టీచర్ అభ్యర్థుల్లో ఆనందం
ABN , Publish Date - Oct 15 , 2026 | 03:11 AM
ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం తీపికబురు చెప్పింది. తాజాగా 291 టీచర్ పోస్టులను భర్తీచేసేందుకు డీఎస్సీ-26 షార్ట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 2,721 పోస్టులు భర్తీ చేస్తుండగా అందులో ఉమ్మడి జిల్లా (ప్రకాశం, మార్కాపురం జిల్లాలు) 291తో ద్వితీయ స్థానంలో ఉంది.
డీఎస్సీలో 291 పోస్టులు
వాటిలో కొత్తగా 25 స్పెషల్ ఎడ్యుకేషన్ కొలువులు
వచ్చేనెల 3వరకు దరఖాస్తుల స్వీకరణ
ఒంగోలు విద్య, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం తీపికబురు చెప్పింది. తాజాగా 291 టీచర్ పోస్టులను భర్తీచేసేందుకు డీఎస్సీ-26 షార్ట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 2,721 పోస్టులు భర్తీ చేస్తుండగా అందులో ఉమ్మడి జిల్లా (ప్రకాశం, మార్కాపురం జిల్లాలు) 291తో ద్వితీయ స్థానంలో ఉంది. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మునిసిపాలిటీల్లోని పాఠశాలల్లోని ఖాళీ పోస్టులను ఈ డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తున్నారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్ యాజమాన్య పాఠశాలల్లో 277, మున్సిపాలిటీల్లో మూడు, మున్సిపల్ కార్పొరేషన్లో 11 పోస్టులు భర్తీ చేయనున్నారు. జిల్లాకు కొత్తగా 25 స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిలో 11స్కూలు అసిస్టెంట్, 14 సెకండరీ గ్రేడ్ ఉన్నాయి. ఈ 25 పోస్టులు ప్రస్తుతం ప్రకటించిన డీఎస్సీలో భర్తీ చేస్తున్నారు. గతంలో అర్హులైన అభ్యర్థులు అందుబాటులో లేక మిగిలిపోయిన ఆరు బ్యాక్లాగ్ పోస్టులను కూడా ప్రస్తుత డీఎస్సీలో ప్రకటించారు. సెకండరీ గ్రేడ్ టీచర్లు తెలుగు 170, ఉర్దూ ఒకటి, స్కూలు అసిస్టెంట్ తెలుగు 10, హిందీ 10, ఇంగ్లీషు 17, ఉర్దూ ఒకటి, గణితం 3, ఫిజికల్ సైన్స్ 4. బయోలాజికల్ సైన్స్ 17, సోషల్ 23, ఫిజికల్ ఎడ్యుకేషన్ 11, స్పెషల్ ఎడ్యుకేషన్ 14 పోస్టులు ఉన్నాయి. ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం 95 శాతం పోస్టులు స్థానిక అభ్యర్థులకు, ఐదు శాతం పోస్టులు మాత్రమే నాన్లోకల్ అభ్యర్థులకు లభిస్తాయి. డీఎస్సీ-26 ఆన్లైన్ దరఖాస్తులను నవంబరు 3 నుంచి స్వీకరించనున్నారు. అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నారు. దరఖాస్తుల స్వీకరణ, పరీక్షల షెడ్యూల్ను డీఎస్సీ సమగ్ర నోటిఫికేషన్లో ప్రకటించనున్నారు. డీఎస్సీలో ప్రకటించిన పోస్టులకు సంబంధించి సిలబస్ను ఇప్పటికే అధికారిక వెబ్సైట్లో ఉంచారు. పోస్టులకు సంబంధించిన రోస్టర్ గురువారం ఖరారు కానుంది. అందుకోసం డీఈవో కార్యాలయ అసిస్టెంట్ డైరెక్టర్, సంబంధిత సెక్షన్ అసిస్టెంట్, ఐటీ సెల్ సిబ్బందిని గురువారం మంగళగిరి విద్యాభవన్కు రమ్మన్నారు.
------------------------------