నిలకడగా కర్ణాటక పొగాకు మార్కెట్
ABN , Publish Date - Jan 22 , 2026 | 02:52 AM
రాష్ట్రంలో ప్రత్యేకించి దక్షిణాది రీజియన్ల పరిధిలో రానున్న సీజన్ అమ్మకాలపై ప్రభావం చూపే కర్ణాటక పొగాకు మార్కెట్ నిలకడగా సాగుతోంది. ఇప్పటివరకు అక్కడ ప్రస్తుత సీజన్‌లో పంట ఉత్పత్తి అంచనాలో దాదాపు 45శాతంపైగా విక్రయాలు పూర్తయ్యాయి.
ఇప్పటివరకు 8 మిలియన్ కిలోల కొనుగోలు
కిలోకు రూ.287.50 లభించిన సగటు ధర
నిశితంగా పరిశీలిస్తున్న ఇక్కడి రైతులు
గత ఏడాది కన్నా దక్షిణాదిలో తగ్గిన సాగు
బెట్టవాతావరణంతో దిగుబడి తగ్గే అవకాశం
పంటల రక్షణ కోసం నీటి తడులు
ఒంగోలు, జనవరి 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రత్యేకించి దక్షిణాది రీజియన్ల పరిధిలో రానున్న సీజన్ అమ్మకాలపై ప్రభావం చూపే కర్ణాటక పొగాకు మార్కెట్ నిలకడగా సాగుతోంది. ఇప్పటివరకు అక్కడ ప్రస్తుత సీజన్‌లో పంట ఉత్పత్తి అంచనాలో దాదాపు 45శాతంపైగా విక్రయాలు పూర్తయ్యాయి. సగటున కిలోకు రూ.287.50 ధర లభించింది. అక్కడ మార్కెట్ తీరును తొలి నుంచి దక్షిణాదిలోని ప్రకాశం, నెల్లూరు, మార్కాపు రం జిల్లాల రైతులు నిశితంగా పరిశీలిస్తూ పంట సాగు, ఉత్పత్తిపై దృష్టిసారించగా గత ఏడాది కన్నా ప్రస్తుతం ఈ ప్రాంతంలో పంట సాగు తగ్గుదల కనిపిస్తోం. వాతావరణం కూడా సరిగా అనుకూలించక పోవడంతో ఉత్పత్తి గతం కన్నా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏటా రాష్ట్రంలో కంటే కర్ణాటకలో పొగాకు సీజన్ ముందు ప్రారంభమవుతుంది. ఇక్కడ పంట సాగు చేసే సమయానికి అక్కడ కొనుగోళ్లు ప్రారంభమవుతాయి. అక్కడి మార్కెట్ తీరును బట్టి ఇక్కడ పంట సాగులో రైతులు మార్పులు, చేర్పులు చేసుకుంటుండటం సర్వసాధారణం. ఈ ఏడాది కూడా అలాగే సాగుతోంది. ప్రత్యేకంగా దక్షిణాది ప్రాంత రైతులు కర్ణాటక మార్కెట్‌ను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలన చేస్తుంటారు.
ముమ్మరంగా కొనుగోళ్లు
కర్ణాటకలో ప్రస్తుతం ముమ్మరంగా పొగాకు కొనుగోళ్లు సాగుతున్నాయి. అక్కడ 2025-26 సీజన్‌కు 100 మిలియన్ కిలోల పంట ఉత్పత్తికి అనుమతి ఇవ్వగా సుమారు 85 మిలియన్ కిలోల పంట ఉత్పత్తి అంచనా వేసి గత అక్టోబరులో కొనుగోళ్లు ప్రారంభించారు. ప్రారంభ ధర కిలోకు రూ.320 ఇచ్చిన వ్యాపారులు ఇప్పటివరకు సుమారు 38 మిలియన్ కిలోలు కొనుగోలు చేశారు. అయితే గరిష్ఠ ధరలో మాత్రం మార్పు లేదు. అడపాదడపా ఒకటి అరా బేళ్లకు ఒక రూపాయి అదనంగా పలికి గరిష్ఠ ధర రూ.321 కనిపిస్తున్న అధిక బేళ్లకు గరిష్ఠ ధర కిలో రూ. 320 కొనసాగుతోంది. దీంతో సగటు ధర కిలో రూ.287.50 లభించగా తిరస్కరణ బేళ్లు అంతగా లేకపోవడంతో మేలురకంను కూడా అక్కడి రైతులు అధికంగానే అమ్మకాలకు తెస్తున్నారు. అలా కర్ణాటక మార్కెట్ నిలకడగా సాగుతుండగా అక్కడి ధరలలో ఏ మాత్రం పెరుగుదల లేకపోవడం రాష్ట్రంలోని పొగాకు రైతులు, ప్రత్యేకించి దక్షిణాది ప్రాంత రైతులు ఆలోచనలో పడ్డారు. నాణ్యతపరంగా బాగున్న అక్కడ ధరలు పెరగకపోవడం భవిష్యత్‌లో ఈ ప్రాంతంలో ధరలు అంత ఆశాజనకంగా ఉండే అవకాశాలు తక్కువన్న భావన వ్యక్తమవుతోంది. దీనికి తోడు ఇక్కడ ప్రతికూల వాతావరణం కూడా పంట సాగుపై ప్రభావం చూపింది.
గతేడాది కన్నా తక్కువే
ఈ ఏడాది పొగాకు భారీగా సాగవుతుందని తొలుత అంచనా వేసినా ఇప్పటివరకు జరిగిన సాగు విస్తీర్ణం చూస్తే గతేడాది కన్నా తక్కువగానే ఉంది. దక్షిణాదిలోని రెండు రీజియన్లలో గతేడాది 88వేల హెక్టార్లలో పంట సాగుకాగా ఈ ఏడాది 79వేల హెక్టార్లలో మాత్రమే సాగు జరిగింది. ఇక పెద్దగా సాగుకు అవకాశం లేదు. అంతేకాక అక్టోబరులో సంభవించిన మొంథా తుఫాన్‌తో పంట సాగు ఆలస్యం కాగా నవంబరు, డిసెంబరులలో చినుకు జాడ లేక ఉత్పత్తి కూడా తగ్గే అవకాశం కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం దక్షిణాది రైతులు పంట ఉత్పత్తి పెరగకపోతే తీవ్రంగా నష్టపోతామని ఆందోళన చెందుతున్నారు. కర్ణాటక మార్కెట్‌లో ధరలు పెరుగుదల లేకపోవడం స్థానికంగా తోటలు ఆశించిన విధంగా ఎదుగుదల లేక ఉత్పత్తి తగ్గి నష్టపోయే పరిస్థితి కనిపిస్తుండటంతో తోటల రక్షణ కోసం అధిక వ్యయ ప్రయాసాలకోర్చి పలుచోట్ల రైతులు నీటి తడులు పెడుతున్నారు.