దంతెరపల్లెలో వ్యక్తి దారుణ హత్య
ABN , Publish Date - Jan 06 , 2026 | 11:09 PM
మనస్పర్థల నేపథ్యంలో భర్తను భార్యతోపాటు అతని కూతురు దారుణంగా హత్య చేశారు.
రాడ్డుతో కొట్టిచంపిన భార్య, కూతురు
పోలీసులు కేసు నమోదు, విచారణ
గిద్దలూరు టౌన్, జనవరి 6(ఆంధ్రజ్యోతి): మనస్పర్థల నేపథ్యంలో భర్తను భార్యతోపాటు అతని కూతురు దారుణంగా హత్య చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం సంజీవరాయునిపేట పంచాయతీ పరిధిలోని దంతెరపల్లె గ్రామంలో మేకల హరి(55), లక్ష్మీదేవి భార్యాభర్తలు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కూతురిని చీరాల ఇచ్చి వివాహం చేశారు. వృత్తిపరంగా వ్యవసాయం, కూలీ పనులు చేసుకుని జీవిస్తున్నారు. 15 ఏళ్ల నుంచి భార్యాభర్తలిద్దరి మధ్య మనస్పర్థల కారణంగా దూరంగా ఉంటున్నారు. హరి ఇతర ప్రాంతాల్లో జీవిస్తుండేవాడు. కొన్నిరోజులుగా తిరిగి వచ్చి భార్యతో ఉంటూ తరచూ గొడవపడుతున్నారు. రెండురోజుల కిందట కూతురు జ్యోత్స్న ఇంటికి వచ్చింది. సోమవారం రాత్రి కూడా హరి గొడవపడ్డాడు. దీంతో అతనిని భార్య లక్ష్మీదేవి, కూతురు జ్యోత్స్న ఇనుపరాడ్డుతో బలంగా తలపై కొట్టారు. మద్యం మత్తులో ఉన్న అతను అక్కడికక్కడే మృతిచెందాడు. ఆ సమయంలో కుమారుడు కూడా ఇంట్లో లేడు. వీఆర్వో భూపని వెంకటేశ్వర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అర్బన్ సీఐ కె.సురేష్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.