Share News

మద్దిపాడులో భారీ చోరీ

ABN , Publish Date - Jul 23 , 2026 | 11:18 PM

మద్దిపాడు యాదవ కాలనీలో భారీ చోరీ స్థానికంగా కలకలం రేపింది. గురువారం మధ్యాహ్నం గుర్తు తెలియని దొంగలు కారులో ప్రవేశించి బంగారు ఆభరణాలను తస్కరించారు.

మద్దిపాడులో భారీ చోరీ
వివరాలు సేకరిస్తున్న డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐలు

35 సవర్ల బంగారం, నగదు అపహరణ

కారులో వచ్చి దొంగతనానికి పాల్పడిన దొంగలు

మద్దిపాడు, జూలై 23(ఆంధ్రజ్యోతి) : మద్దిపాడు యాదవ కాలనీలో భారీ చోరీ స్థానికంగా కలకలం రేపింది. గురువారం మధ్యాహ్నం గుర్తు తెలియని దొంగలు కారులో ప్రవేశించి బంగారు ఆభరణాలను తస్కరించారు. ఎస్సై వెంకట సూర్య తెలిపిన వివరాల ప్రకారం... ఒంగోలు జిల్లా పరిషత్‌లో గుమస్తాగా విధులు నిర్వహిస్తున్న మీసాల కుమారి ఇంటిలో దొంగలు ప్రవేశించి ఇంటి గడియను కోసి బీరువాలో ఉన్న రూ.45 లక్షల విలువైన 35 సవర్ల బంగారు ఆభరణాలు, రూ.30 వేల నగదు దొంగిలించారు. కుమారి ఉదయాన్నే ఉద్యోగరీత్యా వెళ్లటంతో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. స్థానికులు గమనించి మద్దిపాడు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై ముందుగా ఇంటి వద్దకు చేరుకొని పరిశీలించారు. దొంగతనం జరిగిన తీరును డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావుకు సమాచారం అందించారు. వెంటనే డీఎస్పీ, ఒంగోలు రూరల్‌ సీఐ ముప్పలనేని శేషగిరిరావు, సీసీఎస్‌ సీఐ కమలాకర్‌, ఎస్సై వెంకటేశ్వర్‌ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని దొంగతనం చేసిన తీరును క్షుణ్ణంగా పరిశీలించారు. ఒంగోలు నుంచి క్లూస్‌ టీం వచ్చి వేలిముద్రలు సేకరించింది. డీఎస్పీ శ్రీనివాసరావు సీసీ కెమెరాలను పరిశీలించి దొంగలు ఉపయోగించిన కారు ఆనవాళ్లను సేకరించారు. పోలీసులు ఆరు బృందాలుగా ఏర్పడి దొంగల కోసం గాలింపు చర్యలు చేస్తున్నారు. ఉదయం పదకొండు నుంచి ఒంటి గంటల మధ్య సమయంలో దొంగతనం జరిగి ఉంటుందని పోలీసులు గుర్తించారు.

Updated Date - Jul 23 , 2026 | 11:18 PM