Share News

పుల్లలచెరువు రెవెన్యూలో అవినీతి జలగలు

ABN , Publish Date - Aug 16 , 2026 | 11:11 PM

పుల్లలచెరువు రెవెన్యూ కార్యాలయంలో అవినీతి రోజురోజుకూ పెరిగిపోతోంది. కొందరు అధికారులు రైతులను రాబందుల్లా పీక్కుతింటున్నారు. ఏ పని కావాలన్నా లంచం ఇవ్వాల్సిందే. లేదంటే నెలల తరబడి కార్యాలయం చుట్టూ తిరగాల్సిందే

పుల్లలచెరువు రెవెన్యూలో అవినీతి జలగలు
పుల్లలచెరువు తహసీల్దారు కార్యాలయం

మ్యుటేషన్‌ కోసం రూ.10వేల నుంచి రూ.50వేల లంచం డిమాండ్‌

ఎర్రగొండపాలెం కేంద్రంగా దళారులతో కోట్లు వసూలు

రెగ్యులర్‌ తహసీల్దార్‌ లేక ఇష్టానుసారంగా అధికారులు

గత వారం ఏసీబీకి చిక్కిన వీఆర్వో

పుల్లలచెరువు, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి) : పుల్లలచెరువు రెవెన్యూ కార్యాలయంలో అవినీతి రోజురోజుకూ పెరిగిపోతోంది. కొందరు అధికారులు రైతులను రాబందుల్లా పీక్కుతింటున్నారు. ఏ పని కావాలన్నా లంచం ఇవ్వాల్సిందే. లేదంటే నెలల తరబడి కార్యాలయం చుట్టూ తిరగాల్సిందే. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కార్యాలయాల్లో అవినీతీ తగ్గుతుందని అందరూ భావిస్తే అందుకు విరుద్ధంగా పుల్లలచెరువు మండల రెవెన్యూ ఆఫీ్‌సలో అధికారులు లంచావతారం ఎత్తారు.

గత శుక్రవారం గంగవరంలో ఓ రైతు నుంచి వారసత్వ భూమిని మ్యుటేషన్‌ చేసేందుకు రూ.50 వేలు లంచం తీసుకుంటూ వీఆర్వో ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే. వారసత్వ భూములు, రీసర్వే తరువాత, చనిపోయిన వారి నుంచి మ్యుటేషన్‌ చేయాలంటే రూ.10వేల నుంచి రూ.50వేల వరకు లంచం డిమాండ్‌ చేస్తున్నారు.


రెగ్యులర్‌ తహసీల్దార్‌ లేక సమస్యలు

పుల్లలచెరువు మండలానికి రెగ్యూలర్‌ తహసీల్దార్‌ లేరు. దీంతో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఎర్రగొండపాలెం కేంద్రంగా రెవెన్యూ అధికారి దళారులను నియమించుకొని మ్యుటేషన్‌ పని కావాలంటే వేలకువేలు రైతుల నుంచి పిండుతున్నట్లు ఆరోపణలున్నాయి. కవలకుంట్ల గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు రెవెన్యూ ఆఫీ్‌సకు వెళ్తే.. మీకు ఇక్కడేం పని.. వీఆర్వోతో కలిసి రావాలని చెప్పినట్లు వాపోయారు. దళారీల ద్వారా పోతే వెంటనే పనులు జరుగుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. పుల్లలచెరువు మండలానికి చెందిన మండల స్థాయి నాయకుడిని నుంచి మ్యుటేషన్‌ కోసం డబ్బులు తీసుకొని రేపుమాపు తిప్పుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మానేపల్లి రెవెన్యూ గ్రామంలో భూమిని కొనుగోలు చేశారు. దాని రీసర్వే తరువాత ఆన్‌లైన్‌లో పేరు లేకపోవడంతో రిజిస్ట్రేషన్‌కు ఇబ్బంది ఏర్పడింది. మ్యుటేషన్‌కు 4 నెలల కిందట సర్వేయర్‌ని సంప్రదిస్తే రూ.30వేలు ఇస్తేనే పనవుతుందని చెప్పి వీఆర్వో పెండింగ్‌లో పెట్టారు. మార్కాపురం జిల్లా అయిన తర్వాత 2025 డిసెంబరు 31 తేదీలోపు రిజిష్ట్రేషన్‌ శాఖ ద్వారా ఆటో మ్యుటేషన్‌ జరిగిన సర్వే నెంబర్లకు డిజిటల్‌ సిగ్నేచర్‌ ఫెయిల్‌ అయింది. ఇదే అదునుగా వీఆర్వోలు, రెవెన్యూ అధికారులు రైతుల నుంచి రూ.2వేలు, రూ.5వేల చొప్పున వసూలు చేసినట్లు రైతులు చెప్తున్నారు. కార్యాలయ పనివేళల్లో అధికారులు అందుబాటులో ఉండడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ కార్యాలయాల్లో సక్రమంగా, సజావుగా రైతులకు, ఇతరులకు సేవలందేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Aug 16 , 2026 | 11:11 PM