అక్షరం.. పరిష్కారం
ABN , Publish Date - Mar 11 , 2026 | 03:13 AM
‘ఆంధ్రజ్యోతి’ ఆవిర్భావం నుంచి ప్రజల పక్షాన నిలబడి అక్షర సమరం సాగిస్తూనే ఉంది. అవినీతి, అక్రమాలపై నిరంతరం యుద్ధం చేస్తూనే సాధారణ సమస్యలపైనా కలం ఎక్కుపెడుతోంది.
నేడు మార్కాపురంలో చర్చావేదిక
33,34,35 వార్డులకు చెందిన ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం
పాల్గొననున్న ఎమ్మెల్యే కందుల, మునిసిపల్ కమిషనర్, అధికారులు
మార్కాపురం టౌన్, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): ‘ఆంధ్రజ్యోతి’ ఆవిర్భావం నుంచి ప్రజల పక్షాన నిలబడి అక్షర సమరం సాగిస్తూనే ఉంది. అవినీతి, అక్రమాలపై నిరంతరం యుద్ధం చేస్తూనే సాధారణ సమస్యలపైనా కలం ఎక్కుపెడుతోంది. ‘మా అక్షరం- మీ ఆయుధం’ అనే నినాదంతో ప్రజలకు మద్దతుగా నిలుస్తోంది. అభాగ్యులు, అశక్తులకు అండగా ప్రభుత్వాలు, పాలకులపై పోరాటం సాగిస్తూనే ఉంది. ‘అక్షరం అండగా.. ప్రజా సమస్యల పరిష్కారమే అజెండాగా’ నినాదంతో గత ఏడాది మరో మహత్తర యజ్ఞానికి శ్రీకారం పలికింది. కనీస సదుపాయాలు లేక అవస్థలు పడుతున్న ప్రాంతాల్లోని ప్రజల వేదనను ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషిచేసింది. దాని కొనసాగింపుగా బుధవారం మార్కాపురంలోని జవహర్‌నగర్ కాలనీలో కార్యక్రమ నిర్వహణకు సిద్ధమైంది. 33, 34, 35 వార్డుల పరిధిలోని ప్రజల సమస్యల పరిష్కారానికి వైట్‌హౌస్ సమీపంలో చర్చా వేదిక జరగనుంది. ప్రజాప్రతినిధులు, అధికారులు, కాలనీ ప్రజలను ఒక వేదిక మీదికి తెచ్చి సమస్యల పరిష్కారానికి ఆంధ్రజ్యోతి వారిధిగా నిలవబోతోంది. కార్యక్రమంలో శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి, మునిసిపల్ కమిషనర్ డీవీఎస్ నారాయణరావు, తహసీల్దార్ కె.చిరంజీవి, మునిసిపాలిటీలోని పలు విభాగాలకు చెందిన అధికారులు, వార్డు ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. ఆయా వార్డుల పరిధిలోని ప్రజలు సమస్యలను తెలియజేస్తే పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నారు.