Share News

మండే ఎండలో కూలీల కష్టం

ABN , Publish Date - May 19 , 2026 | 03:20 AM

ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలు వేసవి ఉష్ణోగ్రతలతో విలవిల్లాడుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు వడగాలులు వీస్తుండటంతో పని ప్రదేశాలలో తీవ్ర ఇబ్బందిపడుతున్నారు.

మండే ఎండలో కూలీల కష్టం
బల్లికురవ వద్ద మండుటెండలో ఉపాధి పనులు చేస్తున్న కూలీలు

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

బల్లికురవలో అత్యధికంగా నమోదు

ఉపాధి పనుల వద్ద కనిపించని వసతులు

గతేడాది పనులు చేస్తూ నలుగురు మృతి

తాజాగా సోమవారం వడదెబ్బతో ఒకరు

అక్రమాల కట్టడికి రోజుకు రెండుసార్లు ఫొటోలు

అందుకోసం అక్కడే వేచి ఉంటున్న కూలీలు

మంచినీరు. నీడ, ప్రాఽథమిక చికిత్స కిట్‌లు నిల్‌

ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలు వేసవి ఉష్ణోగ్రతలతో విలవిల్లాడుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు వడగాలులు వీస్తుండటంతో పని ప్రదేశాలలో తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. వారికి కనీసం మంచినీరు, నీడతోపాటు ప్రాథమిక చికిత్స కిట్‌లు కూడా అందుబాటులో లేవు. దీంతో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. బల్లికురవ ప్రాంతంలో ఎక్కువభాగం కొండలు ఉండటంతో అక్కడ జిల్లాలోనే అత్యధికంగా 44 డిగ్రీలపైన ఎండలు కాస్తున్నాయి. గతేడాది వడదెబ్బతో నలుగురు మృతిచెందగా, సోమవారం మల్లాయపాలెంలో ఒక కూలీ పని ప్రదేశంలో కుప్పకూలాడు.

బల్లికురవ, మే 18 (ఆంధ్రజ్యోతి) : ఉపాధి కూలీలను ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి. పని ప్రదేశంలో సరైన వసతులు లేని కారణంగా వారికి రక్షణ కరువైంది. దీంతో పలువురు వడదెబ్బకు గురవుతున్నారు. అధికారులు కూడా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలో మాదిరిగా కాకుండా ఉపాధి హామీ పథకం పనులలో అక్రమాల కట్టడికి ప్రభుత్వం కూలీలు పనులకు వెళ్లే సమయంలో ఒకసారి వ్యక్తిగతంగా ఫొటో, పనులు చేసిన నాలు గు గంటల తర్వాత గ్రుపు ఫొటో తీయాల్సి వస్తుం ది. దీంతో కూలీలు ఫొటోలు తీసే వరకు పనుల వద్దే ఉంటూ తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. మండు తున్న ఎండలతో కూలి పనులు అంటేనే భయపడు తున్నారు. కుటుంబాలు గడవని నిరుపేదలు ఎండ ల్లోనే పనులు చేస్తూ పోరాటం సాగిస్తున్నారు.

ప్రత్యేక అలవెన్సు కరువు

బల్లికురవ మండలంలోని మొత్తం 21 గ్రామ పంచాయతీలలో పది వేల కుటుంబాలకు జాబ్‌ కార్డులు ఉన్నాయి. వీటి ద్వారా కూలీలు ఉపాధి పనులకు వెళ్తున్నారు. వ్యవసాయ సీజన్‌ పనులు ముగియగానే గ్రామాల్లోనే ప్రభుత్వం చేపట్టే ఉపాధి పనులే వీరికి ఆధారం. గతంలో వేసవి ప్రత్యేక అల వెన్స్‌లు కూడా అందించి పనులకు కూలీలను రాబ ట్టేవారు. ఈ ఏడాది నుంచి ఉపాధి పనుల్లో కొత్త చట్టం అమలులోకి వచ్చింది. గతంలో బోగస్‌ మస్టర్లతో పెద్దఎత్తున అక్రమాలు చోటుచేసుకు న్నాయి. దీంతో కేంద్రప్రభుత్వం పనులు చేసే కూలీల ఫొటోలు రెండుసార్లు తీసి అప్‌లోడ్‌ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. గతంలో కొంతసేపు పనులు చేసి మస్టర్‌ వేయించుకుని కూలీలు ఇళ్లకు వచ్చేవారు. ఇప్పడు కచ్చితంగా నాలుగు గంటలు పనులు చేయాల్సి ఉంది. దీంతో వేసవి ఎండలతో తీవ్ర ఇబ్బందిపడుతున్నారు.

మధ్యాహ్నం సమయం కావడంతో..

ఉదయం 7 గంటలకు పనులకు వెళుతున్న కూలీలు 11గంటల వరకు అక్కడే ఉండి పనులు చేసి ఫొటోలు తీయించుకొని ఇళ్లకు చేరే సరికి మధ్యాహ్నం 12 గంటలు దాటుతోంది. దీంతో వడగాలిలో వారు నడిచి వస్తూ వడదెబ్బకు గురవుతున్నారు. ఎండలతో కూలీల హాజరు కూడా అంతంతమాత్రంగానే ఉంటోంది. బల్లికురవ మండలంలో రోజుకు 1,500 మందే పనులకు వస్తున్నారు. గతేడాది కూడా ఎండ వేడిమికి పనుల వద్దే అనారోగ్యంకు గురై నలుగురు మృతి చెందారు. దీంతో ఎండా కాలం ఉపాధి పనులు అంటేనే భయపడుతున్నారు. పైగా ఉపాధి పనుల వద్ద కనీస వసతులు ఉండటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పని ప్రదేశాలలో మంచినీరు, నీడకు టెంట్‌లు, ఎవరైన అనారోగ్యంకు గురైతే ఫస్టు ఎయిడ్‌ కిట్‌లను అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు. అలానే పనులకు వచ్చిన కూలీలకు ఒకసారే ఫొటో తీయాలని నాలుగు గంటల సమయం వరకు ఉన్న ఫొటోను రద్దుచేయాలంటున్నారు. వేసవి ఎండలు ముగిసే వరకు అధికారులు పనుల వద్ద నిబంధనలను సడలింపు చేయాలని వారు కోరుతున్నారు.

అగ్నిగుండాన్ని తలపిస్తున్న బల్లికురవ మండలం

బల్లికురవ మండలంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు గ్రామాలలో ఎండలు అగ్నిగుండాన్ని తలపించేలా సెగలు కక్కుతున్నాయి. స్థానికంగా కొండలు అధికంగా ఉండటంతో ఎండల ప్రభావం అధికంగా ఉంటటోంది. ప్రతిరోజూ జిల్లా మెత్తం మీద అక్కడ అత్యధికంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు వడగాలులతో ఇళ్ల నుంచి బయటకు రావాలన్నా భయపడుతున్నారు.

వడ దెబ్బతో ఉపాధి కూలి మృతి

బల్లికురవ మండలంలోని మల్లాయపాలెంలో వడ దెబ్బకు ఉపాధి కూలి పాలపర్తి వెంకటేశ్వర్లు (73) మృతి చెందాడు. అందిన సమాచారం మేరకు.. సోమవారం గ్రామంలో ఉన్న చెరువులో పనులు చేస్తుండగా వెంకటేశ్వర్లు ఒక్కసారిగా ఎండ ప్రభావంతో అపస్మారక స్థితిలోకి వెళ్లారు. తోటి కూలీలు వైద్యం కోసం తరలించేందుకు ప్రయత్నిస్తుండగా అప్పటికే మృతి చెందాడు. ఆయనకు భార్య, నలుగురు కుమారులు ఉన్నారు. కూలి మృతిపై ఉన్నతాధికారులకు సమాచారం అందించామని పనులు చేయిస్తున్న ఉపాధి సిబ్బంది తెలిపారు.

Updated Date - May 19 , 2026 | 03:20 AM