ఎన్ఎంఎంఎస్కు బారీగా దరఖాస్తులు
ABN , Publish Date - Oct 29 , 2026 | 02:43 AM
జాతీయ ఉపకార వేతన పరీక్ష (ఎన్ఎంఎంఎస్)కు ఉమ్మడి జిల్లా విద్యార్థులు భారీగా దరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాదితో పోల్చితే ఈసారి 250శాతం మంది అదనంగా ఉన్నారు. రాష్ట్రంలోనే ఉమ్మడి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది.
గతేడాది కంటే 250శాతం అధికం
ఒంగోలు విద్య, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి) : జాతీయ ఉపకార వేతన పరీక్ష (ఎన్ఎంఎంఎస్)కు ఉమ్మడి జిల్లా విద్యార్థులు భారీగా దరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాదితో పోల్చితే ఈసారి 250శాతం మంది అదనంగా ఉన్నారు. రాష్ట్రంలోనే ఉమ్మడి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. గత ఏడాది 4,009 మంది దరఖాస్తులు చేయగా ప్రస్తుతం 10,795 మంది అప్లై చేశారు. అందులో ప్రకాశం కంటే మార్కాపురం జిల్లాలో ఎక్కువ మంది ఉన్నారు. ప్రకాశం నుంచి 5,120 మంది, మార్కా పురం జిల్లా నుంచి 5,675 మంది దరఖాస్తు చేశారు. గడువు మంగళవా రంతో ముగిసింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మాత్రమే పరిమితమైన ఈ ఉపకార వేతన పరీక్షకు 8వ తరగతి విద్యార్థులతో దరఖాస్తు చేయించేందుకు విద్యాశాఖ ఉన్నతాధికారులు హెచ్ఎంలపై ఒత్తిడి తెచ్చారు. దీంతో విద్యార్థులు ముందుకు రాక పోయినా హెచ్ఎంలు తమ జేబుల్లో డబ్బులు ఫీజులుగా చెల్లించి దరఖాస్తు చేశారు. గత ఏడాది ఉమ్మడి జిల్లాలో 199 మంది ఈ స్కాలర్షిప్లకు ఎంపిక కాగా ప్రస్తుత సంవత్సరం కూడా దామాషా ప్రకారం ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో 199 మందిని ఎంపిక చేయనున్నారు.