Share News

ప్రధాని సభ ఏర్పాట్లలో ఉమ్మడి జిల్లా నేతలు

ABN , Publish Date - Jul 30 , 2026 | 02:34 AM

భోగాపురం విమానాశ్రయాన్ని వచ్చేనెల 1న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రారంభించనుండగా ఆ కార్యక్రమాన్ని రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఒకవైపు ప్రభుత్వం, మరోవైపు టీడీపీ తరఫున సీఎం చంద్ర బాబునాయుడు ఈ కార్యక్రమంపై దృష్టిసారించారు. ఆ సందర్భంగా భారీ సభను నిర్వహిస్తున్నారు.

ప్రధాని సభ ఏర్పాట్లలో ఉమ్మడి జిల్లా నేతలు
విశాఖలోని ఎమ్మెల్యే గంటా నివాసంలో ఇతర మంత్రులు, నాయకులతో కలిసి చర్చిస్తున్న జిల్లాకు చెందిన మంత్రులు డాక్టర్‌ స్వామి, గొట్టిపాటి రవికుమార్‌

జన సమీకరణ, సభా పర్యవేక్షణ బాధ్యతల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు

ఒంగోలు, జూలై 29 (ఆంధ్రజ్యోతి) : భోగాపురం విమానాశ్రయాన్ని వచ్చేనెల 1న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రారంభించనుండగా ఆ కార్యక్రమాన్ని రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఒకవైపు ప్రభుత్వం, మరోవైపు టీడీపీ తరఫున సీఎం చంద్ర బాబునాయుడు ఈ కార్యక్రమంపై దృష్టిసారించారు. ఆ సందర్భంగా భారీ సభను నిర్వహిస్తున్నారు. ఈనేపథ్యంలో ప్రధాని పర్యటన, సభలను దిగ్విజయంగా నిర్వహించేందుకు పలువురు రాష్ట్రమంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలకు బాధ్యతలు అప్పగించారు. అందులో ఉమ్మడి జిల్లాకు చెందిన ముఖ్యనేతలందరూ ఉన్నారు. వీరంతా ఉత్తరాంధ్ర జిల్లాల్లో మకాం వేసి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జిల్లాకు చెందిన రాష్ట్రమంత్రులు డాక్టర్‌ డీఎస్‌బీవీ స్వామి, గొట్టిపాటి రవికుమార్‌ మూడు రోజులుగా ఒకవైపు ప్రధాని కార్యక్రమ నిర్వహణ పనులు, మరోవైపు పరిసర ప్రాంతాల నుంచి జనసమీకరణపై అక్కడి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా బుధవారం విశాఖ నగరం లోని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నివా సంలో జరిగిన సమావేశంలో ఇద్దరు మంత్రులూ పాల్గొన్నారు. ఇక పార్టీ ఒంగోలు పార్లమెంట్‌ అధ్య క్షుడు డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి నెల్లిమర్ల నియోజకవర్గం, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ గాజువాక, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు నరసన్నపేట, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి శృంగవరపుకోట, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి శ్రీకాకుళం జిల్లాల్లో జనమీకరణపై స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర నాయకులతో కలిసి పర్యటిస్తున్నారు. మారిటైం బోర్డు చైర్మన్‌ దామచర్ల సత్య గత నాలుగు రోజులుగా అక్కడి ఏర్పాట్లలో భాగస్వామిగా పనిచేస్తున్నారు.

Updated Date - Jul 30 , 2026 | 02:34 AM