ఎల్‌నినోను ఎదుర్కొందాం!
ABN , Publish Date - Sep 24 , 2026 | 03:29 AM
ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం కదిలింది. ఖరీఫ్ సీజన్ చివర్లో కురుస్తున్న తాజా వర్షాలతో కొంత సానుకూలత వచ్చింది. ఈ సమయంలో పంటల సాగుకు రైతులను సమాయత్తం చేయడంపై వ్యవసాయ శాఖ దృష్టి సారించింది.
నేడు ఒంగోలులో కిసాన్ మేళా
వ్యవసాయ, అనుబంధ శాఖల నిర్వహణ
తాజా వర్షాలతో సాగుకు సన్నద్ధతే లక్ష్యం
శాస్త్రవేత్తలు, అధికారులతో సూచనలు
సబ్సిడీపై విత్తనాల పంపిణీ
ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష
ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం కదిలింది. ఖరీఫ్ సీజన్ చివర్లో కురుస్తున్న తాజా వర్షాలతో కొంత సానుకూలత వచ్చింది. ఈ సమయంలో పంటల సాగుకు రైతులను సమాయత్తం చేయడంపై వ్యవసాయ శాఖ దృష్టి సారించింది. ఇందుకోసం ఒంగోలులో గురువారం వ్యవసాయ, అనుబంధ శాఖల ఆధ్వర్యంలో భారీగా కిసాన్ మేళాను నిర్వహిస్తోంది. ప్రాంతాల వారీగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కోసం ఏర్పాట్లు చేస్తోంది. అలాగే సబ్సిడీపై విత్తనాల పంపిణీ, ఇతర చర్యలపైనా దృష్టి సారించింది.
ఒంగోలు, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినోను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అవకాశం ఉన్న పంటలను రైతులు సాగు చేసేలా వారికి అవ గాహన కల్పించాలని నిర్ణయించింది. అవసర మైన విత్తనాలు, ఇతర ఉపకరణాల సరఫరా గురించి వివరించడం లక్ష్యంగా గురువారం కిసాన్ మేళాను నిర్వహిస్తోంది. జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఖరీఫ్ సీజన్ తీవ్ర ప్రతికూలంగా సాగింది. జిల్లాలో ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 55,774 హెక్టార్లు కాగా మరో వారంలో సీజన్ ముగుస్తుండగా 10 వేల హెక్టార్లకు మించి విత్తనం పడలేదు. ఈ సీజన్ అంతా ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవలేదు. ప్రత్యేకించి మెట్ట పంటల సాగు అధికంగా జరిగే జూలై, ఆగస్టులలో 80శాతానికిపైగా లోటు వర్షపాతం నెలకొంది. కీలకమైన కంది, పత్తి పంటలు పది శాతం కూడా సాగుకు నోచుకోక పోగా సాగైన వరి, మొక్కజొన్న ఇతరత్రా వాడుముఖం పట్టాయి.
వర్షాలతో కాస్త ఊరట
జిల్లాలోని 28 మండలాల్లో 18 మండలాల్లో తీవ్ర, పది మండలాల్లో మధ్యస్థాయిలో కరువు నెలకొంది. చివరకు పశుగ్రాస పంటలు కూడా సాగు కాక మేతకు సైతం ఇక్కట్లు ఏర్పడి పాల ఉత్పత్తి తగ్గింది. పండ్ల తోటలు, సామాజిక వనాలు కూడా వర్షాభావంతో ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. రబీ సీజన్‌పై కూడా ఎల్‌నినో ప్రభావం ఉంటుందన్న వాతావరణ శాఖ సమాచారంతో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి సమయంలో గత వారం రోజులుగా జిల్లాలో వర్షాలు పడుతున్నాయి. కొన్నిచోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షమే కురిసింది. ఇది ఇప్పటికే సాగులో ఉన్న పైర్లకు జీవం పోసింది. రబీ సాగుకు అనుకూల వాతావరణం ఏర్పడింది. రబీలో జిల్లాలో పొగాకు, శనగ, వరి ప్రధాన పంటలు కాగా సాగర్ నీరు వచ్చే పరిస్థితి లేకపోవడంతో వరిసాగుకు అవకాశం లేదు. అలాగే పొగాకు మార్కెట్లో ప్రస్తుత సీజన్‌లో నెలకొన్న తీవ్ర సంక్షోభం నేపథ్యంలో ఆ పంట సాగును గణనీయంగా తగ్గించాలని ప్రభుత్వం సూచించింది. తదనుగుణంగా పొగాకు బోర్డు గతం కన్నా పంట ఉత్పత్తిలో దాదాపు 45శాతం కోత విధించింది.
ఒంగోలులో భారీ రైతు సదస్సు
జిల్లా స్థాయిలో సదస్సు నిర్వహించి వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థక, పొగాకు బోర్డు, మైక్రో ఇరిగేషన్ తదితర శాఖల అధికారులు, ఆయా శాఖలకు చెందిన శాస్త్రవేత్తలతో రైతులకు సూచనలు, సలహాలు ఇచ్చి అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. తదనుగుణంగా గురువారం ఒంగోలులో కిసాన్ మేళా పేరుతో స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని బచ్చల బాలయ్య కల్యాణ మండపంలో భారీ రైతు సదస్సు ఏర్పాటు చేశారు. ఒక్కో మండలం నుంచి 25 నుంచి 30 మంది రైతులు సదస్సుకు హాజరయ్యేలా మండల అధికారులకు సూచించినట్లు వ్యవసాయశాఖ అఽధికారి ఎస్.శ్రీనివాసరావు తెలిపారు. సదస్సును మంత్రి డాక్టర్ డీఎస్‌బీవీ స్వామి ప్రారంభించనుండగా పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొనున్నారు. ప్రారంభ సభ అనంతరం ప్రస్తుత పరిస్థితుల్లో సాగుకు అవకాశం ఉన్న పంటలు, ప్రభుత్వపరంగా అందించే సహకారం, ఇతరత్రా అంశాలపై రైతులకు వివరించనున్నారు. ఇదిలాఉండగా జిల్లాలో ఎల్‌నినో ప్రభావం తీవ్రంగానే ఉండటంతో తదనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ రాజాబాబు బుధవారం సాయంత్రం సంబంఽధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ, పశుసంవర్థక, ఉద్యాన, మైక్రో ఇరిగేషన్, డ్వామా, ఇరిగేషన్, ఆర్‌డబ్ల్యూఎస్ ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. శాఖల వారీ తీసుకోవాల్సిన చర్యలపై వారికి కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు.
ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి
ప్రస్తుత పరిస్థితుల్లో అటు వరి, ఇటు పొగాకు రైతులకు ప్రత్యామ్నాయ పంటలను సూచించాలి. ఇక ఖరీఫ్ సీజన్‌లో సుమారు 80శాతం విస్తీర్ణంలో విత్తనం పడక భూములు ఖాళీగా ఉన్నాయి. ఈనేపథ్యంలో సాగుపై ఆశలు కల్పిస్తూ వారం రోజులుగా జిల్లాలో వర్షాలు పడుతున్నాయి. జిల్లాలో సగటున 4 సెం.మీ వర్షపాతం నమోదైంది. కొన్ని మండలాల్లో 10 సెం.మీ కూడా కురిసింది. ఈ నెలలో సాధారణ వర్షపాతం 140 మి.మీ కాగా ఈ సమ యానికి 93.58 మి.మీ కురవాల్సి ఉండగా 72.20 మి.మీ పడింది. అలా కొంత ఆశాజనక పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించేందుకు వ్యవసాయశాఖ సన్నద్ధమైంది. వారంవారం క్షేత్రస్థాయిలో పొలం పిలుస్తోంది కార్యక్రమంలో ఆయా గ్రామాల్లో పరిస్థితులకు అనుగుణంగా సూచనలు చేస్తున్నారు.