Share News

టీచర్ల సర్దుబాటులో ప్రతిష్టంభన

ABN , Publish Date - Jun 30 , 2026 | 02:57 AM

ఉమ్మడి జిల్లాలో చేపట్టిన ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియలో ప్రతిష్టంభన నెల కొంది. మొదటిదశ దాటి అడుగు ముందుకు పడలేదు. అందుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ తమీమ్‌ అన్సారియా జారీ చేసిన షెడ్యూల్‌ సోమవారంతో ముగిసింది.

టీచర్ల సర్దుబాటులో ప్రతిష్టంభన

ముగిసిన షెడ్యూల్‌

వెలువడని మిగులు టీచర్ల జాబితాలు

రోజురోజుకూ కొత్త నిబంధనలతో గందరగోళం

ఒంగోలు విద్య, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి జిల్లాలో చేపట్టిన ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియలో ప్రతిష్టంభన నెల కొంది. మొదటిదశ దాటి అడుగు ముందుకు పడలేదు. అందుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ తమీమ్‌ అన్సారియా జారీ చేసిన షెడ్యూల్‌ సోమవారంతో ముగిసింది. ఆ ప్రకారం టీచర్లకు డివిజన్‌, జిల్లాస్థాయిల్లో కౌన్సెలింగ్‌ నిర్వహించి స్థానాల కేటాయింపు సోమవారానికి పూర్తి చేయాల్సి ఉంది. మంగళవారం మండల, డివిజన్‌, జిల్లాస్థాయి లో సర్దుబాటుకు గురైన టీచర్లకు డీఈవో లీప్‌ యాప్‌ ద్వారా ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. అయితే అసలు మిగులు టీచర్ల జాబితాలు పాఠశాల విద్య డైరెక్టర్‌ కార్యాలయ ఐటీ విభాగం నుంచి మండ లాలకు రాలేదు. దానికితోడు రోజురోజుకూ విడుదలవుతున్న నిబంధనలు గందరగోళం సృష్టిస్తున్నాయి. స్కూళ్లలో ఈనెల 20నాటికి ఉన్న విద్యార్థుల సంఖ్య ప్రామాణికంగా తీసుకొని పాఠశాల విద్యాశాఖ చేపట్టిన టీచర్ల పని సర్దుబాటు ప్రక్రియ ‘ఎక్కడవేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా ఉంది. పాఠశాలలు జూన్‌ 12న పునఃప్రారంభమైన నాటి నుంచి విద్యార్థుల అడ్మిషన్లు సాగుతున్నాయి. ఆతర్వాత వారానికే విద్యార్థుల సంఖ్య ఆధారంగా పనిసర్దుబాటు చేపట్టడం విమర్శలకు దారితీసింది. కనీసం జూన్‌ 30 లేదా జూలై 15నాటి విద్యార్థుల సంఖ్య ఆధారంగా సర్దుబాటు చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. గత వారం రోజుల్లో ఇప్పటికే సర్దుబాటు నిబంధనలను పలుమార్లు మారుస్తూ కొత్తవి జారీచేయడం కూడా ప్రక్రియ జాప్యం కావడానికి కారణమైంది.

అవసరం మేరకు సర్దుబాటు

టీచర్ల పనిసర్దుబాటుకు సంబంధించి ఎఫ్‌ఎక్యు పేరుతో తాజా నిబంధనలతో విద్యాశాఖ అదనపు డైరెక్టర్‌ సుబ్బారెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. 2025లో జరిగిన ఉపాధ్యాయుల బదిలీల్లో ఇతర పాఠశాలలను కోరుకుని రిలీవర్‌ రాని కారణంగా అప్పటి నుంచి అదే పాఠశాలలో పనిచేస్తున్న టీచర్ల పోస్టులను పనిసర్దుబాటుకు ఖాళీలుగా చూపించమన్నారు. ఉమ్మడి జిల్లాలో మిగులుగా తేలిన సబ్జెక్టు టీచర్ల పీజీ విద్యార్హతలు ఉన్న వారిని సబ్జెక్టు వారీగా సీనియారిటీ జాబితాలు రూపొందించి హైస్కూలు ప్లస్‌లలోని ఖాళీలకు సర్దుబాటు చేయాలన్నారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్వ జిల్లా యూనిట్‌గానే చేపట్టాలి. మిగులు టీచర్లను ఆయా పాఠశాలలకు మంజూరైన పోస్టుల ప్రాతిపదికన కాకుండా ఉపాధ్యాయుల అవసరం మేరకు సర్దుబాటు చేయాలి. స్కూలు అసిస్టెంట్లు ఎంఈవోలుగా, ఇన్‌చార్జి హెచ్‌ఎంలుగా పూర్తి అనపు బాధ్యతలు నిర్వహిస్తున్న పాఠశాలలకు అదే సబ్జెక్టులో మిగులు టీచర్లను కేటాయించాలి. క్లస్టర్‌ హైస్కూళ్లలో విద్యార్థుల సంఖ్య 75కు తక్కువ ఉన్నా అక్కడి హెచ్‌ఎంను మిగులుగా చూపించరాదన్నారు. ఎఫ్‌ఏసీ హెచ్‌ఎంలుగా పనిచేస్తున్న వారి స్థానంలో కూడా అదనపు టీచర్‌ను నియమించాలని ఉత్తర్వులు జారీచేశారు.

Updated Date - Jun 30 , 2026 | 02:57 AM