Share News

మందకొడిగా గృహగణన

ABN , Publish Date - May 08 , 2026 | 02:52 AM

జిల్లాలో గృహగణన మందకొడిగా సాగుతోంది. ఈనెల 1వతేదీ నుంచి ప్రారంభమైన ప్రక్రియను 30రోజుల్లో పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే సిబ్బందిలో నిర్లక్ష్యం, నిర్లిప్తత నెలకొంది.

మందకొడిగా గృహగణన
ఒంగోలులోని కుట్టుబోయినపాలెంలో గృహ సర్వే చేస్తున్న ఎన్యుమరేటర్లు

గ్రామీణ ప్రాంతాల్లో ఒకరకంగా కొనసాగింపు

పట్టణాల్లో మరీ దారుణం

ఒంగోలులో నిర్లిప్తత

రాష్ట్రంలో 5వ స్థానం నుంచి 9కి దిగజారిన పరిస్థితి

ఒంగోలు కలెక్టరేట్‌, మే 7 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో గృహగణన మందకొడిగా సాగుతోంది. ఈనెల 1వతేదీ నుంచి ప్రారంభమైన ప్రక్రియను 30రోజుల్లో పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే సిబ్బందిలో నిర్లక్ష్యం, నిర్లిప్తత నెలకొంది. గృహ గణన ప్రారంభమైన అనంతరం నాలుగైదు రోజు లపాటు రాష్ట్ర స్థాయిలో జిల్లా 5వస్థానంలో ఉండగా గురువారం 9కి పడిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో కొంతమేర నడుస్తుండగా పట్టణ ప్రాంతాల్లో మందకొడిగా సాగుతోంది. జిల్లా కేంద్రమైన ఒంగోలులో గురువారం 480 మంది ఎన్యుమరేటర్లు గృహగణన చేయాల్సి ఉండగా కేవలం 128మంది మాత్రమే చేశా రంటే ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలోని 28 మండలాల పరిధిలో 500 రెవెన్యూ గ్రామాలను 2,412 బ్లాకులుగా, ఐదు పట్టణ ప్రాంతాల్లో 142 వార్డులను 845 బ్లాకు లుగా విభజించి 3,257 మందిని క్షేత్రస్థాయిలో ఎన్యుమరేటర్లను నియమించారు. గృహ గణన నమోదుపై ముందుగా శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం సూచించిన 33 అంశాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంది. ప్రభుత్వం ఆదేశించిన లక్ష్యాలకు అనుగు ణంగా ఎన్యుమరేటర్లు గ్రామీణ ప్రాంతాల్లో ఒకరకంగా పనిచేస్తుండగా పట్టణ ప్రాంతాల్లో నిదానించారు. మరికొన్ని ప్రాంతాల్లో 33 అంశాలను ఎన్యుమరేటర్లు సేకరించే సమయంలో ఆ కుటుంబానికి సంబంధించిన పలు అంశాలను వెల్లడించేందుకు జనం కూడా వెనకడుగు వేస్తుండడంతో కొంత జాప్యం జరుగుతున్నట్లు సమాచారం. ప్రధానంగా ఆ గృహ యజమానికి సంబంధించిన సమాచారాన్ని అందించేందుకు కూడా ఇష్టపడటం లేదన్నట్లు సమాచారం. ఈ సర్వేపై విస్తృతంగా ప్రచారం జరగడంతో కొంత అవగాహన ఉన్న వ్యక్తులు వారి ఇంటి వద్దకు వచ్చినప్పుడు వెంటనే సమాచారం ఇస్తుండగా కొంత మంది మాత్రం నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రమైన ఒంగోలులో అందుకు భిన్నంగా గృహగణన సాగుతోంది. ఒంగోలులో ఎన్యుమరేటర్లు గృహగణన విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఒంగోలులో 480మంది గణన చేయాల్సి ఉండగా కేవలం 128మంది చేస్తుండగా 352మంది అసలు వెళ్లడం లేదు.

Updated Date - May 08 , 2026 | 02:52 AM