సమస్యలను వింటూ.. ప్రగతిని వివరిస్తూ..
ABN , Publish Date - Aug 09 , 2026 | 02:50 AM
తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఇంటింటికీ కార్యక్రమం ఇటు ప్రకాశం, అటు మార్కాపురం జిల్లాల్లో ముమ్మరంగా సాగుతోంది. రెండు రోజుల క్రితం వరకు కాస్తంత వెనుకబడి ఉన్న ప్రాంతాల్లో సైతం ఊపందుకుంది. ఇప్పటికే రెండు జిల్లాల్లో ఇంచుమించు సగం లక్ష్యం పూర్తిచేసినట్లు పార్టీవర్గాల సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
ముమ్మరంగా ఇంటిం్గటికీ టీడీపీ
వెనుకబడిన చోట్ల ఊపందుకున్న కార్యక్రమం
కనిగిరి టాప్, ఆ తర్వాత ఒంగోలు, మార్కాపురం నియోజకవర్గాలు
ఒంగోలు, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి) : తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఇంటింటికీ కార్యక్రమం ఇటు ప్రకాశం, అటు మార్కాపురం జిల్లాల్లో ముమ్మరంగా సాగుతోంది. రెండు రోజుల క్రితం వరకు కాస్తంత వెనుకబడి ఉన్న ప్రాంతాల్లో సైతం ఊపందుకుంది. ఇప్పటికే రెండు జిల్లాల్లో ఇంచుమించు సగం లక్ష్యం పూర్తిచేసినట్లు పార్టీవర్గాల సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. కనిగిరి నియోజకవర్గం అగ్రస్థానం లోనే కొనసాగుతోంది. ఆ తర్వాత స్థానాల్లో ఒంగోలు, మార్కాపురం ఉన్నాయి. నియోజకవర్గ స్థాయిలోని కీలక నేతలు, ఇతర ముఖ్యులు ఉన్నా, లేకున్నా.. స్థానిక పార్టీశ్రేణులు ఎక్కడిక క్కడ కదలడంతో కార్యక్రమం జోరుగా సాగు తోంది. రెండేళ్లలో ప్రభుత్వ విజయాలు, సంక్షేమ, అభివృద్ధిపై రూపొందించిన కరపత్రాలను పంపిణీ చేస్తూ, అక్కడక్కడా ప్రజల వ్యక్తిగత సమస్యలను ఆలకిస్తున్నారు. అయితే మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ కీలక నేతలు పాల్గొంటున్న చోట మాత్రం మరింత ఉపయుక్తంగా కార్యక్రమం సాగుతోంది. ఇళ్ల వద్దకు ఎమ్మెల్యే స్థాయి ప్రజాప్రతినిధి వెళ్లి నేరుగా ప్రజలను పలుకరించి యోగక్షేమాలు అడగడంతోపాటు వారి వ్యక్తిగత, ఆ ప్రాంత ప్రజల ఉమ్మడి సమస్యలు వింటున్నారు. వాటిపై తక్షణం స్పందించి తమ వెంట ఉన్న అధికారులకు పలు సూచనలు చేస్తున్నారు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలపై ముద్రించిన కరపత్రాలు అందజేతతోపాటు స్థానికంగా చేసిన అభివృద్ధి పనులను వివరిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్లు, వీధుల్లో ఎక్కువ ఇళ్లు ఉన్నచోట స్థానికులు ప్రత్యేకించి మహిళలు వచ్చి తమప్రాంత సమస్యలు చెప్తున్నారు. వారికి సంతృప్తికరమైన సమాధానాలను నేతలు ఇస్తున్నారు. ఇలా ఇంటింటి కార్యక్రమం ఉపయుక్తంగా సాగుతున్న తీరు శనివారం ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పాల్గొన్న కార్యక్రమంలో స్పష్టంగా కనిపించింది. నగరంలోని 38వ డివిజన్‌లో పలు వీధులల్లో జనార్దన్ స్థానిక నాయకులు, మునిసిపల్ అధికారులతో కలిసి విస్తృతంగా పర్యటించారు. ఆ సందర్భంగా ఎక్కడికక్కడ స్థానికులు ప్రత్యేకించి మహిళలు ముందుకు రావడంతోపాటు తమ ప్రాంతంలో తాగునీరు, డ్రైనేజీ, ఇతర సమస్యలు ఏకరువు పెట్టి వాటి పరిష్కారానికి హామీలు పొందారు. సాయంత్రం స్థానిక ఇస్లాంపేటలోనూ ఇదేవిధంగా కార్యక్రమం సాగింది. ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యే బీఎన్.విజయకుమార్ కార్పొరేషన్ పరిధిలోని పేర్నమిట్టలోని పలు పేటల్లో ఈ కార్యక్రమంలో పాల్గొని అభివృద్ధి పనులు వివరించడంతోపాటు స్థానిక ప్రజానీకం చెప్పిన పలు సమస్యలపై స్పందించారు. కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు వీవీపాలెం మండలం అమ్మపాలెంలో ఇంటింటికి కార్యక్రమాన్ని నిర్వహించగా ఇతర నియోజకవర్గాల్లోనూ కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. ఆరు నియోజకవర్గాల్లో ఇప్పటివరకు 5,37,781 గృహాలు ఉండగా ఇప్పటి వరకు 2,64,148 ఇళ్లను పార్టీశ్రేణులు సందర్శించాయి. అత్యధికంగా కనిగిరి నియోజకవర్గంలో 87శాతం పూర్తికాగా ఒంగోలులో 59, మార్కాపురంలో 52శాతం, దర్శిలో 45శాతం, గిద్దలూరులో 41శాతం, వైపాలెంలో 32శాతం, కొండపిలో 27శాతం పూర్తయ్యాయి. అలాగే అద్దంకిలో 21శాతం పూర్తి కాగా ఎస్‌ఎన్‌పాడులో 15.94శాతం, కందుకూరులో 34.65శాతం గృహాలను సందర్శించినట్లు పార్టీవర్గాల సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.