Share News

రసకందాయంలో కందుకూరు రాజకీయం

ABN , Publish Date - Sep 20 , 2026 | 03:09 AM

కందుకూరు మునిసిపాలిటీ ఎన్నికల రాజకీయం రసకందాయంలో పడింది. పద్నాలుగేళ్లుగా పాలకవర్గం లేని కందుకూరుకు ఎలాగైనా ఎన్నికలు నిర్వహించాలన్న పట్టుదలతో ఎమ్మెల్యే ఇంటూరి, టీడీపీ నాయకులు ప్రయత్నా లు ముమ్మరం చేయగా వాటిని విఫలం చేసేందుకు అదేస్థాయిలో వైసీపీ నేతలు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు.

రసకందాయంలో కందుకూరు రాజకీయం
కందుకూరు మునిసిపల్‌ కార్యాలయం

అభివృద్ధే ధ్యేయంగా ఎన్నికల కోసం టీడీపీ యత్నాలు

ఎన్నికలను అడ్డుకుని తీరాలన్న పట్టుదలలో వైసీపీ

అడ్డంకిగా ఉన్న పిటిషన్‌దారుడిపై పెరుగుతున్న ఒత్తిడి

మాజీ కౌన్సిలర్‌ దాసరి మాల్యాద్రిపై కాల్‌మనీ ఫిర్యాదు

అతనికి మద్దతుగా రంగంలోకి దిగిన మాజీ మంత్రి?

కందుకూరు, సెప్టెంబరు 19 (ఆంధ్ర జ్యోతి): కందుకూరు మునిసిపాలిటీ ఎన్నికల రాజకీయం రసకందాయంలో పడింది. పద్నాలుగేళ్లుగా పాలకవర్గం లేని కందుకూరుకు ఎలాగైనా ఎన్నికలు నిర్వహించాలన్న పట్టుదలతో ఎమ్మెల్యే ఇంటూరి, టీడీపీ నాయకులు ప్రయత్నా లు ముమ్మరం చేయగా వాటిని విఫలం చేసేందుకు అదేస్థాయిలో వైసీపీ నేతలు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఈ ప్రయ త్నాల్లో భాగంగా శనివారం చోటుచేసు కున్న పరిణామాలతో నియోజకవర్గంలో సీనియర్‌ నేతగా ఉన్న మాజీ మంత్రి కూడా రంగంలోకి దిగారు. ఎన్నికల నిర్వహణకు అడ్డంకిగా ఉన్న మాల్యాద్రితో పిటిషన్‌ను ఉపసంహరింపజేసేందుకు గత కొన్నినెలలుగా తాము చేసిన ప్రయత్నాలు ఫలించలేదంటే అతని వెనుక మాజీ మంత్రి ఉండటమే కారణమని టీడీపీ నేతలు ఒక అంచనాకు వచ్చారు. ఎన్నికల జరిపి తీరాలన్న తమ ప్రయత్నాలకు గండికొడుతున్నదని మాజీ మంత్రేనని, వైసీపీ నేతలుగా ప్రస్తుతం చెలామణిలో ఉన్న వారికి అంత సీన్‌ లేదన్న అభిప్రాయాన్ని వారు బాహాటంగానే వ్యక్తం చేస్తున్నారు. దీంతో కందుకూరు మునిసిపాలిటీ ఎన్నికల రాజకీయం వేడెక్కింది.

గ్రామాల విలీన కేసే అడ్డంకి

కందుకూరు మునిసిపాలిటీలో అంతర్భాగంగా ఉన్న గ్రామాల విలీనం, తొలగింపు అంశం కారణంగా కోర్టు కేసులతో ఇన్నేళ్లుగా మునిసిపాలిటీకి ఎన్నికలు జరగని విషయం తెలిసిందే. గత ఐదేళ్లుగా ఎన్నికలకు అడ్డంకిగా మారి ఉన్న వైసీపీ నేత దాసరి మాల్యాద్రి పిటిషన్‌ను ఉపసంహరింపజేయడం ద్వారా ఎన్నికలకు మార్గం సుగమం చేయాలన్న ఆలోచనతో గత ఆరునెలలుగా జరుగుతున్న ప్రయత్నాలు తుదిదశకు చేరాయి. కందుకూరుకు ఎలాగైనా ఎన్నికలు నిర్వహించి తీరాలన్న ప్రభుత్వ పెద్దల ఆదేశాలకు అనుగుణంగా తొలుత మునిసిపాలిటీలోని కొందరు పెద్దల ద్వారా మాల్యాద్రితో సంప్రదింపులు జరిపించారు. దశాబ్దాలుగా ఎన్నికలు జరగక పాలకవర్గం లేని కారణంగా ఏటా కోట్ల రూపాయల ఆర్థికసంఘం నిధులను కోల్పోతూ పట్టణాభివృద్ధి కుంటుపడుతోంది. అందువల్ల ఆ పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని, ఎన్నికల నిర్వహణకు సహకరిస్తే పట్టణ అభివృద్ధిలో భాగస్వామ్యమయ్యే అవకాశం కూడా ఇస్తామని మాల్యాద్రికి నచ్చజెప్పగా నాలుగు నెలలక్రితం అతను సానుకూలత తెలిపారని కూడా తెలిసింది. ఈ దశలో వైసీపీ ముఖ్యనాయకులు రంగంలోకి దిగి అతని మనసు మార్చారు. దీంతో కోర్టు తీర్పు త్వరలోనే వస్తుందని, అందుకు అనుగుణంగా ఎన్నికలకు వెళ్తే సరిపోతుందని భావించిన టీడీపీ పెద్దలు.. మాల్యాద్రితో సంప్రదింపులు పక్కనపెట్టేశారు.

రాని సానుకూలత

అయితే మునిసిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌లోపు కోర్టు తీర్పు, తదనంతర సాంకేతిక ప్రక్రియ చేయగలమో లేదోనన్న సందిగ్థంలో ప్రభుత్వ పెద్దలు వ్యూహం మార్చి తిరిగి మాల్యాద్రితో పిటిషన్‌ను ఉపసంహరింపజేయాలని సూచించినట్లు తెలిసింది. మునిసిపాలిటీ అభివృద్ధి కోసం ఎలాగైనా ఎన్నికలు జరిగేలా చూడాలన్న పట్టుదలతో ఉన్న ఎమ్మెల్యే ఇంటూరి మరోసారి ఆ ప్రయత్నం చేసినా సానుకూలత రాలేదు.

మాల్యాద్రిపై కాల్‌మనీ కేసు

ఈ దశలో పిటిషనర్‌ మాల్యాద్రి వడ్డీ వ్యాపారి కావడం, అతనితో ఆర్థిక లావాదేవీలు ఉన్న పట్టణంలోని బృందావనంకు చెందిన చనమాల శ్రీధర్‌ అనే వ్యక్తి కాల్‌మనీ చట్టం కింద శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. మాల్యాద్రిపై ఫిర్యాదు చేసిన చనమాల శ్రీధర్‌ ఎస్సీ కావడంతో అతను ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం కాల్‌మనీ చట్టంతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కూడా కేసు నమోదు చేయాల్సి వస్తుందని తక్షణం విచారణకు రావాలని పోలీసులు మాల్యాద్రికి అల్టిమేటం పంపించారు. ఈ దశలో వైసీపీలోని ముఖ్యనేతలతోపాటు ప్రస్తుతం ఆ పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్న మాజీ మంత్రి కూడా మాల్యాద్రికి మద్దతుగా రంగంలోకి దిగారు. 2021లో మాల్యాద్రి చేత పిటిషన్‌ వేయించిన వైసీపీ నేత, ప్రస్తుత శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ తూమాటి మాధవరావుతోపాటు, వైసీపీ ఇన్‌చార్జి బుర్రా పరిణామాలను ఎప్పటికప్పుడు ఆ పార్టీ రాష్ట్రనాయకుల ద్వారా అధినేత జగన్‌ దృష్టికి తీసుకెళ్తున్నారు. మరోవైపు మాల్యాద్రిపై ఫిర్యాదు చట్టవిరుద్ధంగా ఉందని మీరు ఆయనను ఆ కారణంగా వేధించటం భావ్యం కాదని పోలీసు అధికారులకు మాజీమంత్రి హెచ్చరిక చేసినట్లు చెబుతున్నారు. పోలీసు స్టేషన్‌లో కేసు విషయం సమాచారం రాగానే మాల్యాద్రి మాజీ మంత్రి మహీధర్‌రెడ్డి వద్దకు వెళ్లి జరుగుతున్న పరిణామాలను వివరించడం, ఆయన రంగంలోకి వచ్చి మాల్యాద్రికి పూర్తిస్థాయిలో అండగా నిలవటం బహిరంగ రహస్యమే అయింది. దీంతో మున్సిపల్‌ ఎన్నికలు జరపాలన్న పట్టుదలతో టీడీపీ అధిష్ఠానం, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు చేస్తున్న ప్రయత్నాలు ఫలించి మున్సిపాలిటీకి ఎన్నికలు జరుగుతాయా లేక వైసీపీ నేతల యత్నాలదే పైచేయి అయి ఈ విడత కూడా ఎన్నికలు వాయిదా పడతాయా అన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

Updated Date - Sep 20 , 2026 | 03:09 AM