Share News

పంట తగ్గింపు వైపే మొగ్గు

ABN , Publish Date - Jun 10 , 2026 | 01:12 AM

రానున్న సీజన్‌లో పొగాకు పంట ఉత్పత్తి తగ్గింపు వైపు రైతులు మొగ్గుచూపుతున్నారు. ఆ విషయాన్ని బోర్డు అధికారులకు రైతు ప్రతినిధులు స్పష్టంగా చెప్పేస్తున్నారు. సాధారణంగా ఏటా గతం కన్నా ఎంతో కొంతమేర అధికంగా పంట పండించేందుకు అనుమతి కోసం గట్టిగా డిమాండ్‌ చేసే రైతులు ఈసారి అందుకు భిన్నంగా తగ్గింపు కోరుతున్నారు.

పంట తగ్గింపు వైపే మొగ్గు
రైతు ప్రతినిధులతో సమావేశమైన ఒంగోలు-2 వేలం కేంద్రం అధికారి తులసి

గతానికి భిన్నంగా రైతుల ఆలోచన

అధికారుల అభిప్రాయ సేకరణలో స్పష్టం

ప్రస్తుత సీజన్‌ సంక్షోభంతో బెంబేలు

ప్రత్యామ్నాయం లేకనే పొగాకు సాగు

నోబిడ్‌ తగ్గింపుపై బోర్డు అధికారుల దృష్టి

అదే ప్రధానంగా కీలక సమావేశం

భరోసా కల్పించని వ్యాపారుల వైఖరి

ఒడిదొడుకుల్లోనే దక్షిణాది మార్కెట్‌

రానున్న సీజన్‌లో పొగాకు పంట ఉత్పత్తి తగ్గింపు వైపు రైతులు మొగ్గుచూపుతున్నారు. ఆ విషయాన్ని బోర్డు అధికారులకు రైతు ప్రతినిధులు స్పష్టంగా చెప్పేస్తున్నారు. సాధారణంగా ఏటా గతం కన్నా ఎంతో కొంతమేర అధికంగా పంట పండించేందుకు అనుమతి కోసం గట్టిగా డిమాండ్‌ చేసే రైతులు ఈసారి అందుకు భిన్నంగా తగ్గింపు కోరుతున్నారు. రెండు రోజులుగా దక్షిణాదిలోని వేలం కేంద్రాల పరిధిలో నిర్వహిస్తున్న సమావేశాల్లో రైతులందరి తరఫున వేలం కేంద్రాల కమిటీ సభ్యులు బోర్డు అధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్తున్నారు.

ఒంగోలు, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి) : పొగాకు రైతుకు గడ్డుకాలం నడుస్తోంది. ప్రస్తుత సీజన్‌లో గతంలో ఎన్నడూ లేనంత సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. వేలం ప్రారంభించి రెండున్నర నెలలు గడుస్తున్నా పండిన పంటలో 10 శాతం మించి కొనుగోళ్లు పూర్తికాలేదు. ధరలు దిగజారిపోవడంతోపాటు నోబిడ్‌లు పెద్దఎత్తున ఉంటున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కాగా పాతికేళ్ల క్రితం ఒక ఏడాది స్వయంగా పంట విరామం ప్రకటించుకున్న రోజులను గుర్తు చేసుకొని వచ్చే సీజన్‌లో కూడా అలా చేస్తే బాగుంటుందన్న చర్చ పొగాకు రైతుల్లో సాగుతోంది. అయితే పూర్తిగా పంట విరామం కన్నా కొంత ఉత్పత్తి తక్కువ చేస్తే మంచిదన్న అభిప్రాయాన్ని రైతు ప్రతినిధులు వ్యక్తం చేస్తున్నారు. అదే విషయాన్ని బోర్డు అధికారులకు తెలియజేస్తున్నారు. ఏటా పంట సాగు విస్తీర్ణం, ఉత్పత్తిని ఖరారు చేసే ముందు పొగాకు బోర్డు అధికారులు పలు విషయాలను పరిశీలిస్తారు. వివిధ దేశాల్లో పంట ఉత్పత్తి, మార్కెట్‌ పోకడ, గతంలో దేశీయంగా పంట ఉత్పత్తి, ధరల తీరును పరిగణనలోకి తీసుకుంటారు. క్షేత్రస్థాయిలో వేలం కేంద్రాల వారీ రైతులతో సమావేశాలను నిర్వహిస్తారు. వారి అభిప్రాయాలను తెలుసుకుంటారు. వ్యాపారులతో సమావేశమై కంపెనీల వారీగా వారి అభిప్రాయాలను, ఇండెంట్‌లను తీసుకుంటారు. తదనుగుణంగా ఆ సీజన్‌ పంట ఉత్పత్తి పరిణామాన్ని నిర్ణయిస్తారు. అలా 2025-26 సీజన్‌కు రాష్ట్రంలో 140 మిలియన్‌ కిలోలు.. దక్షిణాదిలోని ఒంగోలు కేంద్రంగా ఉన్న రెండు రీజియన్ల పరిధిలో 88.80 మిలియన్‌ కిలోల పంట ఉత్పత్తికి అనుమతించారు. అయితే పంట ఉత్పత్తి భారీగా పెరిగింది. ఒక్క దక్షిణాదిలోనే సుమారు 148 మిలియన్‌ కిలోలు పండినట్లు అంచనా. దీనికి తోడు ఇంకా పలుదేశాల్లో అధిక ఉత్పత్తి అయ్యింది. కేంద్రం జీఎస్టీ పెంచడం, అమెరికా ఇరాన్‌ యుద్ధం నేపథ్యంలో ఇక్కడ మార్కెట్‌ ముందుకు కదలడం లేదు. ముమ్మరంగా కొనుగోళ్లు జరగాల్సిన సమయంలో మొక్కుబడిగా వేలం సాగుతూ మార్కెట్‌ తీవ్ర ఒడిదొడుకుల్లో సాగుతోంది.

మందకొడిగా కొనుగోళ్లు

దక్షిణాదిలో మార్చి 25న వేలం ప్రారంభమైంది. ఇప్పటివరకు కేవలం 12 మిలియన్‌ కిలోల లోపు మాత్రమే కొనుగోళ్లు జరిగాయి. సగటున ధర కిలో రూ.225 లోపుగానే ఉంటోంది. ఈ పరిస్థితి ఇటీవల కాలంలో ఎన్నడూ లేకపోగా కొనుగోళ్లు ఎప్పటికి పూర్తవుతాయి, కనీసం ఖర్చులు అయిన వస్తాయా లేదా అన్న ఆందోళన రైతుల్లో తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో వచ్చేసీజన్‌ (2026-27)పంట సాగు, ఉత్పత్తి ఖరారు సమయం సమీపిస్తోంది. దీంతో బోర్డు అధికారులు వేలంకేంద్రాల వారీ రైతు కమిటీలతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలను సేకరిస్తున్నారు. రెండురోజులుగా దక్షిణాదిలోని వేలం కేంద్రాల్లో ఈ సమావేశాలు జరుగుతున్నాయి. అందులోభాగంగా మంగళవారం ఒంగోలు-1, ఒంగోలు-2 కేంద్రాల్లో కూడా జరిగాయి.

తగ్గించాలంటున్న రైతు ప్రతినిధులు

పంట ఉత్పత్తికి సంబంధించి బోర్డు అధికారులు నిర్వహించే సమావే శాల్లో ఏటా గతం కన్నా అధిక పరిమాణంలో ఉత్పత్తికి రైతు ప్రతినిధులు పట్టుబట్టేవారు. ఈసారి వారే తగ్గించాలని కోరుతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌ జరుగుతున్న ఈ సీజన్‌(2025-26)లో బ్యారన్‌కు దక్షిణాదిలో 35 నుంచి 36 క్వింటాళ్ల ఉత్పత్తికి అధికారికంగా అనుమతి ఇచ్చారు. రానున్న సీజన్‌(2026-27)కు బ్యారన్‌కు 27 నుంచి 30 క్వింటాళ్లలోపు మాత్రమే రైతులు కోరుతు న్నారు. ప్రస్తుత మార్కెట్‌ తీరుతో బెంబేలెత్తిపోయి పంట తగ్గించుకోక పోతే తీవ్రంగా నష్టపోతామన్న భయంతో వారు అలా చెబుతున్నట్లు సమాచారం. కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ ఆదేశాలతో పొగాకు బోర్డు అధికారులు కూడా పంట తగ్గింపునకే ప్రయత్నిస్తున్నారు.

వ్యాపారుల తీరుపై తీవ్ర అసంతృప్తి

ప్రస్తుత సీజన్‌ మార్కెట్‌పై రైతులకు ఏమాత్రం భరోసా దక్కడం లేదు. సోమవారం రాత్రి గుంటూరులోని పొగాకు బోర్డు ప్రధాన కార్యాలయంలో బోర్డు చైర్మన్‌ యశ్వంత్‌కుమార్‌, ఈడీ విశ్వశ్రీలు వ్యాపార, రైతు ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అందులో వ్యాపార ప్రతినిధులు మాట్లాడిన తీరుపై రైతుప్రతినిధులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. బోర్డు ఈడీ విశ్వశ్రీ కూడా గట్టిగానే వ్యాపారులతో మాట్లాడినట్లు సమాచారం. అయితే ఏదో ఒక కుంటిసాకులు చెప్పడం మినహా రైతులకు భరోసా కలిగించే రీతిలో వ్యాపారుల నుంచి స్పందన రాలేదని తెలుస్తోంది. దీంతో మార్కెట్లో అలజడి లేకుండా రోజువారీ కొనుగోళ్లలో నోబిడ్‌లు తగ్గించేలా బోర్డు అధికారులు దృష్టి సారించారు. ఏ కేంద్రంలోనూ 20శాతం మించి నోబిడ్‌లు లేకుండా చూడాలని కిందిస్థాయి అధికారులకు, వ్యాపారులకు బోర్డు అధికారులు సూచించినట్లు సమాచారం. అయితే ధరలలో పెరుగుదల లేకుండా నోబిడ్‌లు తగ్గించడం అంటే ప్రస్తుతం ఉన్న ధరలను కూడా ఇంకా తగ్గించడమేనన్న ఆందోళన రైతులు వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jun 10 , 2026 | 01:12 AM