Share News

ప్రాధాన్యత రంగాలకు విరివిగా రుణాలు అందించాలి

ABN , Publish Date - Jun 23 , 2026 | 11:07 PM

ప్రాధాన్యత రంగాలకు లక్ష్యం మేరకు రుణాలు అందించాలని కలెక్టర్‌ రాజాబాబు ఆదేశించారు. కౌలు రైతులకు పంట రుణాలు అందించేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

 ప్రాధాన్యత రంగాలకు విరివిగా రుణాలు అందించాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ రాజాబాబు

బ్యాంకర్ల సమావేశంలో కలెక్టర్‌

ఒంగోలు కలెక్టరేట్‌, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి) : ప్రాధాన్యత రంగాలకు లక్ష్యం మేరకు రుణాలు అందించాలని కలెక్టర్‌ రాజాబాబు ఆదేశించారు. కౌలు రైతులకు పంట రుణాలు అందించేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. స్థానిక కలెక్టరేట్‌లోని కలెక్టర్‌ సమావేశపు హాలులో మంగళవారం జరిగిన బ్యాంకర్ల సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. ఎంఎ్‌సఎంఈలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటు చేసేలా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలన్నారు. పీఎం సూర్యఘర్‌ పథక రుణాలను వేగవంతం చేయడంతో పాటు డ్వాక్రా సంఘాలకు, యువతకు స్వయం ఉపాధి రుణాల మంజూరుపై ప్రత్యేకదృష్టి సారించాలని ఆదేశించారు. ప్రాధాన్యతరంగాలకు నిర్దేశించిన లక్ష్యాల మేరకు బ్యాంకర్లు రుణాలు మంజూరు చేయాలన్నారు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త ఎదగాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారని, అందుకు అనుగుణంగా యూనిట్ల ఏర్పాటుకు బ్యాంకర్లు, అధికారులు సమన్వయంతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ఒంగోలులో నిర్వహించిన బిజినెస్‌ ఎలైట్‌మీట్‌లో పాల్గొన్న పారిశ్రామికవేత్తలకు జిల్లాలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సమగ్రంగా వివరించామన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.16,381 కోట్లు లక్ష్యంకాగా రూ.18,499 కోట్ల రుణాలు అందజేయడం పట్ల కలెక్టర్‌ అభినందించారు. జిల్లాలోని 9,809 స్వయం సహాయక గ్రూపులకు రూ.1,261.97 కోట్లకు రూ.1,461 కోట్లు రుణాలు మంజూరు చేసినట్లు వివరించారు. ఈ సందర్భంగా రూడ్‌సెట్‌ ద్వారా అమలు జరుగుతున్న శిక్షణా కార్యక్రమాల బ్రోచర్‌ను కలెక్టర్‌ ఆవిష్కరించారు. సమావేశంలో లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ రమేష్‌, నాబార్డు అధికారి రవికుమార్‌, ఆర్‌బీఐ ఏజీఎం కిషన్‌కుమార్‌, వివిధశాఖల అధికారులు నారాయణ, విజయలక్ష్మీ, శ్రీనివాసులు, వెంకటేశ్వరరావు, డాక్టర్‌ సుజయ్‌, శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jun 23 , 2026 | 11:07 PM