ఎల్‌నినోను ఎదుర్కొందాం
ABN , Publish Date - Aug 08 , 2026 | 02:45 AM
ఎల్‌నినో ప్రభావంతో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొని పంటల సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమాలకు వ్యవసాయశాఖ శ్రీకారం చుట్టింది. అందుకు సంబంధించి ప్రభుత్వ ఆదేశాలతో క్షేత్రస్థాయిలో ఉండే రైతు సేవా కేంద్రం (ఆర్‌ఎస్‌కే) యూనిట్‌గా రైతన్నా మీకోసం కార్యక్రమాన్ని చేపట్టింది.
కార్యాచరణపై రైతులకు అవగాహన
జిల్లావ్యాప్తంగా ‘రైతన్నా మీకోసం’ ప్రారంభం
మద్దిపాడులో పాల్గొన్న కలెక్టర్ రాజాబాబు
ఒంగోలు, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొని పంటల సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమాలకు వ్యవసాయశాఖ శ్రీకారం చుట్టింది. అందుకు సంబంధించి ప్రభుత్వ ఆదేశాలతో క్షేత్రస్థాయిలో ఉండే రైతు సేవా కేంద్రం (ఆర్‌ఎస్‌కే) యూనిట్‌గా రైతన్నా మీకోసం కార్యక్రమాన్ని చేపట్టింది. వారంరోజుల పాటు జిల్లాలోని 372 ఆర్‌ఎస్‌కేల పరిధిలో జరగనున్న ఈ కార్యక్రమాన్ని మండల కేంద్రమైన మద్దిపాడులో కలెక్టర్ రాజాబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సభ నిర్వహించారు. ఒకవైపు గ్రామాల్లో రైతులతో సమావేశాలు, మరోవైపు భూముల పరిశీలన ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. తదనుగుణంగా జిల్లాలోని అన్ని ఆర్‌ఎస్‌కేల పరిధిలోనూ శుక్రవారం రైతన్నా మీ కోసం నిర్వహించారు. గతంలో పలుమార్లు రైతన్నా మీకోసం కార్యక్రమం నిర్వహించినా అప్పట్లో రైతుల ఇళ్లకు వెళ్లి వారితో మాట్లాడటం వరకే పరిమితం కాగా ఈసారి గ్రామంలోని ప్రతి సర్వే నెంబరు భూమిని సందర్శించాలని ప్రభుత్వం సూచించింది.
క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలన
క్షేత్ర స్థాయిలోని వ్యవసాయ అనుబంధ శాఖల సిబ్బంది తమ పరిధిలోని ప్రతి సర్వేనెంబరు భూమిని పరిశీలించాలి. అందులో పంటలు వేశారా, వేస్తే ఏ రకం వేశారు, వాటి ప్రస్తుత పరిస్థితి ఏమిటి, అనేది వ్యవసాయశాఖ రూపొందించిన యాప్‌లో నమోదు చేయాల్సి ఉంది. తదనుగుణంగా సిబ్బంది చేస్తున్నారు. అలాగే ఏ పంట వేయకుండా ఖాళీగా ఉంటే దానిని కూడా నమోదు చేయడంతోపాటు ప్రస్తుతం ఆ భూముల్లో సాగుకు అవకాశం ఉన్న పంటలపై రైతులకు సూచనలు ఇవ్వాలి. ఆ రకంగా అన్ని అంశాలను క్రోడీకరించి ఆర్‌ఎస్‌కే స్థాయిలో ఎల్‌నినో నివారణ, కార్యాచరణ ప్రణాళికలు రూపొందించనున్నట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఎస్.శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వహణపై రెండు జిల్లాలకు ఒక ఉన్నతాధికారిని కమిషనరేట్ నుంచి పరిశీలకులుగా నియమించారు. అలా నియమితులైన రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనరేట్‌లోని జాయింట్ డైరెక్టర్ ఎన్.చిన్న బాలునాయక్ శుక్రవారం డీఏవో శ్రీనివాసరావుతో కలిసి కోలచనకోట, ఇలపావులూరులలో క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. అనంతరం మద్దిపాడు మండల కార్యాలయంలో అధికారులతో సమీక్ష చేశారు. అలాగే జిల్లాలోని అందరూ ఆ శాఖ అధికారులతో వెబ్‌కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు.