Share News

మరో రెండు రోజులే..!

ABN , Publish Date - Oct 01 , 2026 | 01:42 AM

వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నల్లమల సాగర్‌ రిజర్వాయర్‌కు కృష్ణా జలాల విడుదల మరో రెండు రోజులు మాత్రమే కొనసాగనుంది. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం రోజురోజుకూ తగ్గిపోతున్న కారణంగా కొల్లంవాగు హెడ్‌ రెగ్యులేటర్‌ వద్ద ప్రవాహం పడిపోతోంది. దీంతో అక్కడి నుంచి వెలిగొండ ప్రాజెక్టుకు కృష్ణా జలాల ఇన్‌ఫ్లో తగ్గింది.

మరో రెండు రోజులే..!
నీటితో కళకళలాడుతున్న నల్లమల సాగర్‌ రిజర్వాయర్‌

వెలిగొండకు నీరు విడుదల

కొల్లంవాగు వద్ద తగ్గిన ప్రవాహం

నల్లమల రిజర్వాయర్‌లో ప్రస్తుతం 6.88 టీఎంసీల నీరు

8 7 టీఎంసీలకు చేరిన తరువాత నిలిపివేత

మార్కాపురం, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నల్లమల సాగర్‌ రిజర్వాయర్‌కు కృష్ణా జలాల విడుదల మరో రెండు రోజులు మాత్రమే కొనసాగనుంది. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం రోజురోజుకూ తగ్గిపోతున్న కారణంగా కొల్లంవాగు హెడ్‌ రెగ్యులేటర్‌ వద్ద ప్రవాహం పడిపోతోంది. దీంతో అక్కడి నుంచి వెలిగొండ ప్రాజెక్టుకు కృష్ణా జలాల ఇన్‌ఫ్లో తగ్గింది. ప్రస్తుతం రోజుకు 500 క్యూసెక్కుల నీరు మాత్రమే వెలిగొండ టన్నెల్‌ ద్వారా నల్లమల సాగర్‌ రిజర్వాయర్‌కు చేరుతోంది. ఆగస్టు 31న సీఎం చంద్రబాబు ప్రాజెక్టును ప్రారంభించిన తరువాత ఇప్పటివరకు నిరంతరాయంగా నీరు విడుదల చేశారు. ప్రారంభం రోజు 500 క్యూసెక్కులు విడుదల చేసి తరువాత క్రమేణా రోజుకు 5వేల క్యూసెక్కులకు పెంచి కొనసాగిస్తూ వచ్చారు. శ్రీశైలంలో ప్రస్తుతం నీటి మట్టం తగ్గుముఖం పట్టడంతో కొల్లంవాగు వద్ద కూడా ప్రవాహ వేగం మందగించింది. ఈ క్రమంలో 5వేల క్యూసెక్కుల నుంచి తగ్గుతూ కొన్ని రోజుల క్రితం 1,500 క్యూసెక్కులు మాత్రమే వెలిగొండ ద్వారా రావడం ప్రారంభమైంది. ఆ తరువాత ఇంకా తగ్గి వారం రోజులుగా కేవలం 500 క్యూసెక్కులు మాత్రమే వస్తున్నాయి. రిజర్వాయర్‌లో 10.7 టీఎంసీల నీటిని నింపాలని భావించినప్పటికీ శ్రీశైలం ప్రాజెక్టులో నీటి లభ్యత తక్కువగా ఉండటంతో కనీసం 7 టీఎంసీల వరకు విడుదల చేసేలా చూస్తున్నామని ప్రాజెక్టు ఈఈ కృష్ణారెడ్డి చెప్పారు. బుధవారానికి నల్లమల సాగర్‌ రిజర్వాయర్‌ నీటి మట్టం 6.88 టీఎంసీలకు చేరింది. కొల్లంవాగు వద్ద ఫ్లో ఇంకా తగ్గినా మరో రెండు రోజులు యథావిధిగా నీటిని విడుదల చేస్తే 7 టీఎంసీలకు నీరు చేరుతుందని ఈఈ తెలిపారు. అప్పటివరకు ఇలానే కొనసాగించి ఆ తరువాత నిలిపివేసే ఆలోచన చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

Updated Date - Oct 01 , 2026 | 01:42 AM