మత్స్యకారుల బతుకులకు భద్రత కరువు
ABN , Publish Date - Mar 23 , 2026 | 01:04 AM
కడలి తల్లినే నమ్ముకుని వేట సాగించడమే జీవనాధారం. బతుకుదెరువు కోసం రోజులు తరబడి కుటుంబాలను విడిచి కడలితోనే సావాసం వారి దినచర్యలో భాగం.
వాడరేవు(చీరాల), మార్చి22 (ఆంధ్రజ్యోతి) : కడలి తల్లినే నమ్ముకుని వేట సాగించడమే జీవనాధారం. బతుకుదెరువు కోసం రోజులు తరబడి కుటుంబాలను విడిచి కడలితోనే సావాసం వారి దినచర్యలో భాగం. అయితే అనుకోని ఘటనలు జరిగితే బాధిత కుటుం బాల పరిస్థితి అగమ్య గోచరమే.
జిల్లాలో పెదగంజాం నుంచి రేపల్లె వరకు సుమారు 63 మత్స్యకార గ్రామాలున్నాయి. వీటిల్లో వేటకు అనుమతులు కలిగిన బోట్లు 2852 ఉన్నాయి. అయితే వీరు నిత్యం వేట సమయం ముగిశాక వారి బోట్లును భద్రపరచుకునేందుకు అతికష్టం మీద అదనపు వాహనాల సాయంతో ఒడ్డుకు చేర్చుతున్నారు. అయితే నిజాంపట్నం పరిధిలోని బోట్లకు ఆ పరిస్థితి లేదు.
దెబ్బతింటున్న బోట్లు
బోట్లను నిత్యం ఒడ్డుకు తీసుకురావాల్సి రావడంతో అవి వేగంగా దెబ్బతింటున్నాయి. దీంతో వేటకు అంతరాయం ఏర్పడుతోంది. దీంతో నిత్యంవేటకు వెళ్లేందుకు ముందు బోటుకు అతుకులు వేసుకుని బతుకు బండి లాగాల్సి వస్తుంది. ప్రస్తుతం ఒకరకమైన బోటును తయారీ చేసేందుకు తక్కువలో తక్కువ రూ.5 లక్షలు వరకు ఖర్చు అవుతుంది. ఈ నేపథ్యంలో అప్పటికే వివిధ రకాల రుణాలు, అప్పులుతో మత్స్య కారుడు బోటును ఏర్పాటు చేసుకుంటున్నాడు. తీరా బోటు ఏర్పాటు చేసుకున్న తర్వాత మరమ్మతుల భారం తడిచి మోపెడవుతోంది. సముద్రంలో లంగర్ వేసుకునేందుకు సక్రమమైన వసతి లేకపోవడంతో ఈ పరిస్థితి వస్తోందని వారు వాపోతున్నారు.
ప్రజాప్రభుత్వంపైనే ఆశలు
1990- 95 వరకు బోట్లకు బీమా ఉంది. దీంతో దెబ్బ తిన్న, ప్రమాదాలబారిన పడిన బోట్లుకు ఎంతోకొంత ఉపశమనం ఉండేది. అయితే అప్పట్లో ఆచరణలో సమస్యలు రావడంతో దీన్ని తొలగించారు. ఈక్రమంలో ఇప్పుడు మత్స్యకారులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రజాప్రభుత్వం బోటుకు, ప్రమాదబారిన పడిన మత్స్యకారునికి భరోసా కల్పిస్తూ బీమా అమలు చేయాలని కోరుతున్నారు..
హార్బర్‌తో ప్రయోజనాలు..
జిల్లాలో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఆ హార్బర్‌లో సుమారు 2 వేల బోట్లు నిలుపుకొనే అవకాశం ఉంది. తద్వారా రూ.లక్షలు వెచ్చించి కొనుగోళ్లు చేసిన బోట్లుకు భరోసా ఉంటుంది. ఈక్రమంలోనే హార్బర్ ఏర్పాటుకు అనుకూలంగా ప్రభుత్వం డీపీఆర్(డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్)లు కూడా సిద్ధం చేస్తోంది. అనుబంధంగా వివిధ వ్యాపార సముదాయాలతో పాటు పెట్రోల్ బంకులు, ఐస్ ఫ్యాక్టరీ లు, బోట్లు మరమ్మతులు చేపట్టే కార్ఖానాలు, తదితర అనుబంధ పరిశ్రమలు ఏర్పడేందుకు అవకాశం ఉంది. అంతేకాకుండా బోట్లు నిలిపేందుకు లంగర్‌లకు అనుకూలంగా ఉంటుందనే కారణంగా గతంలోనే కేంద్ర బృందం హార్బర్ నిర్మాణం కోసం అధ్యయనం కూడా చేసింది. అయితే ఇది ప్రతిపాదనల స్థాయి నుంచి ముందుకు పోలేదు. అయితే ఇటీవల అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే కొండయ్య హార్బర్ ప్రస్తావన తెచ్చారు. దీంతో ప్రజల్లో ఒకింత ఆశ మళ్లీ చిగురించింది. స్థానిక శాసనసభ్యులు ఎంఎం కొండయ్య, అలాగే ముఖ్యమంత్రి పని తీరుపై నమ్మకమున్నా, కార్యచరణ నేటికీ ఆలస్యం కావడంపై ప్రజల్లో అసహనం పుట్టుకొస్తోంది. ఇప్పటి కైనా నిర్మాణాలు ప్రారంభించాలని మత్స్యకార కుటుం బాలు వేడుకుంటున్నాయి.