శింగరకొండ తిరునాళ్లలో ఏరులైన మద్యం
ABN , Publish Date - Mar 04 , 2026 | 02:48 AM
శింగరకొండ తిరునాళ్లలో మద్యం ఏరులై పారింది. ఇష్టారాజ్యంగా అమ్మకాలు జరిగాయి. తిరునాళ్ల ముగిసిన తరువాత మంగళవారం ఆయా ప్రాంతాలలో పెద్దఎత్తున ఖాళీ మద్యం సీసాలు గుట్టలుగుట్టలుగా దర్శనమిచ్చాయి.
గుట్టలుగుట్టలుగా ఖాళీ సీసాలు
అద్దంకిలోని షాపులలో నాలుగింతలు పెరిగిన అమ్మకాలు
అద్దంకి, మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : శింగరకొండ తిరునాళ్లలో మద్యం ఏరులై పారింది. ఇష్టారాజ్యంగా అమ్మకాలు జరిగాయి. తిరునాళ్ల ముగిసిన తరువాత మంగళవారం ఆయా ప్రాంతాలలో పెద్దఎత్తున ఖాళీ మద్యం సీసాలు గుట్టలుగుట్టలుగా దర్శనమిచ్చాయి. దీనినిబట్టి మద్యం అమ్మకాలు ఏస్థాయిలో జరిగాయో అర్థమవుతుంది. తిరునాళ్లలో మద్యం అమ్మకాలు జరగని వ్వమని ఎక్సైజ్ అధికారులు కోఆర్డినేషన్ సమావేశంలో చెప్పిన మాటలు నీటి మూటలే అని తేటతెల్లమైంది. అద్దంకి పట్టణంలోని ఐదు మద్యం షాపులు, ఒక బార్, రూరల్ మండలంలో రెండు మద్యం దుకాణాలు ఉన్నాయి. మద్యం షాపుల నిర్వాహకులకు తిరునాళ్ల పండుగలా మారింది. రాత్రంగా అమ్మకాలు సాగాయి. రోజువారీ ఒక్కో షాపులో రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు మద్యం విక్రయాలు జరుగుతుంటాయి. సోమ వారం తిరునాళ్ల సందర్భంగా ఒక్కో షాపులో సరాసరిన రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు అమ్మకాలు చేసినట్లు అంచనా. మద్యం అమ్మకాలపై నియంత్రణ పెట్టాల్సిన అధికారులు తమకెందుకులే అన్నట్టుగా వదిలేశారు. కట్టడి చేస్తే తమకు నెలవారీ అందే మామూ ళ్లలో కోత పడుతుందన్న ఉద్దేశంతో మిన్నకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.