వెనుకంజ
ABN , Publish Date - Apr 16 , 2026 | 02:25 AM
ఇంటర్మీడియెట్ పరీక్షా ఫలితాల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులు వెనుకంజ వేశారు. బుధవారం ఫలితాలు విడుదలయ్యాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఉత్తీర్ణత సాధనలో రాష్ట్ర సగటు కంటే జిల్లా విద్యార్థులు వెనుకబడ్డారు.
సెకండియర్‌లో 74.9శాతం ఉత్తీర్ణత
రాష్ట్రంలో ఉమ్మడి జిల్లా 17వ స్థానం
ఫస్టియర్‌లో 19వ స్థానం
బాలికలదే పైచేయి
అత్యుత్తమ మార్కులతో సత్తా చాటిన పలువురు విద్యార్థులు
ఇంటర్మీడియెట్ పరీక్షా ఫలితాల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులు వెనుకంజ వేశారు. బుధవారం ఫలితాలు విడుదలయ్యాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఉత్తీర్ణత సాధనలో రాష్ట్ర సగటు కంటే జిల్లా విద్యార్థులు వెనుకబడ్డారు. ఫలితాల్లో బాలుర కంటే బాలికలే పైచేయి సాధించారు. ప్రభుత్వ కళాశాలలు కూడా ఉత్తీర్ణత విషయంలో చతికిలబడ్డాయి.
ఒంగోలు విద్య, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి) : ఇంటర్ ఉత్తీర్ణతలో ఉమ్మడి జిల్లా విద్యార్థులు వెనుకబడ్డారు. రాష్ట్రస్థాయిలో మన జిల్లా స్థానం బాగా పడిపోయింది. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో విద్యార్థులు రాష్ట్ర సగటు కంటే ఆరు శాతం తక్కువ ఉత్తీర్ణత సాధిం చారు. గత ఏడాది రాష్ట్రంలో 10వ స్థానంలో నిలవగా ఈ ఏడాది 17వ స్థానానికి దిగజారింది. 18,394 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 13,785 (74.9శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. జనరల్ విద్యా ర్థులు 16,842 మందికి 12,785 మంది (76శాతం), ఒకేషనల్ విద్యా ర్థులు 1,552 మందికి వెయ్యి (64శాతం) మంది పాసయ్యారు. బాలుర కంటే బాలికలు 13శాతం అధికంగా ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్రస్థాయి కంటే 4.5శాతం తక్కువనే సాధించారు. బాలికలు 9,389 మందికి 7,378 మంది (78.56శాతం), బాలురు 8,256 మందికి 5,409 మంది(65.5శాతం) మంది పాసయ్యారు.
ప్రథమ సంవత్సరంలోనూ అంతే
ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సర ఫలితాల్లోనూ జిల్లా విద్యార్థులు వెనుకబడే ఉన్నారు. గత ఏడాది 63శాతం కంటే ఐదుశాతం అదనంగా 68శాతం ఉత్తీర్ణత సాధించారు. కానీ రాష్ట్రస్థాయిలో గతేడాది 10వస్థానంలో నిలిచిన జిల్లా ఈ ఏడాది 19వ స్థానానికి దిగజారింది. ఈ ఏడాది 21,237 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 14,458 మంది ఉత్తీర్ణులయ్యారు. జనరల్ విద్యార్థులు 19,254కు 13,520 మంది (70శాతం), ఒకేషనల్ విద్యార్థులు 1,983కు 938మంది(47శాతం) మంది పాసయ్యారు. ఉత్తీర్ణతలో బాలురు కంటే బాలికలే పైచేయి సాధించారు. బాలికలు 72.6శాతం మంది ఉత్తీర్ణులు కాగా, బాలురు 12.5శాతంతో తక్కువగా 59.9శాతం మంది మాత్రమే పాసయ్యారు. ప్రభుత్వ కళాశాలల్లో 45.5, ఏపీమోడల్ స్కూళ్లలో 70శాతం, హైస్కూలు ప్లస్‌లో 29.6, కేజీబీవీలో 72శాతం, ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌లో 86శాతం, ఏపీటీడబ్ల్యూఆర్‌లో 42శాతం, ఎయిడెడ్‌లో 10శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. కళాశాలల వారీగా పరిశీలిస్తే జీజేసీ పొన్నలూరు 71.6, త్రిపురాంతకం 69 మర్రిపూడి 68, తాళ్లూరు 68, ఏపీ మోడల్ స్కూళ్లలో.. దర్శి 88.8, రాచర్ల 80.0, కనిగిరి 67.5శాతం, హైస్కూలు ప్లస్‌లో కే.ఉప్పలపాడు 50, కేఎల్‌ఎన్‌నగర్ 46, కరవది 44, కేజీబీవీల్లో దొనకొండ 97, పుల్లలచెరువు 96, ముండ్లమూరు 91, ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌లో చీమకుర్తి 100, కొండపి 97, దూపాడు 90శాతం ఉత్తీర్ణత సాధించారు.
ప్రభుత్వ కళాశాలల్లో తక్కువ ఉత్తీర్ణత
ప్రైవేటు యాజమాన్యంలోని కళాశాలలతో పోల్చుకుంటే ప్రభుత్వ యాజమాన్యాల్లోని కళాశాలలు ఉత్తీర్ణత సాధనలో చతికిలబడ్డాయి. ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులకు ప్రత్యేకంగా సంకల్ప్ కార్యక్రమం నిర్వహించినా 57శాతం మంది మాత్రమే పాసయ్యారు. ప్రభుత్వ కళాశాలల్లో 1,584మందికి 910, ఏపీ మెడల్ స్కూళ్లు 402కు 303 మంది (75శాతం), హైస్కూలు ప్లస్ 146కు72 (49శాతం), కేజీబీవీల్లో 561కి 418మంది (74.5శాతం), ఏపీఎస్‌డబ్ల్యూఏఆర్‌లో 655కు 594 మంది(90.6శాతం), ఏపీటీడబ్ల్యూఆర్‌లో 95కు 44 మంది (46శాతం), ఎయిడెడ్‌లో 127కు 49మంది(38.5శాతం) మొత్తం 669మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
ప్రైవేటు విద్యార్థుల హవా
ఇంటర్మీడియేట్ పరీక్షా ఫలితాల్లో ప్రైవేటు కళాశాలల విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో మెరిశారు. జిల్లా కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేశారు. ఉత్తీర్ణతలో రాష్ట్రంలో 17, 19 స్థానాల్లో నిలిచినా మార్కుల సాధనలో మాత్రం సత్తాచాటారు. ఇంటర్మీడియేట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ఎంపీసీలో 991/1000, బైపీసీలో 991/1000 మార్కులు సాధించి జిల్లాలో టాపర్లుగా నిలిచారు. మొదటి సంవత్సరం ఫలితాల్లో ఎంపీసీలో 467/470, బైపీసీలో 452/455, ఎంఈసీలో 490/500 మార్కులతో రాష్ట్ర స్థాయిలో ముందున్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను కళాశాలల యాజమాన్యాలు అభినందించాయి. ఈ సందర్భంగా కళాశాలల వద్ద బాణసంచా పేల్చి సందడి చేశారు.