Share News

ఎంఐజీ లే అవుట్‌ ప్లాట్ల విక్రయానికి కొరవడిన ప్రచారం

ABN , Publish Date - Jun 16 , 2026 | 11:59 PM

కందుకూరు మున్సిపాలిటీకి ఆర్థిక పరిపుష్టి కల్పించటం, మధ్యతరహా ఆదాయ వర్గాల ప్రజలకు అందుబాటు ధరలో నివాసస్థలం అందించటమే లక్ష్యంగా ఏర్పాటైన ఎంఐజీ లే అవుట్‌ లక్ష్యానికి అధికారులు తూట్లుపొడుస్తున్నారు.

ఎంఐజీ లే అవుట్‌ ప్లాట్ల విక్రయానికి కొరవడిన ప్రచారం
జీ ప్లస్‌ త్రీ గృహసముదాయాల వద్ద అభివృద్ధి చేస్తున్న ఎంఐజీ లే అవుట్‌

నాలుగేళ్లక్రితం నిర్ణయించిన ధరకన్నా గజానికి రూ.1200 తగ్గించి బిడ్డింగ్‌

తొలి విడత ప్రైమ్‌ ప్లాట్లను నామమాత్రం పోటీతో కైవసం చేసుకున్నట్లు ఆరోపణలు

కందుకూరు మున్సిపాలిటీ ఆదాయానికి గండి

కందుకూరు, జూన్‌ 16(ఆంధ్రజ్యోతి) : కందుకూరు మున్సిపాలిటీకి ఆర్థిక పరిపుష్టి కల్పించటం, మధ్యతరహా ఆదాయ వర్గాల ప్రజలకు అందుబాటు ధరలో నివాసస్థలం అందించటమే లక్ష్యంగా ఏర్పాటైన ఎంఐజీ లే అవుట్‌ లక్ష్యానికి అధికారులు తూట్లుపొడుస్తున్నారు. ఈ ప్లాట్లకు ధర నిర్ణయించటంలో, ప్రజలకు వాటిని అందించటంలో కనీస బాధ్యతను విస్మరించారు. తమకేమీ పట్టదన్నట్లు వ్యవహరించటంతో ప్రజలకు పూర్తిస్థాయిలో సమాచారం లేకుండానే తొలిదశ ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌ పూర్తయింది. ప్లాట్ల విక్రయం ద్వారా ఎంత ఆదాయం వస్తే మున్సిపాలిటీకి అంత ఆర్థిక పరిపుష్టి లభిస్తుంది. అన్నివర్గాల ప్రజలకు ప్లాట్ల విక్రయం గురించి తెలిసేలా చూడాల్సిన అధికారులు కనీసం అడిగిన వారికి కూడా తమకేమీ తెలియదు అంతా నుడా అధికారులు చూస్తున్నారన్న సమాధానంతో బాధ్యతల నుంచి తప్పుకున్నారు. దీంతో ఈ లేఅవుట్‌లో ఉన్న కార్నర్‌ ప్లాట్లు, నార్త్‌ ఈస్ట్‌ ప్లాట్లు, ప్రైమ్‌ ప్లాట్లను నామమాత్రపుపోటీతో అతికొద్దిమంది కైవసం చేసుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తక్కువ ధరకే మంచి ప్లాట్లు వస్తుండటంతో ఆర్థికంగా స్థితిమంతులు ఒక్కొక్కరు ఐదారు ప్లాట్లు బుక్‌ చేసుకున్నారన్న విమర్శలూ బహిరంగంగా వినిపిస్తున్నాయి. తీరా ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌ పూర్తయ్యాక విషయం తెలుసుకున్న మధ్యతరహా ఆదాయవర్గాల వారు ఇదెక్కడి చోద్యం ఎవరికీ తెలియకుండా బిడ్డింగ్‌ పూర్తిచేసేశారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎంఐజీ లే అవుట్‌ రూపకల్పన ఇలా..

పట్టణంలోని జీప్లస్‌ త్రీ గృహాల సముదాయం సమీపంలో దాదాపు 23 ఎకరాలను ఎంఐజీ లే అవుట్‌గా అభివృద్ధి చేసి విక్రయించేందుకు అప్పటి ప్రభుత్వం అనుమతించింది. ఈ ప్లాట్ల విక్రయం ద్వారా వచ్చే మొత్తం ఆదాయాన్ని కందుకూరు పట్టణ అభివృద్ధికే వినియోగించుకునేలా అనుమతి ఇచ్చారు. మిడిల్‌ ఇన్‌కమ్‌ గ్రూప్‌(ఎంఐజీ) అంటే మధ్యతరహా ఆదాయం ఉండే ప్రజలకు అందుబాటు ధరలో నివాస స్థలం విక్రయించటం, వచ్చే సొమ్ముతో మున్సిపాలిటీకి ఆర్థిక పరిపుష్టి కల్పించటం ఈ లేవుట్‌ ఏర్పాటు లక్ష్యం. మున్సిపల్‌ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రస్తుతం అమలవుతున్న విధానంలో ఇటు ప్లాట్లు మధ్యతరహా ఆదాయ వర్గాలకు దక్కటం లేదు, అటు ఆశించిన స్థాయిలో మున్సిపాలిటీకి ఆదాయమూ రావటం లేదన్న అసంతృప్తి వ్యక్తమవుతోంది.


నిబంధనలకు తిలోదకాలు

ఎంఐజీ లే అవుట్‌ మధ్యతరహా ఆదాయ వర్గాల వారికి ఉద్దేశించినది కాబట్టి ఇందులో అధికాదాయ వర్గాల వారికి అవకాశం కల్పించకూడదు. అంటే ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ చెల్లించే వారు ఇప్పటికే పట్టణంలో ఖరీదైన విల్లాలు, నివాస భవనాలు ఉన్నవారికి ఈ లేఅవుట్‌లో ప్లాట్లు కొనుగోలుకు అవకాశం ఇవ్వకూడదు. ఒకరికి ఒక నివాస స్థలం కొనుగోలుకే అవకాశం ఇవ్వాలి తప్ప ఒకరే ఐదారు ప్లాట్లు కొనుగోలు చేసుకోవటాన్ని అనుమతించకూడదు. ప్లాట్లు విక్రయించగా వచ్చే మొత్తంలో 40 శాతం అభివృద్ధి పనులు చేస్తున్న నుడాకు దక్కనుండగా మిగిలిన 60 శాతం మున్సిపాలిటీ ఖజానాకు జమ అవుతుంది. ఈ లేవుట్‌ విక్రయాల ద్వారా మున్సిపాలిటీకి రూ. 30 కోట్ల మేర ఆదాయం వస్తుందని ఆశించగా ప్రస్తుతం మొత్తం ప్లాట్లు విక్రయించబడినా రూ. 20 కోట్లకు మించి వచ్చే పరిస్థితి కనిపించటం లేదు.

అప్పట్లో గజం రూ.6,999 ప్రస్తుతం గజం రూ.5,800

ఎంఐజీ లేఅవుట్‌లో అభివృద్ధి పనులు నిర్వహించే బాధ్యతను నుడాకు అప్పగించారు. లేఅవుట్‌లో మెరకతోలటం, కచ్చా రోడ్లు ఏర్పాటు, డ్రెయిన్ల నిర్మాణం లాంటి పనులు అప్పటి ప్రభుత్వ హయాంలో జరిగాయి. లే అవుట్‌కు బిడ్డింగ్‌ కూడా తెరిచారు. లెవలింగ్‌కు తోలిన మట్టి సుద్దమట్టి అన్న విమర్శలు రావటం, అభివృద్ధి పనులు తగు నాణ్యతతో జరగలేదన్న విమర్శలకు తోడు అప్పట్లో నిర్ణయించిన ధర వాస్తవ మార్కెట్‌ ధరకన్నా ఎక్కువగా ఉందన్న ఆలోచనతో ఈ బిడ్డింగ్‌కు స్పందన కరువైంది. ఈ లే అవుట్‌లో మొత్తం 292 ప్లాట్లు వివిధ కొలతల్లో ఉన్నాయి. 147, 200, 240 గజాల కొలతల్లో అధికశాతం ప్లాట్లు ఉండగా కొన్ని ప్లాట్లు నిర్ధిష్టమైన కొలతలు లేకుండా ఉన్నాయి. అప్పట్లో కేవలం 32 ప్లాట్లను మాత్రమే బుక్‌ చేసుకున్నారు. అందులో 12మంది మాత్రమే గజం రూ.6999 ధర ప్రకారం రిజిస్ట్రేషన్‌ చేయించుకుని మొదటి ఇన్‌స్టాల్‌మెంట్‌ కట్టారు. మిగిలిన వారు ఒక్కొక్కరు లక్ష రూపాయలు అడ్వాన్స్‌ చెల్లించి బుక్‌ చేసుకున్నారు. నాలుగేళ్లక్రితం గజం రూ.6999 ధర కొంత ఎక్కువే అనిపించినా ప్రస్తుతం పట్టణంలో పెరిగిపోయిన నివాసస్థలాల ధరల ప్రకారం చూస్తే ఆ ధర తక్కువే. అనూహ్యంగా గజం రూ.1200 తగ్గించేసి కేవలం రూ.5800 నిర్ణయించారు. సరైన ప్రచారం లేకుండా ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌ పూర్తిచేయటంతో అతికొద్దిమంది మాత్రమే పోటీరాకుండా నుడా నిర్ణయించిన ధరకే 90 ప్రైమ్‌ ప్లాట్లను కైవసం చేసుకున్నారు. మిగిలిన 169 ప్లాట్లకు వచ్చే నెలలో ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌ నిర్వహించేందుకు నుడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రచారలోపం లేకుండా చూస్తాం

పవన్‌కుమార్‌, నుడా అధికారి

లే అవుట్‌పై ప్రజల్లో ప్రచారం జరిగేలా చూసుకోవాల్సిన బాధ్యత మున్సిపల్‌ అధికారులది. పోటీపెరిగితే ఆదాయం వచ్చేది. తొలిదశ బిడ్డింగ్‌ పూర్తయి అనేకమంది తొలి ఇన్‌స్టాల్‌మెంట్‌ కూడా చెల్లించేశారు. వచ్చే నెలలో మిగిలి ఉన్న 169 ప్లాట్లకు ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌ జరుపుతాం. అప్పుడు ఈ సమస్య రాకుండా విస్తృతంగా ప్రచారం జరిగేలా చూస్తాం. లే అవుట్‌లో ప్రస్తుతం అంతర్గత రోడ్లు, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజి, విద్యుత్‌ తదితర అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి.

Updated Date - Jun 16 , 2026 | 11:59 PM