పోలీసులు వేధిస్తున్నారని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
ABN , Publish Date - Feb 24 , 2026 | 01:31 AM
స్థలం వివాదంలో తన కుటుంబ సభ్యులను పోలీసులు వేధిస్తున్నారని, అందుకు ఆవేదనతో ఆత్మహత్య చేసుకుంటున్నానని ఓ వ్యక్తి పురుగుల మందు తాగాడు. దాన్ని సెల్ఫీవీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. అందుకు కారణాలను కూడా సోషల్ మీడియాలో లేఖ ద్వారా తెలియజేశాడు.
పురుగుల మందు తాగుతూ సెల్ఫీవీడియో
సామాజిక మాధ్యమాల్లో పోస్ట్
వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితుడు
మార్కాపురం, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి) : స్థలం వివాదంలో తన కుటుంబ సభ్యులను పోలీసులు వేధిస్తున్నారని, అందుకు ఆవేదనతో ఆత్మహత్య చేసుకుంటున్నానని ఓ వ్యక్తి పురుగుల మందు తాగాడు. దాన్ని సెల్ఫీవీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. అందుకు కారణాలను కూడా సోషల్ మీడియాలో లేఖ ద్వారా తెలియజేశాడు. వివరాల్లోకి వెళితే.. త్రిపురాంతకం మండలం పాతఅన్నసముద్రం గ్రామానికి చెందిన పంపనాటి అంకారావు ఆయన తండ్రి సుబ్బయ్య, సోదరుడు యోగేష్‌కు చాలా కాలంగా ఓ స్థలం ఉంది. అందులో నుంచి దారి కోసం కొందరు వ్యక్తులు ఒత్తిడి తెచ్చారు. వారికి త్రిపురాంతకం సీఐ అస్సాన్, ఎస్సై శివబసవరాజు సహకరించి తన తండ్రి, సోదరుడిని స్టేషన్‌లో ఉంచి వేధించారని అంకారావు ఆరోపించారు. దీంతో మనస్తాపంతో తాను పురుగుమందు తాగుతున్నానని చెబుతూ అంకారావు ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే అతనిని గ్రామస్థులు వినుకొండలోని ఒక ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అక్కడ ఆయన చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏలూరి రామచంద్రారెడ్డి వైద్యశాలలో బాధితుడిని పరామర్శించారు. ఈ విషయమై సీఐ అస్సాన్ మాట్లాడుతూ గ్రామంలో దారిలేకుండా అడ్డుకుంటున్నారని కొందరు గ్రామస్థులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సుబ్బయ్య, యోగేష్‌లను విచారణకు పిలిచామన్నారు. వారితో కనీసం మాట్లాడలేదన్నారు. సీఎం కార్యక్రమ ఏర్పాట్లలో ఉన్నందున తరువాత విచారిద్దామని వారిని స్టేషన్ నుంచి పంపించివేశామన్నారు. ఉద్దేశపూర్వకంగా తమపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఆత్మహత్యాయత్నం చేసిన అంకారావును అసలు స్టేషన్‌కు కూడా పిలవలేదని చెప్పారు.