Share News

ఖరీఫ్‌ ఖాళీ

ABN , Publish Date - Sep 03 , 2026 | 02:57 AM

జిల్లాపై ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా చూపుతోంది. సెప్టెంబరు వచ్చినా చినుకు జాడ కరువైంది. ఖరీఫ్‌ సీజన్‌ను కరువు కమ్మేసింది. ఏకంగా 70.30శాతం లోటు వర్షపాతం ఏర్పడగా మెట్ట పంటల సాగుకు కీలకమైన జూలై, ఆగస్టు నెలల్లో వర్షాభావం మరింత అధికమైంది.

ఖరీఫ్‌ ఖాళీ
కొప్పోలు సమీపంలోని పంటలు సాగుకు నోచుకోక ఖాళీగా కనిపిస్తున్న పొలాలు

జిల్లాపై తీవ్రంగా ఎల్‌నినో ఎఫెక్ట్‌

70.30శాతం లోటు వర్షపాతం

మెట్ట పైర్లకు కీలకమైన జూలై, ఆగస్టు

నెలల్లో మరీ దారుణమైన పరిస్థితి

పంటల సాగుపై తీవ్ర ప్రభావం

11.81శాతం విస్తీర్ణంలోనే విత్తనం

వేసినవీ ఎండిపోతున్న వైనం

కంది, పత్తి సాగుకు మించిన సమయం

వరి సాగుకు నీటి లభ్యత కరువు

జిల్లావ్యాప్తంగా బెట్ట వాతావరణం

జిల్లాపై ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా చూపుతోంది. సెప్టెంబరు వచ్చినా చినుకు జాడ కరువైంది. ఖరీఫ్‌ సీజన్‌ను కరువు కమ్మేసింది. ఏకంగా 70.30శాతం లోటు వర్షపాతం ఏర్పడగా మెట్ట పంటల సాగుకు కీలకమైన జూలై, ఆగస్టు నెలల్లో వర్షాభావం మరింత అధికమైంది. ఫలితంగా పంటల సాగు ముందుకు సాగడం లేదు. కేవలం 11.82శాతం విస్తీర్ణంలోనే ఇప్పటివరకు పైర్లు వేయగా వర్షాలు లేక, భూగర్భ జలం అడుగంటిపోయి, బోర్లలో నీరు అందక అవి కూడా ఎండిపోతున్నాయి. ఇప్పటికే ఖరీఫ్‌లో ప్రధానమైన కంది, పత్తి సాగుకు సమయం మించిపోయింది. ఈ నెలాఖరు వరకూ వరి సాగుకు గడువు ఉన్నప్పటికీ నీటి లభ్యత లేక నాట్లు వేసే పరిస్థితి కనిపించడం లేదు.

ఒంగోలు, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు ఖరీఫ్‌ సీజన్‌. ఈ నాలుగు నెలల్లో ప్రస్తుత జిల్లా పరిధిలో సుమారు 55,774 హెక్టార్లలో వివిధ రకాల పంటల సాగు చేస్తారు. అందులో ఈ సమయానికి ఇంచుమించు 40వేల హెక్టార్లలో సాగు జరుగుతుంది. మే ఆఖరులో కురిసే వర్షాలతో దుక్కులు దున్ని తొలకరి సాగుగా పిలిచే వాటిలో నువ్వు విత్తనం చల్లడం ప్రారంభిస్తారు. జూన్‌లో పెసర, సజ్జ, జొన్న వంటి పంటలు సాగు చేస్తారు. జూలై, ఆగస్టులలో ప్రధానమైన కంది, పత్తితోపాటు మొక్కజొన్న, మినుము, వేరుశనగ ఇతరత్రా వేస్తారు. బోర్ల కింద వరి సాగును కూడా ఆరంభించి సెప్టెంబరులో అధికంగా వేస్తారు. అలా జూన్‌ నుంచి ఆగస్టు వరకు వర్షాధార పంటలు, సెప్టెంబరులో వరి, ఇతరత్రా నీటి ఆధారిత పంటలను సాగు చేస్తారు. అయితే ఈ ఏడాది సీజన్‌ ఆరంభం నుంచి వర్షం సరిలేదు. ఎల్‌నినో జిల్లాపై తీవ్ర ప్రభావం చూపడంతో నైరుతి రుతపవనాలు ముఖం చాటేశాయి.

అంతా లోటే!

జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌ అయిన జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు సుమారు 366.20 మి.మీ వర్షపాతం నమోదవుతుంది. అందులో జూన్‌లో 57.10 మి.మీ, జూలైలో 86.90 మి.మీ, ఆగస్టులో 109.60 మి.మీ వెరసి ఈ మూడు నెలల్లో 253.60 మి.మీ... అలాగే సెప్టెంబరులో మిగిలిన 112.60 మి.మీ నమోదవుతుంది. అయితే ఈ ఏడాది జూన్‌ నుంచి ఆగస్టు వరకు కురవాల్సిన 253.60 మి.మీ సాధారణ వర్షపాతానికి కేవలం 75.20 మి.మీ మాత్రమే కురిసింది. అలా ఏకంగా 70.30శాతం లోటు వర్షపాతం నమోదైంది. ప్రత్యేకించి మెట్ట సాగుకు అత్యంత కీలకమైన జూలైలో 86.30శాతం, ఆగస్టులో 81.90శాతం లోటు నమోదైంది. అలాగే తొలకరి పైర్లు వేసే జూన్‌లో 23.80శాతం లోటు వర్షపాతం ఉంది. అలా వర్షాలు పడని పరిస్థితితో పంటల సాగుపై తీవ్రంగా పడింది.

సాగు సమయం దాటిపోయింది

ఖరీఫ్‌ సాధారణ సాగు విస్తీర్ణం 55,774 హెక్టార్లకు ఈ సమయానికి 40వేలకుపైగా హెక్టార్లలో సాగు కావాల్సి ఉంది. అయితే అందులో 6,590 హెక్టార్లలోనే సాగు జరిగింది. అంటే సాధారణ విస్తర్ణంలో కేవలం 11.81శాతం విస్తీర్ణంలో మాత్రమే పంటలు పడ్డాయి. అంతేకాక వర్షం లేక, భూగర్భ జలాలు అందక, ఇతర వనరుల్లో నీరు లేక వేసిన పైర్లు కూడా ఎండిపోతున్నాయి. ఈ సీజన్‌లో అత్యధికంగా సాగు జరిగేది 25,440 హెక్టార్ల కంది కాగా ఇప్పటివరకు కేవలం 768 హెక్టార్లు(3.02శాతం) విస్తీర్ణంలో సాగైంది. వరి 10,142 హెక్టార్లకు 2,028 హెక్టార్లు(20శాతం), పత్తి 6,997 హెక్టార్లకు 311 హెక్టార్లు (4.44శాతం), మొక్కజొన్న 3,047 హెక్టార్లకు 1,359, సజ్జ 2,773 హెక్టార్లకు 770, మినుము 1,926 హెక్టార్లకు కేవలం 49 హెక్టార్లకే పరిమితమైంది. గత ఏడాది కూడా ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ ఈ సమయానికి 22,131 హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. ఈ ఏడాది అందులో 30శాతం కూడా సాగు కాలేదు. ఇక ఖరీఫ్‌కు మరో నెల గడువు ఉండగా ఒక్క వరి మినహా ఇతర పంటల సాగుకు సమయం మించిపోయింది. మొత్తం సాధారణ విస్తీర్ణంలో ఇంచుమించు 60శాతం ఉండే కంది, పత్తి పంటల సాగుకు పూర్తిగా సమయం మించిపోగా వరికి గడువు ఉన్న నీటి లభ్యతపై గ్యారంటీ లేక సాగు చేయలేని పరిస్థితి.

ఎండుతున్న పైర్లు

ఎల్‌నినో ప్రభావంతో చినుకు జాడ లేక సాగు తగ్గిపోగా, వేసిన పైర్లు కూడా ఎండిపోతున్నాయి. సుమారు 6,590 హెక్టార్లలో వివిధ పంటలు సాగుకాగా అందులో అధికంగా 2,028 హెక్టార్లలో వరి, 1,359 హెక్టార్లలో మొక్కజొన్న, 982 హెక్టా ర్లలో వేరుశనగ, 770 హెక్టార్లలో సజ్జ ఉన్నాయి. ఆ పైర్లు అన్నీ ఎండిపోతున్నాయి. భవిష్యత్‌లో సాగర్‌ నీటిపై ఆశతో దర్శి, అద్దంకి నియో జకవర్గాల పరిధిలో బోర్ల కింద పలుగ్రామాల్లో వరినాట్లు వేయగా ప్రస్తుతం బోర్లు అడుగంటాయి. సాగర్‌ నీరు రాక వరిపైరు ఎండిపోతోంది. మెట్ట భూముల్లో సాగు చేసిన సజ్జ, కంది, మొక్కజొన్న, ఇతరత్రా అన్ని పైర్ల పరిస్థితి కూడా అలాగే ఉంది. కృష్ణానదిలో నీటి ప్రవాహం లేక సాగర్‌ నీరు ఈ ఏడాది తాగునీటికి మాత్రమేనని ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించడంతో ఇక వరిసాగుకు అవకాశం లేదు. అలా ఈ ఖరీఫ్‌ సీజన్‌ను కరువు కమ్మేయడంతో దాదాపు 90శాతం విస్తీర్ణంలో పంటలు పడే అవకాశం లేకుండాపోయింది. ఆ ప్రభావం గ్రామీణ ప్రాం తాలపై తీవ్రంగా చూపనుంది.

Updated Date - Sep 03 , 2026 | 02:57 AM