ఎరువుల విక్రయాల్లో మాయాజాలం
ABN , Publish Date - Jan 07 , 2026 | 02:45 AM
రువుల విక్రయాల్లో మాయాజాలం జరుగుతోంది. కంపెనీలు, హోల్‌సేల్ డీలర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రైతులను దోపిడీ చేస్తున్నారు. కంపెనీలు డిమాండ్ ఉన్న ఎరువులతోపాటు అవసరంలేని మందులను అంటకడుతున్నాయి.
రైతులను దోచుకుంటున్న కంపెనీలు, హోల్‌సేల్ వ్యాపారులు
ఎక్కువ ధరకు విక్రయాలు
తక్కువకు బిల్లులు
చోద్యంచూస్తున్న అధికారులు
దర్శి, జనవరి 6 (ఆంధ్రజ్యోతి) : ఎరువుల విక్రయాల్లో మాయాజాలం జరుగుతోంది. కంపెనీలు, హోల్‌సేల్ డీలర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రైతులను దోపిడీ చేస్తున్నారు. కంపెనీలు డిమాండ్ ఉన్న ఎరువులతోపాటు అవసరంలేని మందులను అంటకడుతున్నాయి. హోల్‌సేల్ డీలర్లు ఎక్కువ ధరకు ఎరువులు విక్రయించి తక్కువకు బిల్లులు ఇస్తున్నారు. ఎరువులు అవసరమైన రిటైల్ డీలర్లు వారు చెప్పిన ధరలకే కొనుగోలు చేస్తున్నారు. ఆ ప్రభావం రైతులపై పడి పెనుభారంగా మారుతోంది. ఎరువులు, పురుగు మందులు, విత్తనాల విక్రయాలో అక్రమాలు జరగకుండా ప్రజాప్రభుత్వం ఎన్నో రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ అడ్డగోలు వ్యవహారం యథాతధంగా నడుస్తోంది. అక్రమాలను అరికట్టాల్సిన అధికారులు చోద్యంచూస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఈతంతు కొనసాగుతోంది. ప్రధానంగా యూరియాకు అధిక డిమాండ్ నిరంతరం ఉంటుంది. యూరియాను ఎమార్పీ ప్రకారం రైతులకు రూ.267కు విక్రయించాల్సి ఉంది. ప్రస్తుతం రూ.400కు అమ్ముతున్నారు. మూడు దశల్లో జరుగుతున్న దందాతో రైతులు నష్టపోతున్నారు. ఎరువుల కంపెనీలు డిమాండ్ ఉన్న యూరియా అడిగిన హోల్‌సేల్ వ్యాపారులకు ఇతర మందులు కలిపి అంటకడుతున్నారు. అలాగైతేనే యూరియా ఇస్తామని షరతు పెట్టడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకుంటున్నారు. హోల్‌సేల్ డీలర్లు యూరియాతోపాటు అవసరం లేని మందులు కొనాల్సిందేనని రిటైల్ డీలర్లకు స్పష్టం చేస్తున్నారు. అందుకు అంగీకరించని వారికి యూరియా బస్తా రూ.350కు విక్రయిస్తున్నారు. బిల్లులు మాత్రం రూ.255కు కొనుగోలు చేసినట్టు ఇస్తున్నారు. రిటైల్ వ్యాపారులు రవాణా చార్జీలు, లాభం కలుపుకొని రూ.390 నుంచి రూ.400 వరకు యూరియా బస్తాను రైతులకు విక్రయిస్తున్నారు. మిగిలిన కాంప్లెక్స్ ఎరువుల విక్రయాల్లో పెద్ద తేడా కనిపించడం లేదు. యూరియా అమ్మకాల్లోనే దోపిడీ జరుగుతోంది.
తీవ్రంగా నష్టపోతున్న రైతులు
యూరియా అధిక ధరలకు విక్రయిస్తున్న హోల్‌సేల్ వ్యాపారులను, అవసరం లేని మందులను అంటకడుతున్న కంపెనీలను కట్టడి చేయాల్సిన అధికారులు కిక్కురుమనడం లేదు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పైర్ల సాగుకు పెట్టుబడులు పెరిగి ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం ఆదేశించినప్పుడు విజిలెన్స్ అధికారులు, స్క్వాడ్ అధికారులు మొక్కుబడిగా తనిఖీలు చేస్తూ అక్కడక్కడా నామమాత్రపు కేసులు పెట్టి చేతులు దులుపుకుంటున్నారు. ఆతర్వాత షరామామూలుగానే ఎరువులు విక్రయాలు కొనసాగుతున్నాయి. ఈవిషయంపై దర్శి ఏడీఏ బాలాజీనాయక్‌ను వివరణ కోరగా.. ఎరువులు అధిక ధరలకు విక్రయించినట్లు ఎవరైనా పిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.