దీర్ఘకాలిక భూసమస్యలను పరిష్కరించాలి
ABN , Publish Date - Sep 16 , 2026 | 12:37 AM
సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలతోపాటు గయాల్, గర్భ కండ్రిగ, అసైన్డ్ భూముల పరిష్కారానికి రెవెన్యూ అధికారులు కృషి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి ఆదేశించారు.
మంత్రి స్వామి
ఆర్డీవో, తహసీల్దార్లతో సమీక్ష
తూర్పునాయుడుపాలెం(కొండపి), సెప్టెంబరు15 (ఆంధ్రజ్యోతి): సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలతోపాటు గయాల్, గర్భ కండ్రిగ, అసైన్డ్ భూముల పరిష్కారానికి రెవెన్యూ అధికారులు కృషి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి ఆదేశించారు. మంగళవారం టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో ఒంగోలు ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు, కొండపి తహసీల్దార్ ఎస్.శ్రీనివాసరావు, టంగుటూరు తహసీల్దార్ ఆంజనేయులుతో సమీక్ష నిర్వహించారు. కొండపి నియోజకవర్గంలో గయాల్ భూములు ఆన్‌లైన్‌లో నమోదు కాక వేలాది మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వీటికి సంబంధించి జిల్లా స్థాయిలో పరిష్కారమయ్యే వాటిని ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లా స్థాయిలో పరిష్కారం కాని వాటిపై సమగ్ర నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని సూచించారు. భూసమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని మంత్రి కోరారు. అర్హులైన పేదలకు భూహక్కులు కల్పించాలన్నారు. రెవెన్యూ వివాదాలను త్వరితగతిన పరిష్కరించాలని ఆయన పేర్కొన్నారు.