వెలవెలబోతున్న కందుకూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం
ABN , Publish Date - Jan 30 , 2026 | 11:18 PM
కందుకూరు సబ్ రిజిస్ర్టార్ కార్యాలయంలో నెలరోజులుగా భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి ఉన్నాయి. జనవరి 1 నుంచి కందుకూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లా నుంచి తప్పించి తిరిగి పూర్వ ప్రకాశం జిల్లాలో విలీనం చేశారు. ఆ మేరకు రాష్ట్రప్రభుత్వం గజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఆ మరుసటి రోజు నుంచి భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి.
కందుకూరులో నెలరోజులుగా నిలిచిన రిజిస్ట్రేషన్లు
1 నుంచి పెరగనున్న భూముల విలువలు
క్రయవిక్రయదారుల ఆందోళన
కందుకూరు, జనవరి 30(ఆంధ్రజ్యోతి): కందుకూరు సబ్ రిజిస్ర్టార్ కార్యాలయంలో నెలరోజులుగా భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి ఉన్నాయి. జనవరి 1 నుంచి కందుకూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లా నుంచి తప్పించి తిరిగి పూర్వ ప్రకాశం జిల్లాలో విలీనం చేశారు. ఆ మేరకు రాష్ట్రప్రభుత్వం గజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఆ మరుసటి రోజు నుంచి భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సర్వర్‌లను నెల్లూరు జిల్లా రిజిస్ట్రార్ పరిధి నుంచి ప్రకాశం జిల్లా రిజిస్ట్రార్ పరిధిలోకి మార్పుచేసే సాంకేతిక అంశాలు పూర్తయ్యేవరకు రెండుమూడు రోజులు రిజిస్ట్రేషన్లు నిలిచిపోతాయని అప్పట్లో చెప్పారు. దీంతో రిజిస్ట్రేషన్ల కోసం కార్యాలయాలకు వచ్చిన వందలాది మంది రైతులు ఆ నాలుగైదు రోజులు వెనుదిరిగి వెళ్లిపోయారు. అయితే నాలుగైదు రోజులు అన్నది నెల గడచినా నేటికీ ఇక్కడ భూములకు రిజిస్ట్రేషన్లు జరగడం లేదు. నెల్లూరు నుంచి ప్రకాశం జిల్లాలోకి సర్వర్ మార్పు ఎప్పుడు చేస్తారు...? రిజిస్ట్రేషన్లు ఎప్పుడు అవుతాయని ప్రజలు ఎదురు చూస్తున్నారు. మరోవైపు రాష్ట్రప్రభుత్వం రీసర్వే అంతా తప్పులను సరిదిద్దేంకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా జిల్లా జాయింట్ కలెక్టరు పరిధిలో ఉన్న అధికారాలను తహసీల్దార్, ఆర్డీవోలకు బదలాయిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. రీసర్వే తప్పులు సరిచేయాలంటే అన్ని అంశాలు జేసీ పరిధిలో ఉంటే సమస్యలను పరిష్కరించడం ఇబ్బందిగా ఉంటుంది. దీంతో పని పూర్తవదన్న ఉద్ధేశ్యంతో ఆయా సమస్య తీవ్రతను బట్టి ఎక్కువశాతం తహసిల్దార్ స్థాయిలోనే సవరించేలా నిబంధనలు సడలించారు. కొన్ని క్లిష్టమైన కేసులను ఆర్‌డవో స్థాయిలో ఉంచారు. అయితే తదనుగుణంగా రెవెన్యూ లాగిన్‌లను సవరించాల్సి ఉంది. ఆ మేరకు సీసీఎల్‌ఏ సవరణకు శ్రీకారం చుట్టడంతో రిజిస్ట్రేషన్లు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రస్తుతం రెవెన్యూ సమస్యను సరిచేసినా, రిజిస్ట్రేషన్లు ఎప్పుడు ప్రారంభిస్తారో.. అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. జనవరి నెలలో సెలవులు అధికంగా ఉండడంతో ఈ ప్రక్రియ ఆలస్యమైందని మరో వారం రోజులు పట్టవచ్చని పలువురు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే నెలరోజులుగా భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు పూర్తిగా నిలిచిపోగా కేవలం నివాసస్థలాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు మాత్రమే జరుగుతున్నాయి. దీంతో కందుకూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వెలవెలబోతోంది.