ఖరీఫ్ కదలదే!
ABN , Publish Date - Aug 22 , 2026 | 03:16 AM
జిల్లాపై ఎల్‌నినో తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆగస్టు మూడోవారం దాటుతున్నా వేసవిని తలపించే రీతిలో ఎండలు మండుతున్నాయి. మరోవైపు సీజన్ ఆరంభం నుంచి సరైన వర్షం కురిసిన దాఖలాలు లేవు.
జిల్లాపై తీవ్రంగా ఎల్‌నినో ఎఫెక్ట్
66.60శాతం లోటు వర్షపాతం
పది శాతం విస్తీర్ణంలోనే సాగు
ఆ పైర్లు కూడా ఎండుముఖం
ప్రధాన పంటలకు ముగుస్తున్న సమయం
ఒక్కశాతం విస్తీర్ణంలో కూడా సాగు కాని కంది
ఆగస్టు మూడోవారంలోనూ మండుతున్న ఎండలు
తాజాగా రాష్ట్రంలోనే జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు
జిల్లాపై ఎల్‌నినో తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆగస్టు మూడోవారం దాటుతున్నా వేసవిని తలపించే రీతిలో ఎండలు మండుతున్నాయి. మరోవైపు సీజన్ ఆరంభం నుంచి సరైన వర్షం కురిసిన దాఖలాలు లేవు. ఈ ఏడాది జిల్లాలో నైరుతి రుతుపవనాల జాడ దాదాపు కనిపించ లేదు. ఫలితంగా ఇప్పటికే 66.60శాతం లోటు వర్షపాతం నెలకొంది. ఏ ఒక్క ప్రాంతంలోనూ రెండు నెలలుగా ఒక మోస్తరు వాన కురవలేదు. దీంతో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణంలో కనీసం పది శాతంలో కూడా పంటలు పడ లేదు. వేసినవి కూడా ఎండుముఖం పడుతుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
ఒంగోలు, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో చినుకు జాడ కరువైంది. తొలకరి నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది. దీంతో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది. సాధారణంగా ఈ సమయంలో నిత్యం జల్లులు పడుతూ ఆహ్లాదకరమైన వాతావరణంతోపాటు పల్లెలు పచ్చదనంతో కళకళలాడుతుండాలి. అలాంటిది ప్రస్తుతం జిల్లాలోని ఏ ప్రాంతంలో చూసినా మండుతున్న ఎండలు, వేడిగాలులు, పైర్లు లేకుండా ఖాళీగా నెర్రలిచ్చిన భూములు కనిపిస్తున్నాయి. ఒకవేళ ధైర్యం చేసి అక్కడక్కడా పంట వేసినా అవి వాడుముఖం పట్టాయి. అసలు ఖరీఫ్ సాగు విస్తీర్ణమే పది శాతం మించకపోగా ఆ పైర్లు ఎదుగుదల లేక ఎండిపోతున్నాయి. జిల్లాలో జూన్ నుంచి సెప్టెంబరు వరకు ఖరీఫ్ సీజన్ కాగా సుమారు 55,774 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగు చేస్తారు. అందులో అత్యధికంగా 25,440 హెక్టార్లలో కంది, 10,142 హెక్టార్లలో వరి, 6,997 హెక్టార్లలో పత్తి వంటి ప్రధాన పంటలు వేస్తారు. మిగిలిన వాటిలో 3,047 హెక్టార్లలో మొక్కజొన్న, 2,773 హెక్టార్లలో సజ్జ, 2,195 హెక్టార్లలో నువ్వు, 1,926 హెక్టార్లలో మినుము వంటివి వేస్తారు.
కనిపించని నైరుతి ప్రభావం
జిల్లాలో జూన్ నుంచి నైరుతి రుతుపవనాలతో జల్లులు ఆరంభమవుతాయి. అలా సెప్టెంబరు ఆఖరు వరకు 366.0 మి.మీ వర్షపాతం నమోదవుతుంది. అందులో జూన్‌లో 57.10 మి.మీ, జూలైలో 86.9 మి.మీ, ఆగస్టులో 109.6 మి.మీ వెరసి ఆగస్టు ఆఖరుకు 253.60 మి.మీ పడాల్సి ఉంది. ఈ సమయానికి 206.10 మి.మీ కురవాలి. అయుతే ఇప్పటి వరకూ కేవలం 68.50 మి.మీ మాత్రమే వర్షపాతం నమోదైంది. జూన్‌లో 23.80శాతం లోటుతో 43.50 మి.మీ పడగా జూలైలో 86.30శాతం లోటుతో కేవలం 11.90మి.మీ కురిసింది. ఈనెలలో ఇప్పటివరకు 78.40 మి.మీ లోటుతో 13.40 మి.మీ వర్షపాతం నమోదైంది. అలా మొత్తంగా ఈ సీజన్‌లో ఇప్పటికి 66.60 శాతం లోటు వర్షపాతం ఉంది. ఈ ప్రభావం ఖరీఫ్ సీజన్ పంటల సాగుపై తీవ్రంగా పడింది.
అంతా వర్షాధారమే..
ఈ సీజన్‌లో 90శాతం విస్తీర్ణంలో పంటలు వర్షపాతం ఆధారంగా సాగవుతాయి. మే రెండో పక్షంలో పడే చిరుజల్లులతో తొలకరి సాగుకు రైతులు సిద్ధమవుతారు. జూన్‌లో నువ్వు, సజ్జ, పెసర వంటి తొలకరి పైర్లు జొన్న, పిల్లిపెసర ఇతరత్రాలు, పచ్చిరొట్ట ఎరువులుగా పిలిచే జనుము, జీలుగ వంటివి వేస్తారు. ఇక జూన్‌లో కురిసే జల్లులతో దుక్కులు దున్ని ఆ నెలాఖరు నుంచి ఆగస్టు తొలిపక్షం వరకు ప్రధాన మెట్ట పంటలైన కంది, పత్తి విస్తారంగా సాగు చేస్తారు. అలాగే బోర్ల కింద వరి, కొన్ని ప్రాంతాల్లో మొక్కజొన్న, మినుము ఇతరత్రా వేస్తారు. అలా ఈ సమయానికి ఖరీఫ్ సాధారణ విస్తీర్ణంలో కనీసం మూడింట రెండొంతులు విత్తనం పడాలి. అలా ఖరీఫ్ సీజన్ సాధారణ సాగు విస్తీర్ణమైన 55,774 హెక్టార్లలో 35 నుంచి 40వేల హెక్టార్లలో ఈ పాటికి పంటలు సాగు చేయాలి. ప్రత్యేకించి ప్రధాన పంటైన కంది పూర్తిస్థాయిలో విత్తనం పడాలి.
కేవలం పది శాతమే సాగు
ఈ ఏడాది ఇప్పటివరకు కేవలం పది శాతం విస్తీర్ణంలో మాత్రమే పంటలు వేయగలిగారు. వ్యవసాయశాఖ సమాచారం ప్రకారం జిల్లాలో ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 5,592 హెక్టార్లలో మాత్రమే విత్తనం వేశారు. అందులో 1,820 హెక్టార్లలో వరి, 1,229 హెక్టార్లలో మొక్కజొన్న, 982 హెక్టార్లలో వేరుశనగ, 671 హెక్టార్లలో సజ్జ ఉన్నాయి. ప్రధానమైన కంది పంట 25,440 హెక్టార్లకు కేవలం 240 హెక్టార్లలో మాత్రమే వేయగలిగారు. అంటే కంది సాధారణ విస్తీర్ణంలో ఒక్కశాతంలో కూడా విత్తనం పడిన పరిస్థితి లేదు. పైగా ఆ పంట సాగుకు సమయం కూడా మించిపోయింది. మరో ప్రధాన పంటైన పత్తి 6,997 హెక్టార్లకు 4.13 శాతంతో 289 హెక్టార్లలో వేశారు. స్వల్ప విస్తీర్ణంలో సాగైన వరి, మొక్కజొన్న, సజ్జ ఇతరత్రా పైర్లు కూడా ప్రస్తుత వాతావరణానికి ఎండుముఖం పట్టాయి. వేలాది హెక్టార్ల పొలం నెర్రలిచ్చి ఖాళీగా దర్శనమిస్తోంది.
కురిచేడు, కరవదిలో అత్యధిక ఉష్ణోగ్రతలు
దాదాపు రెండు మాసాలుగా సరైన వర్షం అన్నది జిల్లాలో లేకపోవడమే కాక వేసవిని తలపించే రీతిలో ఎండలు మండిపోతున్నాయి. ఆపై వేడిగాలులు వీస్తున్నాయి. జిల్లాలో శుక్రవారం ఎండల తీవ్రత మరింత అధికంగా కనిపించింది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు జిల్లాలో నమోదయ్యాయి. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రత కురిచేడులో 39.69డిగ్రీలు నమోదైంది. రెండో స్థానంలో కూడా జిల్లాలోని ఒంగోలు రూరల్ మండలం కరవదిలో 39.63డిగ్రీల ఎండ కాచింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో కూడా రాష్ట్రంలో అత్యధికంగా కరవదిలో 39.79 డిగ్రీలు నమోదైంది. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో వీవీపాలెంలో రాష్ట్రంలో అత్యధిక గరిష్ఠ ఉష్ణోగ్రత 39.88 డిగ్రీల నమోదైంది. అలా మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు జిల్లా అంతటా ఉష్ణోగ్రతలు 37 నుంచి 40 డిగ్రీల వరకూ ఉన్నాయి.