ముక్తినూతలపాడులోని భూమి రైతు వారీ పట్టా భూమిగా నమోదు
ABN , Publish Date - Mar 11 , 2026 | 11:15 PM
ఒంగోలు నగర పరిధిలోని ముక్తినూతలపాడు పరిధిలో ఉన్న వివాదాస్పద 186 సర్వే నెంబరులో భూమి ముగ్గురు రైతులకు పట్టాదారు భూమిగా తమ రికార్డుల్లో నమోదై ఉందని ఆర్డీవో లక్ష్మీప్రసన్న స్పష్టంచేశారు.
రెవెన్యూ రికార్డుల ప్రకారం ఎవరికీ ఇంటి పట్టాలు ఇవ్వలేదు
కోర్టులో ఉన్నందున ఎవరూ అందులోకి వెళ్లకూడదు
ఒంగోలు ఆర్డీవో లక్ష్మీప్రసన్న
ఒంగోలు కలెక్టరేట్, మార్చి 11 (ఆంధ్రజ్యోతి) : నగర పరిధిలోని ముక్తినూతలపాడు పరిధిలో ఉన్న వివాదాస్పద 186 సర్వే నెంబరులో భూమి ముగ్గురు రైతులకు పట్టాదారు భూమిగా తమ రికార్డుల్లో నమోదై ఉందని ఆర్డీవో లక్ష్మీప్రసన్న స్పష్టంచేశారు. ఆ సర్వేనెంబరుపై ఆర్‌ఎ్‌సఆర్ ప్రకారం మొత్తం 12.80 ఎకరాల భూమి చివుకుల రామకృష్ణయ్య, లక్ష్మీనరసయ్యతో పాటు మరొకరి పేరుపై ఉందన్నారు. ఆర్డీవో కార్యాలయంలోని 10 వన్ అడంగల్‌ను పరిశీలించగా వివాదంలో ఉన్న భూమికి సంబంధించి సూదనగుంట కోటయ్య, సుబ్బయ్య, బంగారయ్యలపై రైతువారీ పట్టాలు ఉన్నాయని తెలిపారు. 186/2 సర్వేనెంబరును సబ్ డివిజన్ చేసి గతంలోనే ఎన్‌ఎ్‌సపీకి కొంత భూసేకరణ చేశారన్నారు. అంతేగాక ఐటీఐ, క్యాన్సర్ హాస్పటల్‌కు ఇంకొంత ఇచ్చినట్లు చెప్పారు. అవన్నీపోను సుమారు మూడెకరాల భూమిలోనే వివాదం నడుస్తోందన్నారు. అందులో ప్రస్తుతం 1.40 ఎకరాలలో ఇళ్లు ఉండగా, 1.63 ఎకరాల భూమి ఖాళీగా ఉందని చెప్పారు. ఈ భూముల్లో రెవెన్యూ రికార్డుల ప్రకారం తామెవరికీ ఇంటి పట్టాలు ఇవ్వలేదన్నారు. డీకే రిజిస్టర్లను కూడా పరిశీలించగా ఎక్కడానమోదు కాలేదన్నారు. ఈ భూమికి సంబంధించి కోర్టులో కూడా కేసులు ఉన్నాయని, కోర్టు ఉత్తర్వులను బట్టి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం ఆ భూమికి రక్షణ కల్పించే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. టైటిల్‌ను నిర్ధారించే హక్కు రెవెన్యూ శాఖకు లేదని, కోర్టు ఇచ్చే ఉత్తర్వులకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అప్పటి వరకు ఆ భూమిలోకి ఎవరూ వెళ్లకూడదని హెచ్చరించారు.