Share News

కేజీబీవీ సిబ్బంది బదిలీల్లో లొల్లి

ABN , Publish Date - Jun 04 , 2026 | 03:23 AM

ఉమ్మడి జిల్లాలోని కస్తూర్భాగాంధీ విద్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది బదిలీల్లో లొల్లి జరిగింది. బదిలీల నిర్వహణపై విమర్శలు వెల్లువెత్తాయి. కౌన్సెలింగ్‌ విధానంలో బదిలీలు నిర్వహించినా కొందరికి అన్యాయం జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి.

కేజీబీవీ సిబ్బంది బదిలీల్లో లొల్లి

రెండు గ్రూపులుగా విడిపోయిన వైనం

రెండు, మూడు రోజుల్లో రీ కౌన్సెలింగ్‌

జాబితాల తయారీలో తలమునకలు

ఒంగోలు విద్య, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి జిల్లాలోని కస్తూర్భాగాంధీ విద్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది బదిలీల్లో లొల్లి జరిగింది. బదిలీల నిర్వహణపై విమర్శలు వెల్లువెత్తాయి. కౌన్సెలింగ్‌ విధానంలో బదిలీలు నిర్వహించినా కొందరికి అన్యాయం జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. కొందరు తాము కోరుకున్న స్థానాలు కాకుండా ఎక్కడో దూర స్థానాలు కేటాయించారని విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ నేపథ్యంలో బదిలీల్లో అనుకూలమైన స్థానాలు దక్కించుకున్నవారు ఒక వర్గంగా, కోరుకున్న స్థానాలు దక్కనివారు మరో వర్గంగా విడిపోయి లొల్లికి దిగారు. సోమవారం రెండు వర్గాలు కలెక్టర్‌ రాజాబాబును కలిసి తమ గోడును విన్నవించారు. అనుకూలమైన స్థానాలు దక్కినవారు బదిలీలు బాగా జరిగాయని, వీటినే కొనసాగించాలని కలెక్టర్‌ను కోరారు. రెండో వర్గం బదిలీల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని, రద్దు చేసి రీ కౌన్సెలింగ్‌ నిర్వహించాలని పట్టుబట్టారు. టీఎన్‌యూఎస్‌ నాయకులు కూడా జోక్యం చేసుకొని బదిలీల్లో అక్రమాల నేపథ్యంలో రీ కౌన్సెలింగ్‌ నిర్వహించాలని కలెక్టర్‌ను కోరారు. దీంతో రీ కౌన్సెలింగ్‌ నిర్వహించాలని కలెక్టర్‌ నిర్ణయించారు. రెండు రోజుల్లో సీనియారిటీ జాబితాలను సిద్ధం చేసి పూర్తి వివరాలను తనకు సమర్పించాలని కలెక్టర్‌ అదేశించడంతో తదనుగు ణంగా సమగ్రశిక్ష అధికారులు తలమునకలవుతు న్నారు. ఉమ్మడి జిల్లాలోని కేజీబీవీల్లో పనిచేస్తున్న సిబ్బంది 334 మంది బదిలీలకు దరఖస్తులు చేసుకున్నారు. వీరిలో 197 మంది తప్పనిసరిగా బదిలీ కావాల్సినవారు కాగా మిగిలిన వారు అభ్యర్థన మేరకు బదిలీ దరఖాస్తు చేశారు.

అంతా మౌఖికంగానే

కేజీబీవీ బదిలీలకు సంబంధించి సమగ్రశిక్ష ప్రాజెక్టు కార్యాలయం నుంచి ఎటువంటి రాతపూర్వకంగా ఉత్తర్వులు రాలేదు. రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌ కార్యాలయ అధికారుల మౌఖిక ఆదేశాల మేరకు బదిలీలు చేపట్టారు. స్పష్టమైన మార్గద ర్శకాలు లేకపోవడంతో టీచర్ల బదిలీల ఉత్తర్వు ల్లోని కొన్ని అంశాలను ప్రామాణికంగా తీసుకొని స్థానికంగా మార్గదర్శకాలు రూపొందించి కలెక్టర్‌ ఆమోదంతో బదిలీలకు ముందుకు సాగారు. బదిలీ దరఖాస్తుకు కూడా ముందుగా ఎటువంటి ప్రకట నా విడుదల చేయకుండా వాట్సప్‌ గ్రూపుల ద్వారా సమాచారం ఇచ్చి దరఖాస్తులు స్వీకరించారు. ఆతర్వాత సీనియారిటీ జాబితాలు తయారు చేసి కేవలం ఒకరోజు ముం దు దరఖాస్తుదారులకు తెలియజేసి కౌన్సెలింగ్‌కు పిలిచారు. కౌన్సెలింగ్‌కు ముందు దరఖాస్తు చేసిన వారికి ఆప్షన్‌ ఫారం ఇచ్చి ప్రాధాన్యతా క్రమంలో మూడు స్థానాలు కోరుకోమన్నారు. కొందరికి ప్రాధాన్యత క్రమంలో పెట్టిన స్థానాలు కాకుండా ఇతర స్థానాలు కేటాయించడంపై దుమారం రేగింది. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ ఇచ్చే తదుపరి ఆదేశాల తేదీల ప్రకారం రీ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు.

Updated Date - Jun 04 , 2026 | 03:23 AM