Share News

ఎల్‌టీపీల ఇష్టారాజ్యం

ABN , Publish Date - May 08 , 2026 | 02:50 AM

అద్దంకి మునిసిపాలిటీలో ప్లాన్‌ అప్రూవల్‌ తీసుకోవాలంటే లైసెన్స్‌డ్‌ టెక్నికల్‌ పర్సన్‌ (ఎల్‌టీపీ)లను ప్రసన్నం చేసుకోవాల్సి వస్తోంది. వారి చెప్పిందే వేదంగా మారింది.

ఎల్‌టీపీల ఇష్టారాజ్యం
అద్దంకిలోని మునిసిపల్‌ కార్యాలయం

ఇంటి ప్లాన్‌ అప్రూవల్‌లో దళారులుగా మారి వసూళ్లు

మునిసిపల్‌ అధికారులు వారికి దాసోహం

అద్దంకి, మే 7 (ఆంధ్రజ్యోతి): అద్దంకి మునిసిపాలిటీలో ప్లాన్‌ అప్రూవల్‌ తీసుకోవాలంటే లైసెన్స్‌డ్‌ టెక్నికల్‌ పర్సన్‌ (ఎల్‌టీపీ)లను ప్రసన్నం చేసుకోవాల్సి వస్తోంది. వారి చెప్పిందే వేదంగా మారింది. అడిగినంత ముట్టజెప్పకపోతే ఇంటి ప్లాన్‌ అప్రూవల్‌కు కొర్రీ పెడుతున్నారు. దీంతో అద్దంకి పట్టణంలో ఇల్లు కట్టుకునే వ్యక్తులు బెంబేలెత్తిపోతున్నారు. అన్ని పత్రాలు సరిగ్గా ఉన్నప్పటికీ ఎల్‌టీపీలు మాత్రం చిన్న పాటి లోపాలను బూతద్ధంలో చూపుతూ నోటికి వచ్చినంత అడుగుతున్నారు. అదేమని ప్రశ్నిస్తే ఎదురుదాడికి దిగేంత పనిచేస్తున్నారు. చెప్పిన మొత్తం ఇస్తే సరి, లేదంటే మీ ఇష్టం అంటూ బెదిరింపు ధోరణితో మాట్లాడుతున్నారు. అద్దంకి పట్టణంలో నలుగురు ఎల్‌టీపీలు ఉన్నారు. వీరిలో ఇద్దరి వసూల్‌ రాజాలుగా మారారన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వానికి చెల్లించేంత ఫీజుతో సమానంగా ఎల్‌టీపీలు అదనంగా వసూలు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. సెంటులోపు స్థలంలో ఇంటి నిర్మాణం చేసుకుంటే ప్రభుత్వానికి ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎల్‌టీపీ ద్వారా దరఖాస్తు చేసుకుంటే అప్రూవల్‌ వస్తుంది. అలాంటి నిరుపేదల వద్ద కూడా రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ముక్కుపిండి వసూలు చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. మునిసిపల్‌ అధికారుల పేరు చెప్పి వసూలు చేసే మొత్తంలో సగభాగం ఎల్‌టీపీలే నొక్కేసి ‘అంతా అధికా రులకే సరిపోయింది... మాకేమిటి’ అని మరలా వసూలు చేస్తున్నారు. వీరిపై తరచూ మున్సిపల్‌ అధికారులకు ఫిర్యాదులు అందినా చర్యలు లేకపోవడంతో మరింత రెచ్చిపోయి వ్యవహరిస్తున్నారు. ఎల్‌టీపీల ఆగడాలు పెరగఢంతో భవన నిర్మాణదారులు బెంబేలెత్తిపోతున్నారు. టౌన్‌ప్లానింగ్‌ అధికారులు సైతం ఎల్‌టీపీలు చెప్పినట్టే వ్యవహరిస్తుండటం పట్ల పలువురు విమర్శస్తున్నారు. రెండతస్థుల భవనం నిర్మించాలంటే ప్రభుత్వానికి చెల్లించే ఫీజులు కాకుండా అదనంగా రూ.50 వేల వరకు ఏదొక రూపేణా వసూలు చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఎల్‌ టీపీల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - May 08 , 2026 | 02:50 AM