ఉత్తమ టీచర్ అవార్డులకు స్పందన అంతంతే!
ABN , Publish Date - Sep 03 , 2026 | 02:51 AM
గురుపూజోత్సవం సందర్భంగా ఈనెల 5న ఉపాధ్యాయులకు అందజేసే ఉత్తమ అవార్డులకు పాఠశాలల హెచ్‌ఎంలు, టీచర్ల నుంచి స్పందన అంతంతమాత్రంగానే ఉంది. గతంలో ఈ అవార్డుల కోసం భారీగా దరఖాస్తులు చేసేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకుండాపోయింది.
దరఖాస్తుకు ముందుకురాని ప్రధానోపాధ్యాయులు
ఎస్‌జీటీల నుంచీ పెద్దగా కనిపించని ఆసక్తి
ఒంగోలు విద్య, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి) : గురుపూజోత్సవం సందర్భంగా ఈనెల 5న ఉపాధ్యాయులకు అందజేసే ఉత్తమ అవార్డులకు పాఠశాలల హెచ్‌ఎంలు, టీచర్ల నుంచి స్పందన అంతంతమాత్రంగానే ఉంది. గతంలో ఈ అవార్డుల కోసం భారీగా దరఖాస్తులు చేసేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకుండాపోయింది. ప్రధానోపాధ్యాయుల విభాగంలో అయితే దరఖాస్తు చేసేందుకు హెచ్‌ఎంలు ఆసక్తిచూపలేదు. జిల్లాలో అధిక సంఖ్యలో ఉండే సెకండరీ గ్రేడ్ టీచర్ల కూడా ఆశించిన స్థాయిలో అవార్డులకు దరఖాస్తులు చేయలేదు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏటా ప్రతిభావంతులైన టీచర్లను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ అవార్డులను అందజేస్తోంది. ఆ క్రమంలోనే ఈ ఏడాది కూడా జిల్లాకు 60 ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ప్రకటించింది. వాటికోసం దరఖాస్తు చేసుకునేందుకు డీఈవో రేణుక ఒకటి రెండుసార్లు ప్రకటనలు విడుదల చేశారు. అయితే కేవలం 53 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. హెచ్‌ఎంల విభాగంలో 10 అవార్డులు ప్రకటించగా ఐదుగురు దరఖాస్తు చేసుకున్నారు. సెకండరీ గ్రేడ్ విభాగంలో గరిష్ఠంగా 30 అవార్డులు ప్రకటించగా కేవలం 28 దరఖాస్తులు వచ్చాయి. రెండు అవార్డులు మిగిలిపోయాయి. స్కూలు అసిస్టెంట్ విభాగంలో 20 అవార్డులకు 32 దరఖాస్తులు రావడం కొంత ఊరట కలిగించే అంశం.