Share News

మార్కెట్‌ గుబులు

ABN , Publish Date - Apr 28 , 2026 | 02:43 AM

పొగాకు మార్కెట్‌ తీరు రైతుల్లో గుబులు రేపుతోంది. నేటికీ రోజు మార్చి రోజు వేలం కొనసాగుతోంది. అమ్మకాలకు పరిమితంగానే బేళ్లను బోర్డు అధికారులు అనుమతిస్తున్నారు. వాటిని కూడా వ్యాపారులు సక్రమంగా కొనుగోలు చేయడం లేదు.

మార్కెట్‌ గుబులు

ఇలాగైతే పొగాకు వేలం ఏడాదిపైనే సాగాలి

నెలలో 2.02 మిలియన్‌ కిలోలు మాత్రమే కొనుగోలు

కొనసాగుతున్న రోజు మార్చి రోజు వేలం

పంట ఉత్పత్తిలో కొన్నది ఒకటిన్నర శాతంలోపే

పరిమితంగానే బేళ్లకు అనుమతి

వాటిలోనూ మూడో వంతు తిరస్కరణలు

రైతుల్లో తీవ్ర ఆందోళన

కోల్డ్‌ స్టోరేజీల్లో భారీగా నిల్వ

పొగాకు మార్కెట్‌ తీరు రైతుల్లో గుబులు రేపుతోంది. నేటికీ రోజు మార్చి రోజు వేలం కొనసాగుతోంది. అమ్మకాలకు పరిమితంగానే బేళ్లను బోర్డు అధికారులు అనుమతిస్తున్నారు. వాటిని కూడా వ్యాపారులు సక్రమంగా కొనుగోలు చేయడం లేదు. రకరకాల కారణాలతో నిత్యం మూడో వంతు తిరస్కరణలు జరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితికి అంతర్జాతీయంగా పంట ఉత్పత్తి పెరుగుదల, యుద్ధ ప్రభావం, సిగరెట్‌ ఉత్పత్తులపై జీఎస్టీని పెంచడం.. ఇలా రకరకాల కారణాలను వ్యాపారులు చెప్తున్నారు. అంతిమంగా వీలైనంత తక్కువ ధరకు కొనుగోలు చేయాలన్న రహస్య ఆలోచన కీలక కంపెనీలలో ఉందని రైతులు భావిస్తున్నారు. అదేసమయంలో వ్యాపారులను నియంత్రించి రైతుల పక్షాన నిలబడటంలో గతంలో ఉన్నంత గట్టిగా పొగాకు బోర్డు వ్యవహరించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.

ఒంగోలు, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి) : ఈ సీజన్‌ దక్షిణాది పొగాకు మార్కెట్‌ పరిస్థితి తీవ్ర ఆందోళన కరంగా కనిపిస్తోంది. వేలం ప్రక్రియ ప్రారంభమై నెల గడిచినా పంట ఉత్పత్తి అంచనాలో కనీసం ఒకటిన్నర శాతం మించి కొనుగోలు జరగలేదు. గత మూడేళ్లుగా మార్కెట్‌ కాస్తంత బాగుండి ధరలు మెరుగ్గా లభించడంతో రైతులు ఏటికేడు ఉత్పత్తి గణనీయంగా పెంచుతూ వస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటలకు సరైన ధరలు లేకపోవడం, వాతావరణం అనుకూలించక పోవడం కూడా ఇందుకు కారణమైంది. పంట కొనుగోళ్లను వంద రోజుల్లోపు పూర్తిచేయాలన్నది పొగాకు బోర్డు లక్ష్యం. అలా చేయగలిగితేనే రైతులకు కూడా ఉపయుక్తం. అయితే గతంలో ఎన్నడూ వంద రోజులకు పూర్తిచేయలేకపోయినా గరిష్ఠంగా ఐదు నెలల్లో ముగిసేది. అలాంటిది గత ఏడాది ఏకంగా ఎనిమిది మాసాలకుపైన సాగింది. అందుకు అధికోత్పత్తి కారణంగా చూపారు. ప్రస్తుత సీజన్‌ (2025-26)కు దక్షిణాదిలో సుమారు 88.88 మిలియన్‌ కిలోల పంట ఉత్పత్తికి బోర్డు అనుమతి ఇచ్చింది. దాదాపు 148 మిలియన్‌ కిలోలు ఉత్పత్తి అవుతుందని అంచనా. అలా భారీగా పంట పెరగ్గా వేలం ప్రక్రియ ప్రారంభం ఆలస్యమైంది. గత ఏడాది మార్చి 10న వేలం ప్రారంభించగా ఈ ఏడాది అతికష్టం మీద మార్చి 25న ఈ ప్రాంతంలో ఉన్న 11 కేంద్రాల్లో రెండు చోట్ల, ఈనెల 9న మిగిలిన తొమ్మిది చోట్ల ప్రారంభించారు.

మన మార్కెట్‌పై కర్ణాటక ప్రభావం

మన మార్కెట్‌కు దిక్సూచిగా ఉండి, వేలం ముందు సాగే కర్ణాటకలో ఈ ఏడాది మార్కెట్‌ తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొని బాగా జాప్యమైంది. ఆ ప్రభావంతో ఇక్కడ ఆలస్యంగా కొనుగోళ్లను ప్రారంభించారు. అంతేకాక రెగ్యులర్‌గా నిర్వహించలేకపోతున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న 11 కేంద్రాల్లో ఒకరోజు ఐదు, మరో రోజు ఆరు చోట్ల వేలం చేపడుతున్నారు. రోజువారీ అమ్మకాలకు తెచ్చుకునేందుకు రైతులకు పరిమితంగానే బేళ్లను అనుమతిస్తున్నారు. దీనికితోడు గతేడాది ప్రారంభ ధర కిలో రూ.280 ఇచ్చిన వ్యాపారులు ఈ ఏడాది రూ.250కే పరిమితం చేశారు. వేలం ప్రారంభించి నెల గడుస్తున్నప్పటికీ ధరలు పెరగక రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. తెచ్చిన బేళ్లలోనూ నిత్యం 35శాతం వరకు నోబిడ్‌లు, ఇతర రూపాలలో తిరస్కరణలు జరుగుతున్నాయి. దక్షిణాదిలోని రెండు రీజియన్లలో ఉన్న 11 కేంద్రాల్లో నెల రోజుల వేలం తీరును చూస్తే కేవలం 2.02 మిలియన్‌ కిలోలు మాత్రమే కొనుగోలు జరిగింది. సగటు ధర కిలో రూ. 242.39గా ఉంది. అంటే ఈ ప్రాంతంలో పంట ఉత్పత్తి అంచనా 148 మిలియన్‌ కిలోలలో నెల వ్యవఽధిలో కొన్నది కేవలం 1.50శాతం లోపు మాత్రమే.

ధర కూడా లభించడం లేదు

దక్షిణాదిలోని మొత్తం 11 కేంద్రాల్లో శనివారం ఆరు చోట్ల వేలం నిర్వహించగా 2,743 బేళ్లను అధికారులు అమ్మకాలకు అనుమతించారు. అందులో 1,770 మాత్రమే కొనుగోలు చేశారు. రకరకాల కారణాలతో 979 తిరస్కరణకు గురయ్యాయి. అంటే అమ్మకాలకు తెచ్చిన బేళ్లలో సుమారు 35.69శాతం మేర వెనక్కి వెళ్లాయి. అదేసమయంలో పొగాకు బోర్డు అధికారులు సూచించిన ధరకు కూడా వ్యాపారులు కొనడం లేదు. శనివారం నాటి వేలానికి తెచ్చిన 2,743 బేళ్లలో ఇలాంటివి 760 ఉన్నాయి. అంటే సుమారు 27.72శాతం బేళ్లు అధికారులు ప్రకటించిన ధర కూడా రాక వెనక్కు వెళ్లాయి. తిరస్కరణలు జరిగిన మొత్తం 35.69శాతం బేళ్లలో నోబిడ్లు 27.72శాతం పోను మిగతా 8శాతం వేలం ముగిశాక నాణ్యత సరిలేదని బయ్యర్లు రిజర్వు చేయడం, ఇచ్చిన ధర సరిపోదంటూ రైతులు రిజక్టు చేయడం వంటివి ఉన్నాయి. వేలం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ నెల రోజుల మార్కెట్‌ తీరును పరిశీలిస్తే ఈ సీజన్‌ కొనుగోళ్ల పూర్తికి ఏడాది పట్టే పరిస్థితి కనిపిస్తుందని ఆ రంగంలో అనుభవజ్ఞులు అంచనా వేస్తుస్తున్నారు.

Updated Date - Apr 28 , 2026 | 02:43 AM