ఉరి వేసుకుని వివాహిత మృతి
ABN , Publish Date - Sep 06 , 2026 | 11:03 PM
కుటుంబ కలహాల నేపథ్యంలో వివాహిత ఉరి వేసుకుని మృతి చెందిన సంఘటన శనివారం చోటుచేసుకోగా, ఆదివారం వెలుగులోకి వచ్చింది.
కనిగిరి, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి) : కుటుంబ కలహాల నేపథ్యంలో వివాహిత ఉరి వేసుకుని మృతి చెందిన సంఘటన శనివారం చోటుచేసుకోగా, ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ని యోజకవర్గంలోని హెచ్‌ఎంపాడు మండలానికి చెందిన పొదిలి కొండలరావుతో కనిగిరి మండలం బొటికర్లపాడు గ్రామానికి చెందిన మల్లేశ్వరి(35)తో 18ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. బతుకుదెరువు కోసం నాలుగేళ్ల క్రితం కనిగిరి వచ్చి పట్టణంలోని లాడేసాహెబ్ వీదిలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. మృతురాలి భర్త కొండలరావు ముఠాపని చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో కొండలరావు తల్లి ఇటీవల మృతి చెందింది. కొండలరావు తన భార్యతో తన స్వగ్రామం వెళ్లి పోదామని చెప్తున్నాడు. అక్కడికి వెళ్లడం మృతురాలికి ఇష్టంలేదు. ఈ విషయంపై ఇరువురి మధ్య కలహాలు ఏర్పడ్డాయి. ఆమె శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. పెద్ద కుమారుడు కళాశాల నుంచి ఇంటికి వచ్చేసరికి తల్లి వేలాడుతూ, మృతి చెందిఉంది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.