Share News

టీచర్లకు భారీ ఊరట

ABN , Publish Date - Oct 31 , 2026 | 01:59 AM

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నిబంధనలతో తీవ్ర ఒత్తిడికి గురైన ఉపాధ్యాయులకు ఎట్టకేలకు ఊరట లభించింది. ఇన్‌సర్వీసు టీచర్ల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహించిన స్పెషల్‌ టెట్‌ వారిలో ఆనందోత్సాహాలను నింపింది.

టీచర్లకు భారీ ఊరట

స్పెషల్‌ టెట్‌లో ఉత్తీర్ణత

గరిష్ఠ మార్కులతో ఆనందోత్సాహాలు

ఒంగోలు విద్య, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి) : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నిబంధనలతో తీవ్ర ఒత్తిడికి గురైన ఉపాధ్యాయులకు ఎట్టకేలకు ఊరట లభించింది. ఇన్‌సర్వీసు టీచర్ల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహించిన స్పెషల్‌ టెట్‌ వారిలో ఆనందోత్సాహాలను నింపింది. స్పెషల్‌ టెట్‌లో టీచర్లు గరిష్ఠ మార్కులు సాధించడంతోపాటు సుమారు 90శాతం మందికిపైగా అర్హత పొందారు. బుధవారం విడుదలైన స్పెషల్‌ టెట్‌ రెస్పాన్స్‌ షీట్లను పరిశీలించిన టీచర్లు తాము సాధించిన మార్కులకు మురిసిపోయారు. కాగా టెట్‌ ఉత్తీర్ణతపై సుప్రీంకోర్టు ఆదేశాలు.. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల తీరుతో టీచర్లు ఇటీవలి వరకు ఆందోళనకు గురయ్యారు. నిర్ణీత గడువులోపు టెట్‌ అర్హత సాధించకపోతే ఉద్యోగం ఊడుతుందని, భవిష్యత్‌లో ఉద్యోగోన్నతులు రావన్న భయంతో బెంబేలెత్తిపోయారు. దీంతో ఉపాధ్యాయ సంఘాలు మళ్లీ న్యాయస్థానాలను ఆశ్రయించినా ఫలితం లేకుండాపోయింది. ప్రభుత్వాలకు వినతిపత్రాలు ఇచ్చినా స్పందన కరువైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం ఉపాధ్యాయులకు భరోసా ఇచ్చింది. టెట్‌పై ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అన్నీ తాము చూసుకుంటామంటూ నమ్మబలికింది. ప్రభుత్వ హామీ మేరకు ఎస్సీఈఆర్టీ ఇన్‌సర్వీసు టీచర్లకు స్పెషల్‌ టెట్‌ నోటిఫికేషన్‌ను జారీచేసింది. పరీక్షకు సిద్ధమయ్యేందుకు పలు నమూనా ప్రశ్నపత్రాలను కూడా విడుదల చేశారు. ఈనెల 11 నుంచి 15 వరకు కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష నిర్వహించారు. వాటి ఫలితాలను బుధవారం రాత్రి విడుదల చేయగా గురువారం తమ వ్యక్తిగత లాగిన్లలో రెస్పాన్స్‌ షీట్లను పరిశీలించిన టీచర్ల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. పరీక్షకు హాజరైన వారందరూ దాదాపుగా పాసయ్యారు. మార్కులు కూడా తమ అంచనాలకు మించి రావడంతో ఎగిరి గంతులు వేశారు.

Updated Date - Oct 31 , 2026 | 01:59 AM