వ్యవసాయ, అనుబంధ రంగాలకు రుణాలివ్వాలి
ABN , Publish Date - Jan 08 , 2026 | 10:59 PM
రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ, దాని అనుబంధ రంగాలను ప్రోత్సహించే విధంగా రుణాలను మంజూరు చేయాలని కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు.
కలెక్టర్ రాజాబాబు ఆదేశం
ఒంగోలు కలెక్టరేట్, జనవరి 8 (ఆంధ్రజ్యోతి) : రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ, దాని అనుబంధ రంగాలను ప్రోత్సహించే విధంగా రుణాలను మంజూరు చేయాలని కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లోని కలెక్టర్ చాంబర్‌లో గురువారం పీడీసీసీ బ్యాంకు అధికారులతో జిల్లా స్థాయి సాంకేతిక కమిటి(డీఎల్‌టీసీ) సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించి మాట్లాడారు. 2026 ఖరీఫ్ సీజన్, 2026-27 రబీ సీజన్‌కు జిల్లా సహకార బ్యాంకువంటి సహకార బ్యాంకుల ద్వారా వ్యవసాయ, అనుబంధ రంగాలకు ఎంత రుణం ఇవ్వాలనే విషయంపై దిశానిర్దేశం చేశారు. రైతుల సంక్షేమానికి దృష్టిలో పెట్టుకొని వారిని ప్రోత్సహించేలా ముందుకు పోవాలన్నారు. జిల్లాలో ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని పెంచడంతోపాటు సూక్ష్మ సాగు చేసే రైతులకు రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ సూచించారు. రైతులకు సరైన సమయంలో రుణాలు ఇవ్వాలన్నారు. అందుకు సంబంధించి ప్రణాళికాబద్దంగా ముందుకు సాగాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో పీడీసీసీ బ్యాంకు సీఈవో పీడీవీ శర్మ, వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, గోపీచంద్, సుజయ్, సుభాషిణి పాల్గొన్నారు.