నియోజకవర్గానికి దాదాపు పుష్కర కాలానికి వస్తున్నారు. గతంలో 2014-19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు 2014 డిసెంబరు 15న కొండపిలో ప్రభుత్వపరంగా నిర్వహించిన రైతు సదస్సుకు సీఎం హోదాలో చంద్రబాబు హాజరయ్యారు. 2019 ఎన్నికలప్పుడు ప్రచారానికి సింగరాయకొండకు వచ్చారు. అనంతరం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కందుకూరులో నిర్వహించిన సభలో ప్రమాదవశాత్తు పలువురు కార్యకర్తలు మృతిచెందగా వారిలో కొందరు కొండపి వారు ఉండటంతో రింగ్‌రోడ్డులోని పలు గ్రామాల్లో తిరిగి ఆ కుటుంబాలను పరామర్శిం చారు. ఆ రెండు అధికారిక కార్యక్రమాలు కాకపోగా ప్రస్తుతం దాదాపు 12ఏళ్లకు మరోసారి అధికారిక హోదాలో ఆయన ఈనెల 9న కొండపి నియోజకవర్గానికి వస్తున్నారు. దీంతో సీఎం సభను దిగ్విజయంగా నిర్వహించాలని మంత్రి డాక్టర్ స్వామి, యువనేత దామచర్ల సత్య నిర్ణయానికి వచ్చారు. తదనుగుణంగా ఏర్పాట్లను వెంటనే ప్రారంభించారు. నియోజకవర్గంలో అన్ని మండలాల నుంచి భారీగా జనసమీకరణ చేయనున్నారు. అందుకోసం సోమవారం సాయంత్రం నియోజకవర్గ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశాన్ని వారు నిర్వహించారు. గ్రామాలవారీ జనసమీకరణపై చర్చించి తగు సూచనలను మండల, గ్రామస్థాయి నాయకులకు చేశారు. సీఎం కార్యక్రమం జరిగే నర్శింగోలు జరుగుమల్లి మండలం మధ్యలో ఉండటం కలిసొచ్చే అంశం కాగా అక్కడకు 20కి.మీ దూరంలోపే టంగుటూరు, సింగరాయకొండ, కొండపి మండలాలు ఉన్నాయి. దీంతో ఈ నాలుగు మండలాల నుంచి వేలాది మంది తరలివచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక కార్యకర్తల సమావేశానికి పార్టీ రాష్ట్ర కార్యాలయ సూచనలకు అనుగుణంగా ఎంపిక చేసిన వారిని అనుమతించనున్నారు.