యంత్రం.. అవసరం
ABN , Publish Date - Jun 07 , 2026 | 02:47 AM
రైతులకు రాయితీపై ప్రభుత్వం అందించే వ్యవసాయ యంత్ర పరికరాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. జిల్లాకు కేటాయించిన యూనిట్ల కన్నా నాలుగైదు రెట్లు అధికంగా రైతులు వాటి కోసం దరఖాస్తు చేసుకున్నారు.
రాయితీ పరికరాలకు భారీ డిమాండ్
1,239 యూనిట్లకు 4,525 మంది దరఖాస్తు
రూ.4.18 కోట్ల సబ్సిడీ కేటాయింపు
రూ.61.60 కోట్లు అవసరంగా అంచనా
ఎక్కువగా ట్రాక్టర్ల కోసమే ముందుకు..
ఎన్‌జీపాడు, దర్శి నుంచి అత్యధికం
ఒంగోలు రూరల్, అర్బన్ నుంచి తక్కువ
రైతులకు రాయితీపై ప్రభుత్వం అందించే వ్యవసాయ యంత్ర పరికరాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. జిల్లాకు కేటాయించిన యూనిట్ల కన్నా నాలుగైదు రెట్లు అధికంగా రైతులు వాటి కోసం దరఖాస్తు చేసుకున్నారు. వాటన్నింటినీ వ్యవసాయాధికా రులు పరిశీలించారు. అందరికీ ఇవ్వాలంటే జిల్లాకు ప్రభుత్వం కేటాయించిన సబ్సిడీ మొత్తం కన్నా నాలుగు రెట్లు నిధులు అవసరమవుతాయని గుర్తిం చారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు లబ్ధిదారుల ఎంపికకు కసరత్తు చేస్తున్నారు.
ఒంగోలు, జూన్ 6 (ఆంధ్రజ్యోతి) : వ్యవసాయ యంత్ర పరికరాల కోసం రైతులు భారీగా స్పందించారు. కేటాయించిన వాటికి నాలుగు రెట్లు అధికంగా దరఖాస్తు చేసుకున్నారు. దీంతో లబ్ధిదారుల ఎంపికపై వ్యవసాయ శాఖ అధికారులు తలమునకలై ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వ కాలంలో రాయితీ యంత్ర పరికరాల ఊసే లేదు. ప్రజా ప్రభుత్వం అధికా రంలోకి వచ్చాక గత ఏడాది ఈ పథకాన్ని పునరుద్ధరించింది. అందుకు సంబంధించి విధివిధానాలను రూపొందించి జిల్లాల వారీ కేటాయింపులు చేపట్టేసరికి ఆలస్యమైంది. దీంతో వాటిని ప్రస్తుత ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి రెండు నెలలుగా కసరత్తు సాగుతోంది. గతం కన్నా పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ సాగేలా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు, లాటరీ ద్వారా ఎంపికకు ప్రభుత్వం నిర్ణయించింది. ఎంపికలో లోటుపాట్ల నివారణకు లాటరీని జాయింట్ కలెక్టర్ల నేతృత్వంలో నిర్వహించనుండగా మొత్తం ప్రక్రియ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పర్యవేక్షణలో సాగేలా నిర్దేశించారు.
మండలాల వారీగా యూనిట్ల విభజన
ఈ విడత సబ్సిడీపై ట్రాక్టర్లు, వాటికి అనుబంధంగా ఉండే పవర్ టిల్లర్లు, పంటల సంరక్షణ యంత్రాలు, పంట కోతలు, నూర్పిడి చేసే యంత్రాలు వంటివి ఉన్నాయి. కొన్నింటిపై 40 నుంచి 50శాతం సబ్సిడీ కూడా ఉంది. అలా జిల్లాకు మొత్తం రూ.4.18కోట్ల సబ్సిడీతో 1,239 యూనిట్లను మంజూరు చేశారు. ఇందులో జనరల్ కేటగిరీ రైతులకు 997, ఎస్సీ రైతులకు 183, ఎస్టీలకు 59 కేటాయించారు. మొత్తం యూనిట్లను మండలాల వారీగా విభజించారు. ఆయా మండలాల్లో సాగయ్యే పంటలు, సాగు విస్తీర్ణం, వాటికి ప్రస్తుతం ఇచ్చే యంత్ర పరికరాల వాడకం ఆధారంగా కేటాయించి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. గతనెల 26తో దరఖాస్తు గడువు ముగిసింది. జిల్లాలో 1,239 యూనిట్లకు ఏకంగా 4,525 దరఖాస్తులు అందాయి.
కొన్ని మండలాల్లో అధికంగా..
అత్యధికంగా దర్శి, నాగులుప్పలపాడు, అద్దంకి, మర్రిపూడి, బల్లికురవ, దొనకొండ, జె.పంగులూరు, సంతమాగులూరు, టంగుటూరు, జరుగుమల్లి మండలాల నుంచి దరఖాస్తులు వచ్చాయి. ఈ మండలాల్లో 200 కన్నా అధికంగా దరఖాస్తులు అందాయి. నాగులుప్పలపాడు మండలానికి రూ.29.98 లక్షలతో 68 యూనిట్లు కేటాయిస్తే సుమారు రూ.4.80 కోట్ల సబ్సిడీ అవసరమమ్యేలా ఏకంగా 339 దరఖాస్తులు వచ్చాయి. దర్శి మండలానికి రూ.28.44 లక్షలు సబ్సిడీతో 76 యూనిట్లు కేటాయిస్తే రూ.5.07 కోట్ల సబ్సిడీ అవసరమమ్యేలా 327 దరఖాస్తులు అందాయి. అద్దంకి మండలానికి రూ.21.66 లక్షలు సబ్సిడీ తో 55 యూనిట్లు కేటాయించగా దాదాపు రూ.4.43 కోట్ల సబ్సిడీ అవసరమయ్యేలా 270 దరఖాస్తులు వచ్చాయి. సంతమాగులూరు మండలానికి రూ. 10.84 లక్షలు సబ్సిడీతో 39 యూనిట్లు కేటాయిస్తే సుమారు రూ.3.85 కోట్ల సబ్సిడీ అవసరం అయ్యేలా 235 దరఖాస్తులు అందాయి. ఇలాంటి పరిస్థితి పలు మండలాల్లో ఉంది.
మార్గదర్శకాల ప్రకారమే కేటాయింపు
ఒంగోలు రూరల్ మండలంలో కేటాయింపు కన్నా తక్కువగా దరఖాస్తులు వచ్చాయి. ఇక్కడ రూ.16.08 లక్షల సబ్సిడీతో 41 యూనిట్లు కేటాయించగా 34 దరఖాస్తులే అందాయి. ఒంగోలు అర్బన్ మండల పరిధిలోని గ్రామాలకు 29 యూనిట్లు కేటాయించగా 28 దరఖాస్తులు వచ్చాయి. సింగరాయకొండ మండలంలో 28 యూనిట్లకు 34, ఉలవపాడులో 45 యూనిట్లకు 56, కొత్తపట్నం మండలంలో 38 యూనిట్లకు 64 దరఖాస్తులు వచ్చాయి. అధికారులు ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తుల పరిశీలన పూర్తిచేశారు. ఎక్కువ మంది ట్రాక్టర్ల కోసం దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. జిల్లాకు 30 ట్రాక్టర్లను మంజూరు చేయగా అంతకు ఐదారు రెట్లు అధికంగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. పంట కోత, నూర్పిడి యంత్రాలకు కూడా రైతుల నుంచి డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా లబ్ధిదారుల ఎంపికకు వ్యవసాయ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.