Share News

లైసెన్ప్‌.. ఫెయిల్‌!

ABN , Publish Date - Nov 11 , 2026 | 01:31 AM

రవాణా శాఖలో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు ప్రజలను ఇక్కట్లకు గురిచేస్తున్నాయి. మూడు నెలలుగా సర్వర్‌ డౌన్‌ కారణంగా ఎల్‌ఎల్‌ఆర్‌లు, డ్రైవింగ్‌ లైసెన్స్‌లు తీసుకోవడం గగనమవుతోంది.

లైసెన్ప్‌.. ఫెయిల్‌!

డ్రైవింగ్‌ పరీక్షలకు ఆన్‌లైన్‌ కష్టాలు

మూడు నెలలుగా సర్వర్‌ డౌన్‌

ఎల్‌ఎల్‌ఆర్‌కు స్లాట్‌ బుకింగ్‌ సమస్య

కామన్‌ సర్వీస్‌ సెంటర్ల చుట్టూ తిరుగుతున్న ప్రజలు

ఒంగోలు క్రైం, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి) : రవాణా శాఖలో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు ప్రజలను ఇక్కట్లకు గురిచేస్తున్నాయి. మూడు నెలలుగా సర్వర్‌ డౌన్‌ కారణంగా ఎల్‌ఎల్‌ఆర్‌లు, డ్రైవింగ్‌ లైసెన్స్‌లు తీసుకోవడం గగనమవుతోంది. నూతన విధానంలో పారదర్శకత పెంచాలని తీసుకొచ్చిన మార్పులు ప్రజలకు చుక్కలు చూపెడుతున్నాయి. దీంతో రోజుల తరబడి కామన్‌ సర్వీస్‌ సెంటర్ల చుట్టూ కాళ్లు అరిగేలా తిరగడం ప్రజల వంతు అయింది. ఇంటి నుంచే డ్రైవింగ్‌ లైసెన్స్‌లు పొందే విధానం తెచ్చామని చెబుతుండగా, ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా ఎల్‌ఎల్‌ఆర్‌ స్లాట్‌ బుక్‌ చేయడమే కష్టంగా మారింది.

ఎల్‌ఎల్‌ఆర్‌ స్లాట్‌ బుక్‌ చేయడం గగనం

లైట్‌ లెర్నర్‌ లైసెన్స్‌ కోసం ప్రస్తుతం ప్రవేశపెట్టిన ఆన్‌లైన్‌ విధానంలో స్లాట్‌ బుక్‌ చేయడం చాలాకష్టంగా మారింది. ఇంట్లో నుంచి అన్నది పక్కన పెట్టి కామన్‌ సర్వీస్‌ సెంటర్లకు వెళ్లినా అక్కడా చుక్కెదురవుతుంది. స్లాట్‌ బుక్‌ చేయడం కోసం రోజుల తరబడి తిరిగి బుక్‌ చేసుకుంటే చివరకు అక్కడ పరీక్ష ఫెయిల్‌ కావడం కొసమెరుపు. సాంకేతిక సమస్యలతో చాలావరకు పరీక్ష ఫెయిల్‌ అవుతున్నారు. ఇలా వరుసగా మూడుసార్లు ఫెయిల్‌ అయితే నేరుగా రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ కూడా ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహిస్తారు. అంటే ఎల్‌ఎల్‌ఆర్‌ తీసుకోవడానికి కనీసం పది నుంచి పదిహేను రోజులు సమయం వృథా అవుతుందని దరఖాస్తు చేసిన యువకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మూడుసార్లు ఫీజులు చెల్లించాల్సి వస్తోంది.

మూడు నెలలుగా సర్వర్‌ డౌన్‌

డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఎల్‌ఎల్‌ఆర్‌కు స్లాట్‌ బుక్‌ చేసుకోవడం పెద్ద సమస్యగా మారింది. స్లాట్‌ బుక్‌ చేయడానికి తప్పనిసరిగా (సీఎస్‌సీ) కామన్‌ సర్వీస్‌ సెంటర్లకు వెళ్లాల్సి వస్తోంది. అక్కడ సర్వర్‌ డౌన్‌ అని చెప్పడంతో వెనుదిరిగి ఇంటికి వెళ్లడం మామూలైపోయింది. గత మూడు నెలలుగా డ్రైవింగ్‌ లైసెన్స్‌ల రెన్యువల్‌కు కూడా అవకాశం లేకుండా పోయింది. రవాణా శాఖలో ఆన్‌లైన్‌ సర్వీస్‌లు మెరుగుపడాల్సిన అవసరం ఉంది. సర్వర్‌ డౌన్‌ కారణంగా రవాణా శాఖకు రావాల్సిన రాబడి కూడా తగ్గిపోయి ఆమేరకు ఖజానాకు గండిపడుతోంది.

డ్రైవింగ్‌ టెస్టులో మరింత కష్టాలు

ఏదోవిధంగా కష్టపడి ఎల్‌ఎల్‌ఆర్‌ పరీక్ష పాసైన తర్వాత నెలరోజుల నుంచి ఆరు నెలలలోపు డ్రైవింగ్‌ టెస్టుకు హాజరుకావచ్చు. ఒంగోలులో రవాణా శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అడ్వాన్స్‌డ్‌ డ్రైవింగ్‌ టెస్టు ట్రాక్‌పై జరిగే పరీక్షలో పాస్‌ కావడం అంత సులభమేమీ కాదు. అక్కడ సీసీ కెమెరాలు, సెన్సార్లు ఏర్పాటు చేసి కంప్యూటర్‌ వ్యవస్థ ద్వారా పరీక్ష నిర్వహిస్తారు. అయితే నాలుగు చక్రాల వాహనాలు నడిపేందుకు పరీక్ష పాస్‌ కావడం గగనమేనని అధికారులే చెబుతున్నారు. ఇప్పటికి ఏడాదిగా పాస్‌ అయిన వారు పదుల సంఖ్యలో మాత్రమే ఉన్నారు. ద్విచక్రవాహనం పరీక్ష కూడా కనీసం రెండుసార్లు వెళితే కానీ పాస్‌ కావడం లేదు.

Updated Date - Nov 11 , 2026 | 01:31 AM